తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఆనంద్ మహీంద్రా: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో నైపుణ్యానికి చాలా డిమాండ్ ఉందని, అందుకే తెలంగాణలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఆనంద్ మహీంద్రా: సీఎం రేవంత్ రెడ్డి

Anand Mahindra to be chairman of Young India Skills University says CM Revanth Reddy

Updated On : August 5, 2024 / 1:54 PM IST

CM Revanth Reddy: తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ చైర్‌ప‌ర్స‌న్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. అమెరికా పర్యటనలో న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీపీపీ మోడల్ లో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. దీనికి చైర్‌ప‌ర్స‌న్‌గా ఉండాలని ఆనంద్ మహీంద్రాను తాను రిక్వెస్ట్ చేశానని, రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు చేపడతారని వెల్లడించారు. ప్రపంచంలో నైపుణ్యానికి చాలా డిమాండ్ ఉందని, అందుకే తెలంగాణలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు. ఇందులో ఐటీ, వైద్య, క్రీడా రంగాలతో పాటు పలు అంశలపై శిక్షణనిస్తామని తెలిపారు.

తెలంగాణలో పెట్టుబడులకు తమ ప్రభుత్వం రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఎన్నారైలు సహకరించాలని ఆయన కోరారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీయిచ్చారు. హైదరాబాద్ లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని.. ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో ఎన్నారైలు కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు.

Also Read: పాలిటిక్స్‌లో 30 ఇయర్స్‌ అనుభవం ఉన్న నేతలు.. అయినా మౌనం!

బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని, పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని సీఎం రేవంత్ విమర్శించారు. ఎన్నారైల సహకారంతో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వంలో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇచ్చిందని తెలిపారు. మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగాయని.. బీఆర్ఎస్ చర్చల్లో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిందన్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా అంతకుముందు న్యూజెర్సీలో కాంగ్రెస్ అభిమానులు భారీ కార్ ర్యాలీ నిర్వహించారు.