ప్రకృతి ఒడిలో ఉత్సాహంగా అమర్‌నాథ్‌ యాత్ర.. మొదటి 5 రోజుల్లోనే లక్ష దాటిన దర్శనాలు

హరహర మహాదేవస్మరణతో మార్మోగుతోన్నాయి హిమగిరులు. యాత్ర మొదలై వారం రోజులు కాలేదు. అప్పుడే లక్ష మంది మంచులింగాన్ని దర్శించుకున్నారు.

ప్రకృతి ఒడిలో ఉత్సాహంగా అమర్‌నాథ్‌ యాత్ర.. మొదటి 5 రోజుల్లోనే లక్ష దాటిన దర్శనాలు

Amarnath Yatra 2024 Over one lakh devotees visit holy cave shrine in five days

Amarnath Yatra 2024 : హిమగిరుల మధ్య భక్తుల సాహస యాత్ర.. నమ్మకమే భక్తిగా.. మనోహరమైన పరమశివుడి దివ్యరూపం మంచులింగాన్ని దర్శించుకునేందుకు భక్తుల ప్రయాణం కొనసాగుతోంది. హరహర మహాదేవస్మరణతో మార్మోగుతోన్నాయి హిమగిరులు. యాత్ర మొదలై వారం రోజులు కాలేదు. అప్పుడే లక్ష మంది మంచులింగాన్ని దర్శించుకున్నారు. మొదటి ఐదు రోజుల్లోనే లక్ష దర్శనాలు దాటినట్లు అమర్‌నాథ్‌ టెంపుల్ అధికారులు ప్రకటించారు. ఇది రికార్డుగా చెప్తున్నారు. గత సంవత్సరం మొదటి ఐదు రోజుల్లో దాదాపు 50 వేల మంది యాత్రికులే దర్శించుకున్నారు. ఈసారి ఇప్పటికే లక్ష మంది దర్శించుకోగా మరో 45 రోజులు యాత్ర కొనసాగనుంది. ఈ లెక్కన 5 లక్షల మంది దర్శించుకుంటారని వేసిన అంచనాలు దాటిపోయే అవకాశం ఉంది. ఏడెనిమిది లక్షల మంది మంచులింగాన్ని దర్శించుకున్నా ఆశ్చర్యపోనవరం లేదు.

ఇక విడతల వారీగా అమర్‌నాథ్‌ యాత్రకు భక్తులు.. యాత్రి నివాస్‌లకు చేరుకుంటూనే ఉన్నారు. 5 వేల 696 మంది యాత్రికుల బృందం జమ్మూలోని భగవతినగర్ యాత్రి నివాస్ నుంచి రెండు ఎస్కార్ట్ కాన్వాయ్‌లలో లోయకు బయలుదేరింది. ఇందులో 2028 మంది యాత్రికులు 97 వాహనాలతో కూడిన ఎస్కార్టెడ్ కాన్వాయ్‌లో ఉత్తర కశ్మీర్ లోని బల్తాల్ బేస్ క్యాంప్‌కు బయలుదేరగా, 3 వేల 668 మంది 122 వాహనాలతో కూడిన మరో ఎస్కార్టెడ్ కాన్వాయ్‌లో దక్షిణ కశ్మీర్ పహల్గామ్ బేస్ క్యాంపుకు వెళ్లారు.

రెండు రూట్లలో భక్తులు అమర్‌నాథ్‌ చేరుకుంటారు. అందులో ఒకటి పహల్‌గామ్ బేస్ క్యాంపు నుంచి నున్వాన్‌ మీదుగా చేరుకుంటున్నారు. ఈ రూట్‌ దాదాపు 48 కిలోమీటర్లు ఉంటుంది. ఇక రెండోది బల్తాల్ బేస్ క్యాంపు సెంట్రల్ కశ్మీర్‌లోని గండర్బల్ మీదుగా వెళ్తుంది. ఇది దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ మార్గంలో వెళ్లడం చాలా కష్టం. ఈ రూట్లో ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. హెల్దీగా ఉన్నవారే బల్తాల్‌ బేస్‌ క్యాంప్‌ మార్గంలో వెళ్లాలని అమర్‌నాథ్‌ టెంపుల్‌ బోర్డు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తోంది.

పహల్‌గామ్‌ మీదుగా అమర్‌నాథ్ గుహను చేరుకోవడానికి దాదాపు 5రోజుల పడుతోంది. అక్కడికి చేరుకోవడానికి భక్తులు పోనీలను వాడుతున్నారు. కొందరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక జమ్మూ నుంచి బాల్తాల్‌ వరకు టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు. దీని ద్వారా అమర్‌నాథ్ గుహకు వెళ్లవచ్చు.

అమర్‌నాథ్‌ యాత్ర జరిగే ఏరియాల్లో వెదర్ క్లౌడీ కండీషన్‌లో ఉంది. తేలికపాటి వర్షం, ఉరుములతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అంతేకాదు రెండు యాత్ర మార్గాల్లో ఆకాశం మేఘావృతమైన ఉంటుందని అంచనా వేసింది. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయోనన్న భావనతో.. త్వరగా అమర్‌నాథ్‌ యాత్రను పూర్తి చేస్తున్నారు భక్తులు. గతంలో మాదిరిగా మంచుకొండలు విరిగిపడి.. వర్షాలతో యాత్రకు అడ్డంకులు ఏర్పడితే అంత దూరం వెళ్లి ఇబ్బందిపడాల్సి వస్తుందని.. ముందుగానే దర్శనం చేసుకుని వెనుదిరుగుతున్నారు. మరికొందరు మాత్రం వెదర్ కండీషన్‌కు అనుగుణంగా అమర్‌నాథ్‌ యాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు.

7 వేల మంది వాలంటీర్లు
అమర్‌నాథ్ గుహ.. శివుని ప్రధాన ధార్మిక క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడే పరమశివుడు.. పార్వతిదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్పాడు. అందుకే ఇది అమర్‌నాథ్ యాత్రగా మారింది. ఇక యాత్రకు హాజరయ్యే భక్తులకు ఆరోగ్య సమస్యలు వస్తే.. చికిత్స అందిస్తున్నారు అధికారులు. రెండు బేస్‌ క్యాంపుల దగ్గర 100 పడకల ఆసుపత్రుల్లో సేవలు కొనసాగుతున్నాయి. తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురైతే.. తరలించేందుకు అంబులెన్సులు రెడీగా ఉంచారు. అవసరమైతే హెలికాప్టర్ల ద్వారా కూడా లిఫ్ట్ చేయనున్నారు. 7 వేల మంది వాలంటీర్లు యాత్రికులకు సేవలు అందిస్తున్నారు. ఇప్పటికైతే వాతావరణం అనుకూలిస్తుండటంతో యాత్ర సాఫీగా కొనసాగుతోంది.

మహాద్భుత శివలింగం దర్శన భాగ్యం
ప్రతీ ఏడాది సమ్మర్‌ అయిపోయాకే ఈ మహాద్భుత శివలింగం దర్శన భాగ్యం కలుగుతుంది. అదీ సమయానుకూలంగా ఏడాదిలో నెల నుంచి రెండు నెలల మధ్యే ఉంటుంది. అమర్‌నాథ్‌ గుహ మీదుగా జారే నీటిబొట్లు లింగాకారంలోకి మారుతాయ్. వేల ఏళ్ల నుంచి ఇలానే జరుగుతోంది. ఈ మనోహర దృశ్యాన్ని చూసేందుకే భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు. ఎన్నో కష్టాలను ఓర్చి హరహరుడిని దర్శించుకుంటున్నారు. అమర లింగేశ్వరుడిని దర్శించి జన్మసార్థకం చేసుకోవాలని.. ఆ క్షణాన్ని జీవితకాలం జ్ఞాపకంగా మార్చుకోవాలని భక్తులు భావిస్తుంటారు.

Also Read: వారాహి అమ్మవారి దీక్ష ఎందుకు చేస్తారు? వారాహి అమ్మవారు ఎవరు?

13 వేల అడుగుల ఎత్తులో.. 
హిమాలయాల్లో దాదాపు 3 వేల 880 మీటర్ల ఎత్తులో అంటే దాదాపు 13 వేల అడుగుల ఎత్తులో అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం ఉంటుంది. మంచు రూపంలో శివుడు, పార్వతి, గణపతి కొలువైన ప్రదేశంగా ఈ మహాక్షేత్రం ప్రతీతి. జీవితంలో ఒక్కసారైనా శివుడి దర్శనం కోసం పరితపించే భక్తులు ఏటా భారీగా తరలివస్తున్నారు. శ్రీనగర్ నగరానికి ఈశాన్యంగా 145 కిలోమీటర్ల దూరంలో ఉంది అమర్‌నాథ్‌ క్షేత్రం. ఈ గుహ పొడవు 19 మీటర్లు, వెడల్పు 16 మీటర్లు. సహజమైన ఈ గుహాలయంలో మంచుతో అతి సహజంగా శివలింగం ఆవిర్భవిస్తుంది. ఏటా ఆషాఢ మాసంలో మొదలయ్యే యాత్ర రాఖీ పౌర్ణమి వరకు కొనసాగుతోంది. ఆ తర్వాత మంచు కారణంగా యాత్ర కొనసాగించడం అసాధ్యం.