Sunflower Cultivation : ఖరీఫ్ ప్రొద్దుతిరుగుడు రకాలు.. సాగు మెళకువలు

Sunflower Cultivation : రాష్ట్రాలలో సాగవుతున్న నూనెగింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇందులో అత్యధికంగా నూనెశాతం 35 నుంచి 40 శాతం వరకు వుంటుంది.

Sunflower Cultivation : ఖరీఫ్ ప్రొద్దుతిరుగుడు రకాలు.. సాగు మెళకువలు

Sunflower Cultivation

Sunflower Cultivation : నూనెగింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ప్రధానమైనపంట. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప,  నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో అధిక విస్ధీర్ణంలో సాగవుతోంది. మిగిలిన నూనెగింజల పంటలతో పోలిస్తే ఈ పంటలో నూనెశాతం అధికంగా వుండటం వల్ల రైతులు దీని సాగుకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఏపంటా వేయని ప్రాంతాల్లో ఇప్పుడు ప్రొద్దుతిరుగుడును సాగుచేసుకునే అవకాశం వుంది. మరి, ఈపంటలో అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి యాజమాన్య చర్యలు పాటించాలో తెలుకుందాం.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

రాష్ట్రాలలో సాగవుతున్న నూనెగింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇందులో అత్యధికంగా నూనెశాతం 35 నుంచి 40 శాతం వరకు వుంటుంది. దీని నుంచి వచ్చిన నూనెను వంటకోసమే కాక అనేక సుగంధ పరిశ్రమల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రొద్దుతిరుగుడు సాగుకు మురుగునీటి సౌకర్యం వున్న ఎర్రచల్కా, రేగడి, ఒండ్రు నేలలు అనుకూలం. ఆమ్ల,చౌడు భూములు ఈపంట సాగుకు పనికిరావు. నీటివసతి వున్న ప్రాంతాల్లో ఈడాది పొడవునా ఈపంటను సాగుచేసుకునే అవకాశమున్నా… పూత , గింజకట్టు సమయాల్లో అధిక వర్షాలు లేదా పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు మించకుండా వుంటే నాణ్యమైన, అధిక దిగుబడుల పొందవచ్చు.

ప్రొద్దుతిరుగుడును తేలికపాటి నేలల్లో జులై చివరి వరకు , బరువైన నేలల్లో ఆగష్టు రెండవపక్షం వరకు విత్తుకునే అవకాశముంది.  ముందుగా ఎంచుకున్న భూమిని 3,4సార్లు బాగా దుక్కిదున్ని,చదును చేసుకోవాలి. ఈపంటలో పలు ప్రైవేటు సంస్థలు విడుదల చేసిన సంకర రకాలే కాక… తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిధ్యాలయాలు  విడుదల చేసిన హైబ్రీడ్ రకాలు కూడా అధిక దిగుబడులతో రైతుల క్షేత్రాలలో సత్ఫలితాలిస్తున్నాయి.  వీటిలో KBSH-44, NDSH-1, DRSH-1, NDSH-1012 వంటి సంకర వంగడాలు మనప్రాంతంలో సాగుకు అనువుగా వున్నాయి. ఎకరా పొలంలో విత్తటానికి 2కిలోల విత్తనం సరిపోతుంది. అయితే, ప్రొద్దుతిరుగుడును వర్షాధారంగా సాగుచేసేటపుడు విత్తనం తొందరగా మొలకెత్తటానికి లీటరు నీటికి కిలో విత్తనం చొప్పున 14 గంటలపాటు మంచినీటిలో నానబెట్టి, తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి.

ప్రధాన పొలంలో విత్తేముందుగా కిలో విత్తనానికి 4 గ్రాముల థయోమిథాక్సోమ్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తనశుద్ది చేసినట్లయితే పంటను కొంతవరకు తెగుళ్ళు, రసం పీల్చు పురుగుల బారి నుంచి రక్షించవచ్చు. ప్రొద్దుతిరుగుడులో మొక్కల సాంద్రత అనేది చాలా కీలకం. వరుసలమధ్య 45నుంచి 60 సెంటీమీటర్లు, మొక్కలమధ్య 20 నుంచి30 సెంటీమీటర్ల దూరంతో విత్తుకున్నట్లయితే పొలంలో వుండవలసిన మొక్కల సాంద్రత వుండి, ఆశించిన దిగుబడులు పొందగలం. విత్తిన 15రోజుల తర్వాత ఒక్కో కుదురుకు ఒక్క ఆరోగ్యవంతమైన మొక్కను వుంచి, మిగిలిన వాటిని తీసివేయాలి. ఇలా చేయటం ద్వారా మొక్కల మధ్య నీటికి, ఎరువులకు పోటీ లేకుండా వుండి మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి.

ప్రొద్దుతిరుగుడును ఏకపంటగానే కాక కంది, వేరుశనగ, ఆముదం వంటి పంటలతో కలిపి అంతరపంటలుగా కూడా సాగు చేయవచ్చు. కలుపు నివారణకుగాను లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ల పెండిమిథాలిన్ కలిపి విత్తిన వెంటనే, భూమిలో తగినంత తేమ వున్నప్పుడు నేలపై సమానంగా పిచికారీ చేసుకోవాలి. పైరు నెలరోజుల దశలో మరొకసారి మనుషులతో అంతరకృషి చేసినట్లయితే కలుపును పూర్తిగా అరికట్టవచ్చు. అందించే పోషకాలపైనే పంట దిగుబడులు ఆధారపడి వుంటాయి. కాబట్టి, సిఫారసు చేసిన రసాయన ఎరువులతోపాటు సేంద్రీయ ఎరువులను కలిపి సమగ్రంగా అందించాలి. ముందుగా ఆఖరిదుక్కిలో ఎకరాకు 3టన్నుల పశువులఎరువును వేసి, బాగా కలియదున్నాలి.

విత్తేసమయంలో 26కిలోల యూరియాతోపాటు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను వేసుకోవాలి. పైరు 30రోజుల దశలో ఒకసారి, 50రోజుల దశలో మరొకసారి ఎకరాకు 13కిలోల చొప్పున యూరియాను పైపాటుగా అందించినట్లయితే మొక్కలు ఏపుగా ఎదుగుతాయి. పైపాటుగా ఎరువులను వేసిన తరువాత తప్పనిసరిగా ఒక నీటితడిని ఇచ్చినట్లయితే పోషకాల వినియోగ సామర్థ్యం  పెరుగుతుంది. గంధకాన్ని జిప్సం రూపంలో ఎకరాకు 10కిలోలు వేసుకున్నట్లయితే గింజల్లో నూనెశాతం పెరిగి, అధిక దిగుబడులు పొందవచ్చు. దీనితోపాటు పైరు పూతదశలో వున్నప్పుడు లీటరు నీటికి 2గ్రాముల బోరాక్స్ ను కలిపి పిచికారీ చేసినట్లయితే గింజల్లో తాలు శాతం తగ్గి, బాగా వృద్ధి చెందుతాయి. వాతావరణ పరిస్థితులను బట్టి నీటితడులను అందించాల్సి వుంటుంది. పంట కీలకదశలైన మొగ్గ, పువ్వు వికశించు దశ, గింజకట్టు దశలో పైరు బెట్టకు గురికాకుండా చూసుకోవాలి.

ప్రొద్దుతిరుగుడులో పరాగసంపర్కం తేనెటీగల ద్వారా జరుగుతుంది. తేనెటీగలు తక్కువగా వున్న పరిస్థితుల్లో మెత్తటి గుడ్డను లేదా దూదిని ఉపయోగించి పువ్వుపై రుద్దటం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఈపంట సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య- పక్షుల బెడద. మెరుపు రిబ్బన్లను పంట కన్నా ఎత్తులో కట్టటం, పొలంలో అక్కడక్కడా దిష్ఠిబొమ్మలను పెట్టి వీటి బారినుంచి  పైరను కాపాడవచ్చు. వీటితోపాటు సమయానుకూలంగా అన్ని సస్యరక్షణా పద్దతులను ఆచరిస్తూ… సకాలంలో కోతలు చేసినట్లయితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు