సైబర్ మోసాల్లో పోగొట్టుకున్న రూ.85 కోట్లు రికవరీ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఘనత

సైబర్ మోసాన్ని గుర్తించిన వెంటనే లేదా అనుమానించిన వెంటనే "గోల్డెన్ అవర్" లో సైబర్ మోసాన్ని నివేదించడం చాలా ముఖ్యం.

సైబర్ మోసాల్లో పోగొట్టుకున్న రూ.85 కోట్లు రికవరీ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఘనత

Telangana Cyber Security Bureau : సైబర్ నేరాల బారిన పడి డబ్బు కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తోంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. సైబర్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్న వారికి లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో రీఫండ్ చేస్తోంది. ఇలా గత 5 నెలల కాలంలో 85 కోట్ల 5 లక్షల రూపాయల నగదును రీఫండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6వేల 449 కేసుల్లో బాధితులకు ఈ మొత్తాన్ని తిరిగి అప్పగించింది. ఇందులో అత్యధికంగా సైబరాబాద్ పరిధిలో బాధితులకు 36 కోట్ల 8 లక్షల రూపాయలు రీఫండ్ చేసింది. డబ్బు పోగొట్టుకున్న మొదటి గంట అంటే.. గోల్డన్ అవర్ లో ఫిర్యాదు చేస్తే నేరగాళ్లకు సొమ్ము చేరకుండా ఆపగలమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది.

సైబర్ మోసాలకు గురైన బాధితులకు బిగ్ రిలీఫ్ ఇస్తోంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ). వారు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి రికవరీ చేస్తోంది. ఇలా రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లో ఈ ఏడాదిలో (మార్చి నుంచి జూలై) సైబర్ మోసాలకు గురైన బాధితులకు రూ.85.05 కోట్లు రీఫండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (టీజీఎల్ఎస్ఏ), టీజీసీఎస్బీ సంయుక్త కృషితో ఇది సాధ్యమైంది.

ఫిబ్రవరి 2024లో టీజీఎల్ఎస్ఏ సహకారంతో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 457 కింద పిటిషన్లు దాఖలు చేసే విధానాన్ని క్రమబద్ధీకరించడానికి ఎస్వోపీ రూపొందించి, తెలంగాణలోని అన్ని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలకు టీజీసీఎస్బీ ద్వారా పంపారు. మొత్తం 6,840 పిటిషన్లు న్యాయస్థానాల్లో దాఖలయ్యాయి. వాటిలో 6,449 కేసులకు రూ.85.05 కోట్ల మొత్తానికి రీఫండ్ ఆదేశాలు మంజూరు చేశారు. ఈ మొత్తంలో రూ.36.8 కోట్లు సైబరాబాద్ కమిషనరేట్‌లో రికవరీ చేశారు.

సైబర్ మోసాన్ని గుర్తించిన వెంటనే లేదా అనుమానించిన వెంటనే “గోల్డెన్ అవర్” లో సైబర్ మోసాన్ని నివేదించడం చాలా ముఖ్యం. వెంటనే నివేదించడం వల్ల నిందితుడి బ్యాంకు అకౌంట్లు, డిజిటల్ వ్యాలెట్ల నుంచి కాజేసిన సొమ్ము మొత్తాన్ని స్తంభింపజేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తద్వారా బాధితులకు రీఫండ్ సులభతరం అవుతుంది. బాధితులు 1930 కి కాల్ చేయాలి. లేదా cybercrime.gov.in పోర్టల్‌ లో ఫిర్యాదు నమోదు చేయాలి.

సైబర్ నేరాలకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* వేర్వేరు అకౌంట్లకు స్పెషల్, స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను వాడాలి. అలాగే తరచుగా మార్చాలి.
* ఏ చట్టబద్ధమైన సంస్థ కూడా వీడియో కాల్‌ చేసి ధ్రువీకరణ కోసం ఏదైనా ఖాతాకు డబ్బు బదిలీ చేయమని అడగదని గుర్తుంచుకోవాలి.
* ఆర్థిక లావాదేవీలను కోరే మెసేజ్ లు లేదా ఈ-మెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాటి ప్రామాణికతను నిర్ధారించుకోవాలి.
* అపరిచితులు, సంస్థలతో ఆన్‌లైన్‌లో వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని అస్సలు షేర్ చేసుకోవద్దు.
* ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ వ్యవస్థలను అప్ డేట్ చేసుకోవాలి.
* ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం జరిగినా లేదా సైబర్ నేరం జరిగినా వెంటనే టీజీసీఎస్బీకి నివేదించాలి.

ఇలాంటి ముందు జాగ్రత్తలు, తక్షణ నివేదనల ద్వారా పౌరులు సైబర్ మోసానికి గురికాకుండా తమను తాము రక్షించుకోవచ్చు.

Also Read : ఏలూరులో సైబర్ మోసం.. 25 లక్షలు పోగొట్టుకున్న మహిళా టీచర్