Friendship Day 2024: పొలిటికల్‌ లీడర్స్‌.. స్నేహమంటే ఇదేరా..!

బీజేపీలో మరోనేత మహేశ్వర్ రెడ్డికి కూడా కాంగ్రెస్‌ పార్టీలో మంచి మిత్రులున్నారు.

Friendship Day 2024: పొలిటికల్‌ లీడర్స్‌.. స్నేహమంటే ఇదేరా..!

ప్రస్తుత రాజకీయాలు గతంలోకన్నా భిన్నంగా తయారయ్యాయి. గతంలో సిద్ధాంతపరమైన విభేదాలు తప్ప పార్టీలకు అతీతంగా నేతలు సత్సంబంధాలను కలిగి ఉండేవారు. వారి మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. అయితే పార్టీలు మారినా స్నేహాన్ని కొనసాగిస్తున్న అరుదైన నేత… ఈటల రాజేందర్‌. బీఆర్‌ఎస్‌ నేతలైన కేటీఆర్‌, హరీశ్‌రావులు తనకు ఇప్పటికే మంచి మిత్రులే అంటున్నారు ఈ బీజేపీ నేత.

తెలంగాణ ఉద్యమంలో ఆయనో కెరటం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2003లో టీఆర్‌ఎస్‌లో చేరిన ఈటల-2021 వరకు ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి ఆర్థికమంత్రిగా పనిచేశారు ఈటల. కేసీఆర్‌తో విభేదాల కారణంగా బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఏ పార్టీలో ఉన్నా ఇతర పార్టీల నేతలతోను స్నేహ సంబంధాలు కలిగి ఉన్న నేతల్లో ఈటల రాజేందర్‌ ఒకరు.

బీజేపీలో చేరినప్పటికీ..
ఈటల రాజేందర్ ఇటీవల బీజేపీ పార్టీలో చేరినప్పటికీ…. ఆయన టిఆర్ఎస్ నేతలతో సత్సంబంధాలనే కొనసాగిస్తున్నారు.. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన ఈటల రాజేందర్‌- అదే పార్టీలో ఉన్న హరీశ్‌రావు, కేటీఆర్‌తో మంచి స్నేహ సంబంధాలనే కలిగి ఉన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తోనే తనకు విభేదాలు ఉన్నాయి తప్ప హరీశ్‌రావు, కేటీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవంటారు. వారు నాకు ఇప్పటికీ మంచి మిత్రులేనని చెబుతూ ఉంటారు ఈటల రాజేందర్.

ఈటల రాజేందర్‌ పార్టీల కతీతంగా అందరితో కలగోలుపుగా ఉంటారు. బిఆర్ఎస్ లోనే కాకుండా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లోనూ మంచి మిత్రులు ఉన్నారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, భట్టి విక్రమార్క వంటి నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తనకు మంచి మిత్రులని ఈటల చెబుతుంటారు.

మంచి స్నేహ సంబంధాలు
బీజేపీలో మరోనేత మహేశ్వర్ రెడ్డికి కూడా కాంగ్రెస్‌ పార్టీలో మంచి మిత్రులున్నారు. 2023లో కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీ చేరారు మహేశ్వర్‌ రెడ్డి. నిర్మల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. గతంలో ప్రాతినిధ్య వహించిన కాంగ్రెస్ పార్టీ నేతలతో ఇప్పటికీ సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు మహేశ్వర్‌ రెడ్డి. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలను సిద్ధాంతపరంగా విమర్శిస్తున్నానే తప్ప.. వారితో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని మహేశ్వర్‌ రెడ్డి పదేపదే గుర్తు చేసుకుంటూ ఉంటారు.

మొత్తానికి బీజేపీలో కీలక నేతలుగా ఉన్న ఈటల రాజేందర్‌, మహేశ్వర్‌ రెడ్డి పార్టీలు మారినవారే. తాము గతంలో పనిచేసిన పార్టీ నేతలతో సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. రాజకీయాలు వేరు…స్నేహం వేరని చెప్పకనే చెబుతున్నారు.

Also Read: వాళ్లకు వణుకు పుట్టేలా వ్యవస్థలను బాగు చేస్తున్నాం: కొల్లు రవీంద్ర