ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు, బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో చూశాం- మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్

ప్రభుత్వంలో ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తుంది. ప్రజలపక్షాన కొట్లాడుతుంది.

ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు, బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో చూశాం- మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud (Photo Credit : Facebook)

Srinivas Goud : బీజేపీలో బీఆర్ఎస్ విలీన వార్తలపై తీవ్రంగా స్పందించారు మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆ ప్రచారాన్ని ఆయన ఖండించారు. భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ బలహీనపడలేదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీపై కుట్రలు జరిగాయని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పార్టీ పని అయిపోయింది అంటూ దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కొందరి పాత బుద్ధి మారలేదని విరుచుకుపడ్డారు. ఇప్పుడు బీజేపీలో విలీనం అంటూ అత్యుత్సాహంతో కథనాలు రాస్తున్నారని సీరియస్ అయ్యారు శ్రీనివాస్ గౌడ్.

”టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ప్రభుత్వంలో ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తుంది. ప్రజలపక్షాన కొట్లాడుతుంది. తెలంగాణ రాక ముందు రాష్ట్ర పరిస్థితి, ఏర్పడ్డ తర్వాత పరిస్థితిని పోల్చి చూడండి. వ్యవసాయం, విద్యుత్, ఆర్థిక స్థితిగతులు, తెలంగాణ అస్తిత్వం ఎలా ఉండేదో గుర్తుకు తెచ్చుకోండి. తెలంగాణ పేరు ఉచ్ఛరించడానికి కూడా భయపడే వారు. సచివాలయంలో భాష (యాస) మార్చుకుని మాట్లాడిన సందర్భాలున్నాయి.

తెలంగాణ పేరు చెబితే గతంలో ఢిల్లీ ఏపీ భవన్ లో గదులు కూడా ఇవ్వకపోయే వారు. ఢిల్లీకి వస్తే పార్టీని విలీనం చేసినట్టా? ఢిల్లీకి మేం రాకూడదా? ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో పోరాటం కోసం ఢిల్లీకి వచ్చాం. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టు నోటికొచ్చింది ప్రసారం చేయడం తగదు. ఊహాజనితంగా కథనాలు రాయడం జర్నలిజానికి మంచిది కాదు. ఇలాంటి కథనాలు రాస్తున్నది, ప్రసారం చేస్తున్నది ఎవరో కూడా అందరికీ తెలుసు.

2 ఎంపీలతో బీజేపీ ప్రస్థానం మొదలైంది. అలాగని ఆ పార్టీ అక్కడితో ఆగిపోయిందా? ఇప్పుడు మా పార్టీ కూడా అంతే. కొందరు డబ్బుకు ఆశపడి వెళ్లారు. అంతమాత్రాన పార్టీ పని అయిపోయినట్టు కాదు. ప్రజలు కూడా రైతుబంధు సహా అనేక పథకాలు ఎక్కువ ఇస్తామని చెబితే నమ్మారు. ఓటు వేశారు. ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు. కొన్నేళ్ళ తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటారు. బీఆర్ఎస్ బలహీనపడలేదు. మేం బలంగానే ఉన్నాం. ప్రజలు 39 సీట్లు ఇవ్వడం అంటే బలహీనమైనట్టు కాదు.

నిన్నగాక మొన్న మహబూబ్‌నగర్‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ గెలుచుకున్నాం. ఒక జాతీయ పార్టీ ఎదగాలని కోరుకోవడం తప్పేం కాదు కదా? కానీ ప్రజలు ఆ జాతీయ పార్టీ పక్క రాష్ట్రంలో ఏం చేసిందో చూస్తారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిగా మోదీయా.. రాహుల్ గాంధీయా అన్నదే చూశారు. అందుకే ప్రాంతీయ పార్టీలకు అవకాశం దక్కలేదు. మేము అటో ఇటో ఉంటే మాకు కూడా 10-15 సీట్లు వచ్చి ఉండేవి. మేం ఈ రెండు కూటముల్లో లేకపోవడం వల్లనే ఫలితాలు ఇలా వచ్చాయి. ఎన్నికలప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఉండదు. ఏ కూటమిలో చేరే ఆలోచన లేదు. ఇక విలీనం అన్న ప్రస్తావన అస్సలే లేదు. అది పూర్తిగా దుష్ప్రచారం. ప్రజాగ్రహం ఎదురైతే బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో చూశాం. ఎక్కడైనా అలాగే జరుగుతుంది” అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Also Read : సమన్వయం లేదు, సఖ్యత లేదు.. ఎవరికి వారే యమునా తీరే..! కమలదళంలో ఎందుకీ గందరగోళం?