విజయనగరంలో చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.3 కోట్లతో పరార్

కష్టపడి సంపాదించిన డబ్బుని కత్తెర వెంకట్రావుకి ఇచ్చామని, చివరలో పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆశించామని, చివరికి ఇలా మోసపోతామని అనుకోలేదని బాధితులు వాపోయారు.

విజయనగరంలో చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.3 కోట్లతో పరార్

Chit Fund Fraud : విజయనగరంలో చిట్టీల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సుమారు 100 మంది వద్ద 3 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు చిట్టీల నిర్వాహకుడు కత్తెర వెంకట్రావు. కూలీలు, చిరు వ్యాపారులను టార్గెట్ చేశాడు. బాధితులు లబోదిబోమంటూ వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కత్తెర వెంకట్రావు కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. చాలా ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తుండటంతో స్థానికులు అతడిని నమ్మారు. అతడి దగ్గర చిట్టీలు కట్టారు. వెంకట్రావు మాటలు నమ్మి కూలీలు, చిరు వ్యాపారులు పెద్ద సంఖల్యో చిట్టీలు కట్టారు. రూ.30వేల నుంచి రూ.3లక్షల వరకు చిట్టీలు కట్టారు. సమయం దాటి పోవడంతో చిట్టీలు కట్టిన వారు తమ డబ్బు ఇవ్వాలని అడిగారు.

అయితే, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అంటూ వెంకట్రావు తప్పించుకుని తిరిగాడు. చివరికి పత్తా లేకుండా పోయాడు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమన్నారు. సుమారు రూ.3 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి వెంకట్రావ్ పారిపోయినట్లు బాధితులు చెబుతున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. సుమారు 100 మందికిపైగా బాధితులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కూలీలు, చిరు వ్యాపారులే. కష్టపడి సంపాదించిన డబ్బుని కత్తెర వెంకట్రావుకి ఇచ్చామని, చివరలో పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆశించామని, చివరికి ఇలా మోసపోతామని అనుకోలేదని బాధితులు వాపోయారు. పరారీలో ఉన్న వెంకట్రావుని వెంటనే అరెస్ట్ చేసి తమ డబ్బు తమకు ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరారు.

చిట్టీల పేరుతో ఘరానా మోసాలు అనేకం జరుగుతున్నాయి. అధిక లాభాల ఆశ చూపి అడ్డంగా దోచేస్తున్నారు. చివరిలో పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామనో, అధిక లాభం వస్తుందనో చెప్పి.. చిట్టీలు కట్టించుకుంటున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు కలెక్ట్ గానే దాంతో జంప్ అవుతున్నారు చిట్టీల నిర్వాహకులు. ఈ తరహా మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు.

Also Read : రియల్ లైఫ్ ‘గజినీ’? ముంబై హిస్టరీ-షీటర్ దారుణహత్య.. శత్రువుల పేర్లను టాటూగా వేయించుకున్నాడు!