పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(80) దక్షిణ కోల్‌కతా లోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత

West Bengal Former Chief Minister Buddhadeb Bhattacharjee Passed Away

Buddhadeb Bhattacharjee Passed Away: ప్రముఖ లెఫ్ట్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(80) కన్నుమూశారు. దక్షిణ కోల్‌కతా లోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడ్డారు. గతేడాది న్యుమోనియా సోకడంతో లైఫ్ సపోర్టు పెట్టాల్సి వచ్చింది. తర్వాత ఆయన కోలుకున్నారు. తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో భట్టాచార్య కన్నుమూశారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు.

జ్యోతిబసు తర్వాత సీఎంగా ఎన్నికైన బుద్ధదేవ్ 11 ఏళ్ల పాటు పదవిలో కొనసాగారు. 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. సీపీఎం అత్యున్నత నిర్ణయాధికార కమిటీ అయిన పొలిట్‌బ్యూరోలోనూ ఆయన సభ్యుడిగా సేవలు అందించారు. బెంగాల్‌లో 34 ఏళ్ల కమ్యూనిస్ట్ పాలనకు ముగింపు పలికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చారిత్రాత్మక విజయాన్ని అధికారంలోకి వచ్చే నాటికి భట్టాచార్య సీఎంగా ఉన్నారు.

కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాల పూర్వ విద్యార్థి అయిన భట్టాచార్య రాజకీయాల్లో చేరడానికి ముందు స్కూల్ టీచర్‌గా పనిచేశారు. పాలిటిక్స్ లోకి ప్రవేశించి కిందిస్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగారు. సీఎం జ్యోతిబసు 2000లో పదవీవిరమణ చేసే సమయానికి భట్టాచార్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2001, 2006లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం పార్టీని విజయపథంలో నడిపించారు.

Also Read: భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వందలాది మంది బంగ్లాదేశ్ ప్రజలు

మమత, చంద్రబాబు సంతాపం
బుద్ధదేవ్ భట్టాచార్య మరణం పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. ”పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మరణవార్త బాధాకరం. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా సేవ పట్ల ఆయన అంకితభావం ఎంతో స్ఫూర్తి దాయకం. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆధునిక చరిత్రను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. భట్టాచార్య కుటుంబానికి, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాన”ని చంద్రబాబు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.