కొత్త లేబర్‌ కోడ్స్‌: గిగ్ వర్కర్లు సహా ఉద్యోగులు తెలుసుకోవాల్సిన 5 కీలక అంశాలు ఇవే.. ఎన్ని లాభాలో..

మహిళలకు కొత్త అవకాశాలు అందుతాయి. ఈ మార్పు వేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విభాగాల్లో విస్తృత అవకాశాలను ఏర్పరుస్తుంది.

కొత్త లేబర్‌ కోడ్స్‌: గిగ్ వర్కర్లు సహా ఉద్యోగులు తెలుసుకోవాల్సిన 5 కీలక అంశాలు ఇవే.. ఎన్ని లాభాలో..

Updated On : November 27, 2025 / 7:26 PM IST

New labour codes: దేశంలో కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త వ్యవస్థ రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో దీని ద్వారా మనకు చేకూరే కీలక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

మొదటిసారి గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లు లేబర్ చట్టంలో గుర్తింపు పొందారు. చాలా కాలంపాటు అధికారికంగా భద్రత లేకుండా పనిచేసిన ఆయా వర్కర్లకు ఇది శుభపరిణామం. (New labour codes)

జిప్పీ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో మాధవ్ కస్తూరియా దీని గురించి వివరిస్తూ.. “కొత్త లేబర్ కోడ్స్ ద్వారా గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లు ఎట్టకేలకు చట్టంలో గుర్తింపు పొందారు. దీని ద్వారా వారికి బీమా, పీఎఫ్ సంబంధిత ప్రయోజనాలతో పాటు పెన్షన్ వంటి సౌకర్యాలు అందే అవకాశం ఉంటుంది” అని తెలిపారు.

ఈ గుర్తింపు డెలివరీ పార్ట్‌నర్లకు, యాప్ బేస్డ్‌ వర్కర్లకు ఆర్థిక రక్షణను ఇస్తుంది. ఈ కొత్త వ్యవస్థలో అపాయింట్‌మెంట్ లెటర్లు, కనీస వేతనం ఇవ్వడం, సమయానికి జీతం చెల్లింపులు చేయడం వంటివి అన్ని వర్గాల కార్మికులకు తప్పనిసరి.

“కనీస వేతనం, సమయానికి చెల్లింపులు అన్ని వర్గాల కార్మికులకు తప్పనిసరి. ఇది వేర్వేరు షిఫ్ట్‌లలో పనిచేసే డెలివరీ పార్ట్‌నర్ల ఆదాయంలో ఉన్న తేడాలను తగ్గిస్తుంది” అని కస్తూరియా తెలిపారు. స్థిరమైన ఆదాయం కుటుంబ ఆర్థిక ప్రణాళికకు కీలకం.

Also Read: అత్యధిక ధరకు అమ్ముడుపోయిన టాప్-10 ప్లేయర్లు వీరే.. అమ్ముడుపోనివారు ఎవరెవరంటే?

ఆరోగ్య భద్రత, వార్షిక వైద్య పరీక్షలు
ఈ చట్టంలోని కొత్త నిబంధనలు ఈఎస్ఐ పరిధిని పెంచి, ఉచిత వార్షిక వైద్య పరీక్షలను అందిస్తూ ఆరోగ్య రక్షణకు తోడ్పడతాయి. “ఉచిత వార్షిక వైద్య పరీక్షలు, ఈఎస్ఐ ప్రయోజనాలు పెరగడం వంటివి రోడ్ల మీదుగా ఎక్కువ సమయం తిరిగే గిగ్ వర్కర్లకు ఎంతగానో ఉపయోగపడతాయి” అని కస్తూరియా చెప్పారు.

మహిళలకు కొత్త అవకాశాలు
ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం.. మహిళలు ఇప్పుడు అన్ని రకాల విధుల్లో పనిచేసే అవకాశాన్ని పొందుతారు. అంటే మహిళలు కేవలం కొన్ని నిర్దిష్ట పనులకే పరిమితం కాకుండా, వివిధ విధుల్లో, అన్ని విభాగాల్లో, అన్ని రకాల బాధ్యతల్లో, అన్ని రకాల షిఫ్టుల్లో (ఉదా: నైట్ షిఫ్ట్) వంటివి కూడా చేయొచ్చు. అయితే, అందుకు అవసరమైన భద్రతా చర్యలు కూడా కంపెనీల్లో అమలులో ఉండాలి. ఈ మార్పు వేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విభాగాల్లో విస్తృత అవకాశాలను ఏర్పరుస్తుంది.

కొత్త మోడల్
జిగ్ వర్కర్ల సంక్షేమానికి కొత్త మోడల్ వస్తోంది. ప్లాట్‌ఫాం సంస్థలు తమ టర్నోవర్‌లో 1 నుంచి 2% సామాజిక భద్రత నిధికి చెల్లిస్తాయి. ఇది బీమా, పెన్షన్ ఇతర దీర్ఘకాల ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది.