Paris olympics 2024 : పారిస్‌ ఒలింపిక్స్‌ విశేషాలివే..

ఒలింపిక్స్‌.. ప్రపంచంలో అతిపెద్ద క్రీడా మహా సంగ్రామం. వందల దేశాలు.. వేల మంది క్రీడాకారులు.. తమ ప్రతిభకు, కొన్నేళ్లుగా రేయింబవళ్లు పడ్డ శ్రమకు ఒక్క మెడల్‌ వస్తే చాలని ఎదురుచూసే క్రీడా వేదిక.

Paris olympics 2024 : పారిస్‌ ఒలింపిక్స్‌ విశేషాలివే..

Paris olympics 2024 all you need to know about tourney

Paris olympics : ఒలింపిక్స్‌.. ప్రపంచంలో అతిపెద్ద క్రీడా మహా సంగ్రామం. వందల దేశాలు.. వేల మంది క్రీడాకారులు.. తమ ప్రతిభకు, కొన్నేళ్లుగా రేయింబవళ్లు పడ్డ శ్రమకు ఒక్క మెడల్‌ వస్తే చాలని ఎదురుచూసే క్రీడా వేదిక. గతేడాది టోక్యోలో జరగ్గా.. ఇప్పుడు పారిస్‌ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చింది. అసలే పర్యాటకంగా పేరున్న అద్భుత నగరం ప్యారిస్‌. పైగా అతిపెద్ద క్రీడా సంభరం. ఇక చెప్పేదేముంది‌. ఎక్కడ చూసినా అథ్లెట్ల కోలాహలమే.

పారిస్‌ ఒలింపిక్స్‌ విశేషాలేంటి..?

అసలే చారిత్రక, రాచరిక వైభవంతో అలరారిన దేశం. ఓవైపు ఎత్తైన ఈఫిల్‌ టవర్‌.. మరోపక్క అందంగా కనిపించే సీన్‌ నది. ఈ రెండింటి నడుమ 2024 విశ్వ క్రీడా సంబరం. ఇక చెప్పేదేముంది.. పర్యాటక నగరంగా, అందమైన సిటీగా పేరున్న ప్యారిస్ ఈ ఒలింపిక్స్‌కు వేదికయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల నుంచి 10 వేల మందికి పైగా అథ్లెట్లు సమరానికి సై అంటున్నారు. 17 రోజుల పాటు జరిగే ఈ ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుక భారత కాలమానం ప్రకారం జులై 26 రాత్రి 11 గంటలకు ప్రారంభమై.. క్లోజింగ్‌ సెరమనీ ఆగస్ట్‌ 11తో ముగుస్తుంది. ఓపెనింగ్ సెర్మనీ స్టేడియం బయట సీన్ నదీ తీరంలో నిర్వహించడం విశేషం. ఇలా స్టేడియం బయట ఆరంభ వేడుకలు జరగడం ఒలింపిక్స్ చరిత్రలోనే ఇదే తొలిసారి.

చారిత్రక, రాచరిక వైభవాన్ని చాటేలా కొన్ని.. పర్యావరణానికి మేలు చేసేలా మరికొన్ని.. ప్రముఖ కట్టడాల సాక్షిగా అభిమానులను అలరించేవి ఇంకొన్ని.. ఇలా పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణ కోసం వేదికల్ని ప్రత్యేకంగా సిద్ధం చేసింది. 35 స్టేడియాలు, ప్రత్యేక వేదికలు ఈ విశ్వ క్రీడలకు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ఒలింపిక్స్‌ కోసం రెండు స్టేడియాలనే కొత్తగా నిర్మించారు. ఇందులో ఒకటి సెయింట్‌ డెనిస్‌లోని ఆక్వాటిక్‌ సెంటర్‌. ఇక్కడ ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్, డైవింగ్, వాటర్‌ పోలో క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. క్లైంబింగ్‌ కోసం లె బోర్గెట్‌ స్పోర్ట్‌ క్లైంబింగ్‌ వేదికను అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు ఎగ్జిబిషన్‌ కేంద్రాన్ని ఆధునికీకరించి నార్త్‌ పారిస్‌ ఎరీనా క్రీడా వేదికగా మార్చారు. ఇక్కడ 9 హాళ్లు ఉన్నాయి. బాక్సింగ్, మోడర్న్‌ పెంటథ్లాన్‌ పోటీలు జరగబోతున్నాయి.

పీరె మారోయ్‌ స్టేడియానికి ఓ ప్రత్యేకత..

బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్‌కు ఆతిథ్యమిస్తున్న పీరె మారోయ్‌ స్టేడియానికి ఓ ప్రత్యేకత ఉంది. అవసరమైనప్పుడు మూసుకునేలా దీని పైకప్పును ఏర్పాటు చేశారు. ఈ స్టేడియం సామర్థ్యం 26 వేలు. ఇక పర్యావరణ హితంగా పోర్టె డి లా ఛాపెల్లె ఎరీనా స్టేడియం పైభాగాన్ని దాదాపుగా పచ్చదనంతో నింపేశారు. దీని చుట్టూ పార్కులు, గార్డెన్‌లున్నాయి. 8 వేల సీటింగ్‌ సామర్థ్యం ఉన్న ఈ ఇండోర్‌ స్టేడియంలో బ్యాడ్మింటన్, రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ జరుగుతాయి. ఇక టెన్నిస్‌ పోటీలకు ఫ్రెంచ్‌ ఓపెన్‌ వేదిక రొలాండ్‌ గారోస్‌ ఆతిథ్యమివ్వనుంది.

ఈ స్టేడియంలలో వందేళ్ల క్రితం పారిస్‌ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన యిస్‌డ్యూ మనోయిర్‌ స్టేడియం కూడా ఉంది. 1924 ఒలింపిక్స్‌లో వేదికగా ఉన్న ఈ స్టేడియం ఆటలకు మళ్లీ సిద్ధమైంది. 1924లో ఆరంభ వేడుకలు ఇక్కడే జరిగాయి. అథ్లెటిక్స్, గుర్రపు స్వారీ, ఫుట్‌బాల్, రగ్బీ తదితర క్రీడలకు ఈ స్టేడియం అప్పుడు ఆతిథ్యమిచ్చింది. ఇప్పటి అవసరాలకు అనుగుణంగా దీన్ని పునర్నిర్మించారు. ఈ ఒలింపిక్స్‌లో భాగంగా ఇక్కడ హాకీ పోటీలు జరగబోతున్నాయి. ఫ్రాన్స్‌లోనే అతిపెద్దదైన స్టేడ్‌ డి ఫ్రాన్స్‌ స్టేడియంలో ఈ సారి ముగింపు వేడుకలు జరుగుతాయి. 1998 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ కోసం దీన్ని నిర్మించారు. అథ్లెటిక్స్, రగ్బీ పోటీలకు ఆతిథ్యమిస్తున్న దీని సామర్థ్యం 77 వేలు.

ఈక్వెస్ట్రియన్, మోడర్న్‌ పెంటథ్లాన్‌ పోటీలకు వేదికైన శాటో డి వెర్సైలెస్‌కు చారిత్రక గుర్తింపు ఉంది. అప్పట్లో దీన్ని వేట కోసం నిర్మించారు. 1682లో అప్పటి ఫ్రాన్స్‌ రాజు 14వ లూయిస్‌ ఇక్కడ నివసించారు. ఫ్రెంచ్‌ రాజసానికి ఇది ప్రతీక. 1883లో దీన్ని జాతీయ మ్యూజియంగా మార్చారు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన మొట్టమొదటి ఫ్రెంచ్‌ నిర్మాణం ఇదే. 40 వేల వరకు సీటింగ్‌ సామర్థ్యం ఉంది.

మరోవైపు ఆర్చరీ, అథ్లెటిక్స్, రోడ్‌ సైక్లింగ్‌కు ఆతిథ్యమిచ్చే ఇన్వాలిడెస్‌కూ శతాబ్దాల చరిత్ర ఉంది. సైన్యం ఆసుపత్రిగా ఈ హోటల్‌ డెస్‌ ఇన్వాలిడెస్‌ గార్డెన్‌ను 1687లో 14వ లూయిస్‌ కట్టించారు. రిటైర్మెంట్‌ తర్వాత యుద్ధ సైనికులకు ఇది నివాసంగా ఉండేది. ఇక 1931లో నిర్మించిన జెఫ్రాయ్‌ గూచర్డ్‌ స్టేడియం సాకర్‌కు ప్రసిద్ధి. పారిస్‌ యూనివర్సల్‌ ఎగ్జిబిషన్‌ కోసం 1900 సంవత్సరంలో నిర్మించిన గ్రాండ్‌ ప్యాలెస్‌ ను ఫెన్సింగ్, తైక్వాండో కోసం వినియోగిస్తున్నారు. 1357 నుంచి పారిస్‌ సిటీ హాల్‌గా కొనసాగుతున్న హోటల్‌ డి విల్లె అథ్లెటిక్స్‌ ఆతిథ్యమిస్తున్నాయి.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చారిత్రక కట్టడం ఈఫిల్‌ టవర్‌ వెనకాల కనిపిస్తుండగా.. సీన్‌ నదీ తీరాన.. బీచ్‌ వాలీబాల్‌ స్టేడియం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ క్రీడల కోసమే తాత్కాలికంగా నిర్మించిన ఈ ఈఫిల్‌ టవర్‌ స్టేడియాన్ని ఒలింపిక్స్‌ ముగిశాక తొలగిస్తారు. దీని సామర్థ్యం 12 వేల 860. మరోవైపు జూడో, రెజ్లింగ్‌కు ఆతిథ్యమిచ్చే 8 వేల 356 సామర్థ్యమున్న ఛాంప్‌ డి మార్స్‌ ఎరీనానూ తాత్కాలికంగానే నిర్మించారు. ఇక సైక్లింగ్‌ మౌంటైన్‌ బైక్‌ పోటీలు నిర్వహించే కృత్రిమ కొండ ఎలన్‌కోర్ట్‌ హిల్‌ కూడా ఆకట్టుకుంటోంది. అథ్లెటిక్స్, రోడ్‌ సైక్లింగ్‌ నిర్వహించే ట్రాకాడెరో కూడా తాత్కాలిక వేదికే.