Cotton Seeds : వర్షాలు లేక మొలకెత్తని పత్తి విత్తనాలు

Cotton Seeds : వర్షాకాలంలో ఎంత త్వరగా విత్తనాలు వేస్తే.. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా, పంటలు చేతికి వస్తాయని రైతుల నమ్మకం. అందుకోసమే జూన్‌ నెల ప్రారంభం నుంచే విత్తనాలు వేస్తారు.

Cotton Seeds : వర్షాలు లేక మొలకెత్తని పత్తి విత్తనాలు

Cotton Seeds Do Not Germinate

Cotton Seeds : ఖరీఫ్ పంట కాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. తొలకరి జల్లులను నమ్ముకొని వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. మొలకెత్తిన మొక్కలు ఎండలకు వాడిపోతున్నాయి. ఇక కొత్తగా విత్తనాలు వేసేందుకు భూమిలో పదును లేదు. కాగా దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు వర్షం ఎప్పుడు పడుతుందా.. విత్తనాలు ఎప్పు డు వేద్దామా అని ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

వర్షాకాలంలో ఎంత త్వరగా విత్తనాలు వేస్తే.. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా, పంటలు చేతికి వస్తాయని రైతుల నమ్మకం. అందుకోసమే జూన్‌ నెల ప్రారంభం నుంచే విత్తనాలు వేస్తారు.  ఈసారి కాస్త ముందుగానే వర్షాలు కురియడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు . జూన్ కి ముందే దుక్కులు దున్ని తమ వ్యవసాయ క్షేత్రాలను సిద్ధం చేసుకున్న రైతులు ఎప్పటిలాగే పత్తి విత్తనాలు విత్తుకున్నారు. అంతలోనే వర్షం మొఖం చాటేయడంతో విత్తనాలను పురుగులు తినేశాయి.

అక్కడక్కడ కురిసిన వర్షానికి పత్తి మొలకలు వచ్చినా… నీటి లభ్యత లేక ఆ మొక్కలు కూడా ఎండిపోయిన పరిస్థితి. కొన్ని చోట్ల నీటి లభ్యత ఉన్న రైతులు మాత్రం తమ పత్తి మొక్కలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా వర్షం పైనే ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు రైతులు.

జిల్లాలోని 26 మండలాల్లోఇప్పటి వరకు వర్షం జాడలేకపోగా.. మరో 12 మండలాల్లోమాత్రం 59 శాతం వర్షపాతం నమోదైంది. ఇక్కడ సరిపడ వర్షాలు కురవకపోవడం, వాతావరణ వేడిగా మారడం శాపంగా మారింది. మొలిచిన మొక్కలు చనిపోయాయి. దీంతో చేసేదేమీ లేక మరోసారి పత్తి విత్తనాలు విత్తుకుంటున్నారు అన్నదాతలు.

ఏ ఏటికాయేడు పత్తిసాగు భారంగా మారుతోంది. విత్తన ధరలు, కూలీ రేట్లు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఇలా ప్రతిది పెరిగిపోయినా.. వ్యవసాయం చేసేందుకే మొగ్గుచూపుతున్న రైతులను మాత్రం వరుణదేవుడు కరిణించడం లేదని వాపోతున్నారు. రెండో సారి పత్తిని విత్తే రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం చేయాలని కోరుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి దాదాపు 14 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగు అవుతుందని అదికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటికే విత్తనాలు విత్తుకున్న రైతులు వర్షం లేక, వాతావరణంలో వేడి పెరిగి నష్టపోగా… మరోసారి విత్తనాలు విత్తుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండవసారైనా వరుణుడు కరుణించకపోతాడా అని ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు