తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై ఆ ప్రచారంలో నిజం లేదు- టీటీడీ

సోషల్ మీడియాలో లడ్డూల తయారీపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై ఆ ప్రచారంలో నిజం లేదు- టీటీడీ

TTD On Srivari Laddu Making : సోషల్ మీడియాలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై జరుగుతున్న ప్రచారంపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. ఆ ప్రచారాన్ని ఖండించింది. అది అసత్య ప్రచారం అని చెప్పింది. శ్రీవారి లడ్డూ తయారీ కాంట్రాక్ట్ ను అనమతస్తులు(థామస్ అనే కాంట్రాక్టర్) తీసుకున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ.. సోషల్ మీడియాలో లడ్డూల తయారీపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అనాదిగా శ్రీ వైష్ణవ బ్రాహ్మణులే తయారు చేస్తున్నారని స్పష్టం చేసింది.

లడ్డూ తయారీపై ఎటువంటి అపోహలొద్దని టీటీడీ సూచించింది. దుష్ప్రచారాలు నమ్మొద్దని భక్తులను కోరింది. తిరుమల శ్రీవారి పోటులో 980 మంది హిందూ మతానికి చెందిన కార్మికులు విధులను నిర్వహిస్తున్నారని వివరించింది. వీరిలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూల తయారీ, ముడి సరుకులు తీసుకురావడం వంటి పనులు చేస్తారని వెల్లడించింది. ఇతరులు లడ్డూలను తరలించడం, ఉగ్రాణం, పడి పోటు, లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. లడ్డూ తయారీకి సంబంధించి అన్యమతస్తులకు ఎలాంటి కాంట్రాక్ట్ ఇవ్వలేదని, లడ్డూ తయారీలో అన్యమతస్తులు ఎవరూ లేరని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువుదీరిన ఈ క్షేత్రానికి నిత్యం దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. స్వామి వారిని దర్శించుకుని పులకించి పోతారు. శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు అత్యంత పవిత్రంగా భావించేది తిరుమల శ్రీవారి లడ్డూనే. తిరుమలకు వెళ్లిన భక్తులు.. కచ్చితంగా స్వామి వారి లడ్డూ ప్రసాదం తీసుకుంటారు. లడ్డూ ప్రసాదం తీసుకోకుండా అక్కడి నుంచి రారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి అత్యంత భక్తి శ్రద్దలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన లడ్డూ ప్రసాదం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కలకలం రేపింది.

అన్యమతస్తులు శ్రీవారి లడ్డూ తయారు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై భక్తుల్లో కలవరం రేగింది. ఈ విషయం టీటీడీ దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన టీటీడీ.. లడ్డూ తయారీ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంది. భక్తులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది.

Also Read : కల్పితం కాదు, రామసేతు వారధి వాస్తవ నిర్మాణమే.. ఏళ్ల నాటి రహస్యాన్ని వెలుగులోకి తెచ్చిన ఇస్రో