బంగ్లాదేశ్‌లో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు.

బంగ్లాదేశ్‌లో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్

India closely monitoring status of minorities in Bangladesh says Jaishankar

Jaishankar on Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లర్లు, రాజకీయ అస్థిరత పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో 19,000 మంది భారతీయులు ఉండగా, అందులో 9 వేల మంది విద్యార్థులు వీరిలో చాలా మంది విద్యార్థులు జులై నెలలోనే ఇండియాకు తిరిగొచ్చేశారని తెలిపారు. ఢాకా హైకమిషన్‌తో పాటు చిట్టగాంగ్, రాజ్‌షాహీ తదితర ప్రాంతాల్లో డిప్యూటీ హైకమిషన్లు ఉన్నాయని.. ఈ కార్యాలయాలకు తగిన భద్రత కల్పించాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు. మన సరిహద్దు భద్రతా విభాగాలను అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు చెప్పారు.

”భారత్-బంగ్లాదేశ్ మధ్య ఎంతో మెరుగైన సంబంధాలున్నాయన్నాయి. అనేక దశాబ్దాలుగా రెండు దేశాల ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. 2024 జనవరిలో ఎన్నికలు జరిగినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇవి క్రమంగా పెరిగి ఇవి జూన్ నెలలో విద్యార్థుల ఆందోళనకు దారితీశాయి. ఫలితంగా హింస పెరిగింది. ప్రజా ఆస్తుల విధ్వంసం జరిగడంతో రవాణా, రైల్వే వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడ్డాయి. జులై నెల మొత్తం హింస కొనసాగింది.

Also Read: బంగ్లా ప్రధాని పీఠాన్ని కూల్చిన రిజర్వేషన్ల లొల్లికి కారణాలు ఏంటి?

జులై 21న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత కూడా ప్రజాందోళనలు చల్లారలేదు. ఆ తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఆ దేశ ప్రధానిగా ఉన్న షేక్ హసీనాను గద్దె దించడమే లక్ష్యంగా అల్లర్లు పెచ్చుమీరాయి. ఆగస్టు 4న ఈ అల్లర్లు మరింత తీవ్రరూపం దాల్చాయి. పోలీసులపైన, పోలీస్ స్టేషన్లపై, ప్రభుత్వ భవనాలపై దాడులు జరిగాయి. అధికార పార్టీకి చెందిన నేతల వ్యక్తిగత ఆస్తులు కూడా దాడులకు గురయ్యాయి. మొత్తంగా హింసాత్మక ఘటనలు తీవ్రరూపం దాల్చాయి అలాగే ఆ దేశంలో మైనారిటీల వ్యాపారాలు, ఆలయాలపై దాడులు జరిగాయి.

Also Read: అంత కరెక్టుగా ఎలా చెప్పాడబ్బా.. షేక్‌ హసీనాపై ఫలించిన భారతీయుడి జోస్యం

ఆగస్టు 5న ఆందోళనకారులు కర్ఫ్యూను లెక్కచేయకుండా ఢాకాను ముట్టడించారు. చివరకు షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. అతి తక్కువ సమయంలో భారత్ వచ్చేందుకు అనుమతి కోరారు. నిన్న సాయంత్రం ఆమె ఢిల్లీ చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఇప్పటికీ అస్థిరంగా ఉంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ తాత్కాలిక మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అక్కడున్న మైనారిటీ వర్గాల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. గత 24 గంటల్లో ఢాకాలోని అధికార యంత్రాంగంతో టచ్‌లో ఉన్నామ”ని జైశంకర్ తెలిపారు.