హోలోగ్రామ్ పేరిట భారీ స్కామ్..! ఎక్సైజ్ శాఖపై ప్రభుత్వం ఫోకస్

నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను కట్టబెట్టినట్లుగా గుర్తించారు. ఇందుకు సంబంధించి కీలక సమాచారం గల్లంతైనట్లు తెలుస్తోంది.

హోలోగ్రామ్ పేరిట భారీ స్కామ్..! ఎక్సైజ్ శాఖపై ప్రభుత్వం ఫోకస్

Ap Liquor Scam : ఏపీ ఎక్సైజ్ శాఖపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సర్కార్ దృష్టి సారించింది. హోలోగ్రామ్ పేరుతో భారీ స్కామ్ జరిగినట్లుగా గుర్తించారు. నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హోలోగ్రామ్ స్టిక్కర్ల టెండర్లలోనూ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు టెండర్లను పక్కదారి పట్టించినట్లు భావిస్తున్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను కట్టబెట్టినట్లుగా గుర్తించారు. ఇందుకు సంబంధించి కీలక సమాచారం గల్లంతైనట్లు తెలుస్తోంది.

వివిధ కంపెనీల నుంచి వచ్చే మద్యం బాటిళ్లలో కల్తీ జరక్కుండా, మద్యం మార్చి అక్రమాలకు పాల్పడకుండా ఉండేలా హోలోగ్రామ్ స్టిక్కర్లను అతికిస్తారు. అయితే, గత జగన్ ప్రభుత్వం హయాంలో ఈ హోలోగ్రామ్ స్టిక్కర్ల వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వాటిపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది. నకిలీ హోలోగ్రామ్ లను ప్రోత్సహించే విధంగా టెండర్ల విధానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారనే అంశం విజిలెన్స్ అధికారుల దర్యాఫ్తు ప్రారంభమైంది. 13.68 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. నకిలీ హోలోగ్రామ్స్ ద్వారా పలు అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో కొంత సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది.

బెవరేజస్ కార్పొరేషన్ కు గతంలో ఎండీగా పని చేసిన వాసుదేవ రెడ్డి మీద ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. నకిలీ హోలోగ్రామ్ లకు సంబంధించి వాసుదేవ రెడ్డిని సూత్రధారిగా ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ లావాదేవీలు, గతంలో చేసిన వ్యాపార వివరాలు, టెండర్లకు సంబంధించిన సమాచారంపై విచారణ చేపట్టారు. కీలక సమాచారం ఉన్న ఫైళ్లు గల్లంతైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ టెండర్ల ప్రక్రియలో సాంకేతిక కమిటీ నివేదికలో అధికారి సంతకం లేనట్లుగా గుర్తించారు. ఇవన్నీ చూస్తే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించిన విజినెల్స్ అధికారులు ఆ దిశగా దర్యాఫ్తు చేపట్టారు.

Also Read : కళా వెంకటరావు కుటుంబం రాజకీయ భవిష్యత్‌పై ఎన్నో సందేహాలు? ఎందుకీ పరిస్థితి?