ఏలూరులో సైబర్ మోసం.. 25 లక్షలు పోగొట్టుకున్న మహిళా టీచర్

డ్యూటీకి వెళ్దామని రెడీ అవుతుండగా ఫోన్‌ రింగ్ అయింది. నెంబర్ చూసింది. అనోన్ నెంబర్‌ అని గమనించి లిఫ్ట్ చేసింది.. ఒక్కసారిగా టెన్షన్‌కు గురైంది.

ఏలూరులో సైబర్ మోసం.. 25 లక్షలు పోగొట్టుకున్న మహిళా టీచర్

Eluru Cyber Fraud Woman Teacher Duped Of Rs 25 Lakhs

Eluru Cyber Fraud: డ్యూటీకి వెళ్దామని రెడీ అయ్యింది. తన బ్యాగులో టిఫిన్ బాక్సు, ఇతర అవసరమైన వాటిని సర్దుకుంది. ఇంతలో ఫోన్‌ రింగ్ అయింది. నెంబర్ చూసింది. అనోన్ నెంబర్‌ అని గమనించి లిఫ్ట్ చేసింది.. ఒక్కసారిగా టెన్షన్‌కు గురైంది. ఏం చేయాలో తోచలేదు.. అపరిచిత వ్యక్తి చెప్పినట్లు చేసింది. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 25 లక్షలు పోగొట్టుకుంది. ఏలూరులో జరిగిన ఘరానా మోసం సంచలనం సృష్టించింది.

సైబర్ నెరగాళ్లు విజృంభిస్తున్నారు. రోజుకో కొత్త అవతారం ఎత్తుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. అమాయకుల నుంచి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. తాజాగో ఓ మహిళా అధ్యాపకురాలి నుంచి 25 లక్షలు దోపిడి చేశారు. ఈ ఘటన ఏలూరు పట్టణంలో చోటుచేసుకుంది.

ఏలూరు విద్యానగర్‌కు చెందిన ఓ మహిళ.. అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అయింది. అపరిచిత వ్యక్తి నుండి ఆ కాల్ వచ్చింది. తాను సీబీఐ అధికారినంటూ ఆమెను నమ్మించాడు. ముంబై నుంచి కాల్ చేస్తున్నానని చెప్పాడు. మీ పేరిట కొరియర్ వచ్చిందని..అందులో పాస్‌పోర్టు, పాన్‌కార్డు, క్రెడిట్‌కార్డులతో పాటు.. డ్రగ్స్ ఉందని తెలిపాడు. మీపై డ్రగ్స్ కేసు నమోదు చేస్తున్నామని వెల్లడించాడు. అపరిచిత వ్యక్తి మాటలు విన్న బాధితురాలు షాక్‌కు గురైంది. టీచర్‌ను నమ్మించేందుకు అతడు వీడియో కాల్ చేసి కొరియర్‌లోని వస్తువులు, డ్రగ్స్ చూపించాడు. దీంతో బాధితురాలు మరింత ఆందోళనకు గురైంది.

డ్రగ్స్ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు చెల్లించాలని టీచర్‌ను బెదిరించాడు. అప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్న ఆమె.. సంబంధం లేని నేరంలో ఇరుక్కోవడం ఇష్టం లేక.. సైబర్‌ నేరగాడు చెప్పినట్లు చేసింది. దీంతో 25 లక్షల 60 వేల 500 రూపాయలు పోగొట్టుకుంది. చివరకు ఆ షాక్‌ నుంచి తేరుకున్న మహిళ మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.

Also Read: కదులుతున్న బస్సు.. హోటల్ రూమ్.. హైదరాబాద్‌లో రెచ్చిపోయిన కామాంధులు

బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే సైబర్ మోసాలపై అనేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.