Cultivation Management : వానాకాలం బెండసాగు.. అధిక దిగుబడుల కోసం యాజమాన్య పద్ధతులు

Cultivation Management : వాణిజ్య పంటలకంటే కూరగాయల సాగు రైతులకు లాభదాయకంగా మారింది. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో రైతులకు సాగు లాభదాయకంగా మారింది.

Cultivation Management : వానాకాలం బెండసాగు.. అధిక దిగుబడుల కోసం యాజమాన్య పద్ధతులు

Tips for Lady finger Cultivation In rain Season

Cultivation Management : కాలానుగుణంగా సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు మంచి ఆర్ధిక ఫలితాలు సాధిస్తున్నారు. మార్కెట్లో మండిపోతున్న కూరగాయల రేట్లే, ఇందుకు ప్రత్యక్ష ఊదాహరణ. వేసవిలో నీటి వసతి కింద కూరగాయల సాగుచేసిన రైతుకు ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తోంది. కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులున్నా..  స్ధిరమైన ఆదాయన్నిచ్చే పంటగా బెండసాగు రైతుల ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా వుండటంతో రైతులు బెండసాగుకు సన్నద్ధమవుతున్నారు. దీని సాగు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలి కాలంలో వాణిజ్య పంటలకంటే కూరగాయల సాగు రైతులకు లాభదాయకంగా మారింది. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో రైతులకు సాగు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా  బెండ, వంగ వంటి కూరగాయ పంటలు మర్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు తక్కువ. చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సకాలంలో తగిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండసాగులో ఎకరాకు 5 నుంచి 10టన్నుల దిగుబడిని సాధించవచ్చు. మన ప్రాంతంలో బెండను దాదాపు 2లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు.

Read Also : Kharif Paddy Cultivation : ఖరీఫ్ వరిసాగులో సమగ్ర యాజమాన్యం

దీని సాగుకు వేడి వాతావరణం ఎక్కువ అనుకూలం . అందువల్ల తొలకరి పంటగా జూన్ నుంచి ఆగష్టు వరకు, వేసవి పంటగా జనవరి నుంచి ఈ పంటను సాగుచేస్తున్నారు. బెండ సాగుకు అనువైన రకాలను గమనిస్తే  పర్భనీ క్రాంతి, అర్క అనామిక, అర్క అభయ రకాలు ఎకరాకు 5టన్నుల దిగుబడి సామర్ధ్యంతో రైతుక్షేత్రాల్లో మంచి ఫలితాలనిస్తున్నాయి. వీటి పంటకాలం 85 నుంచి 90రోజులు. బెండసాగులో ప్రధాన సమస్య అయినా ఎల్లోవీన్ మొజాయిక్ తెగులును అర్క అభయ రకం సమర్ధవంతంగా తట్టుకుంటుంది.

ఇవేకాక వివిధ ప్రైవేటు కంపెనీల నుంచి అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ బెండ రకాలు రైతులకు అందుబాటులో వున్నాయి. ఆయా ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తెగుళ్లను తట్టుకునే రకాలను రైతులు ఎంపిక చేసుకోవాలి. సారవంతమైన నీరు ఇంకే తేలిక నేలలు, మురుగు నీరు పోయే సౌకర్యంగల తేలికపాటి నల్లనేలలు బెండ సాగుకు అనుకూలం. ఎకరాకు 4 నుంచి 6 కిలోల విత్తనం అవసరమవుతుంది. హెబ్రిడ్ లు అయితే 2-2.5 కిలోల విత్తనం సరిపోతుంది.

విత్తేముందు కిలో విత్తనానికి 5గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ కలిపి తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి పట్టించి విత్తనశుద్ధి చేయాలి. భూమిని మెత్తగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరానికి 6 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. వర్షాకాలపు పంట కనుక 60 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు తయారుచేసుకోవాలి. విత్తే ముందు ఎకరాకు 24కిలోల భాస్వరం, 24కిలోల పొటాష్, 16కిలోల నత్రజనినిచ్చే ఎరువులను వేయాలి. బోదెల మీద 30 సెంటీమీటర్ల ఎడంతో విత్తనం విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టి, మరలా 5రోజులకు రెండవ తడి ఇవ్వాలి.

నాటిన 45వ రోజునుంచి బెండ దిగుబడి : 
కలుపు నివారణకు విత్తిన వెంటనే ఎకరాకు 1.2లీటర్ల పెండిమిథాలిన్ మందును 200లీటర్ల నీటిలో కలిపి పిచికారిచేయాలి. ప్రతి వారం 10రోజుల వ్యవధితో నీటితడులు అందిస్తే 30 రోజుల నుంచి పూత ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మరో 16కిలోల నత్రజనిని యూరియా రూపంలో అందిస్తే కాపు బాగుంటుంది. ఇదే మోతాదులో నత్రజనిని 45రోజులకు మరోసారి అందించాలి. పంట పూత దశలో 10గ్రాముల యూరియా లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారిచేయటం ద్వారా 20-25శాతం నత్రజనిని ఆదాచేసుకోవచ్చు. నాటిన 45వ రోజునుంచి బెండ దిగుబడి ప్రారంభమవుతుంది.

బెండసాగులో ఇటీవల రైతాంగం పాలీ మల్చింగ్ విధానాన్ని అనుసరించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. 3అడుగుల వెడల్పుతో బెడ్లను పశువుల ఎరువు, ఇతర రసాయన ఎరువులను కలిపి తయారుచేసుకుని దీనిపై 4 అడుగుల వెడల్పున్న మల్చ్ షీట్ ను కప్పి విత్తనం నాటుతారు. ఈ విధానంలో ఒక్కో బెడ్ పై రెండు వరుసల్లో మొక్కలు వస్తాయి. పూర్తిగా డ్రిప్ పద్ధతిలో నీరందించటం వల్ల పైరు పెరుగుదల ఆశాజనకంగా వుంది.

ఎరువులను కూడా డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో అందించే వీలుంది. ఈ పాలీమల్చింగ్ కు ఎకరాకు 15వేల ఖర్చవుతున్నా.. ఆ తర్వాత కలుపు సమస్య లేకపోవటం, ఎరువులు సమర్ధ వినియోగంతో ఖర్చు కలిసొస్తోంది. రెండోపంటకు కూడా ఈ మల్చ్ షీట్ ను వాడుకునే అవకాశం వుంది. బెండ పంటకాలం కూడా 30-45రోజులు పెరుగుతుంది. సాధారణ పద్ధతితో పోలిస్తే దిగుబడి 50-60శాతం పెరిగుతున్నట్లు రైతుల అనుభవాలు నిరూపిస్తున్నాయి.

బెండను ప్రధానంగా ఆశించే తెగుళ్లలో బూడిద తెగులు, ఎల్లోవీన్ మొజాయిక్ తెగులు ముఖ్యమైనవి. బూడిద తెగులు ఆశించినప్పుడు ఆకులపైన, అడుగుభాగాన బూడిద వంటి పొరతో కప్పబడి వుంటుంది. తేమ ఎక్కువ వున్నప్పుడు ఈ తెగులు తీవ్రత ఎక్కువ వుంటుంది. ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి. దీని నివారణకు 3గ్రాముల నీటిలో కరిగే గంధకం పొడి లేదా 1మిల్లీలీటరు డైనోకాప్ లేదా 2మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారిచేయాలి.

బెండను ఆశించే ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్ తెగులును శంఖు తెగులు అంటారు. తెల్లదోమ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. వైరస్ తెగులు అవటం వల్ల దీనికి నివారణ లేదు. తెగులును వ్యాప్తిచేసే తెల్లదోమ నివారణకు డైమిథోయేట్ 2మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారిచేయాలి. బెండ విత్తిన 45 రోజుల నుంచి ప్రతి 2,3రోజులకు ఒక కోతచొప్పున కోయాలి. ఈ సమయంలో కూలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలి. కోతలు ఏమాత్రం ఆలస్యమైన కాయ ముదిరిపోయి మార్కెట్ విలువ తగ్గిపోతుంది.

ప్రతి కోతలోను ఎకరాకు 4 – 5క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. కోసే కొద్దీ పూత వచ్చి మరలా కాయ దిగుబడి వస్తుంది. పంటకాలం 3నెలలే అయినా మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4-5 నెలల వరకు పంటకాలం పొడిగించి, అధిక దిగుబడి పొందవచ్చు. బెండ ధరల్లో మార్కెట్ ఒడిదుడుకులు వున్నా సరాసరిన కిలోకు 10-15 రూపాయల ధర రైతు పొందగలుగుతున్నాడు.దీనివల్ల సాగు ఖర్చులు పోను ఎకరాకు 30 నుంచి50వేల నికరలాభం ఆర్జించే ఆవకాశముంది.

Read Also : Paddy Cultivation : నారులేదు… నాటుతో పని అసలే లేదు.. నేరుగా వెదజల్లే పద్ధతిలో వరిసాగు