YS Jagan: ఏపీ సర్కారుపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు

ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి..

YS Jagan: ఏపీ సర్కారుపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు

YS Jagan

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య సర్కారు స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని ట్వీట్ చేశారు. రెండు నెలల్లో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని అన్నారు.

పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదని, సర్కారు పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయని చెప్పారు.

నంద్యాల జిల్లాలో గత రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలని జగన్ అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోలేదన్నారు.

దీంతో ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు.