విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయడం లేదు: పల్లా శ్రీనివాస్, అనిత

సంఖ్య తక్కువుగా ఉందని పెద్దల సభనే రద్దు చేద్దామని ఆలోచన చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయడం లేదు: పల్లా శ్రీనివాస్, అనిత

పెద్దల సభను గౌరవించేలా అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. విశాఖలతో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయడం లేదని తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం విలువలకు ప్రాధాన్యం ఇస్తుందని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కారని చెప్పారు.

సంఖ్య తక్కువుగా ఉందని పెద్దల సభనే రద్దు చేద్దామని ఆలోచన చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు. తాము పోటీ చేస్తే సునాయాసంగా గెలుస్తామని, అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా ప్రజలు చేశారని చెప్పారు. పెద్దల సభలోనయినా వైసీపీ నేతలు సక్రమంగా వ్యవహరించాలని చెప్పారు.

గెలవాలనుకుంటే సులభంగా గెలుస్తాం: అనిత
వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమను నామినేషన్ కూడా వేయనివ్వలేదని హోంమంత్రి వంగలపూడి అన్నారు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు టీడీపీ పోటీ చేయలేదని తెలిపారు. విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టే ఇప్పుడు పోటీ చేయడం లేదని చెప్పారు.

తాము గెలవాలనుకుంటే సులభంగా గెలుస్తామని, మండలి వద్దన్న జగన్ ఇప్పుడు అభ్యర్థిని పోటీకి పెట్టారని అన్నారు. వైసీపీని వదిలి కూటమిలోకి చేరేందుకు అనేకమంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ ఓ ఎమ్మెల్యే మాత్రమే అని గుర్తుంచుకోవాలని, అయినా 58 మందితో భద్రత ఇస్తున్నామని తెలిపారు. జగన్ భార్యకు, తల్లికి 2+2 సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పారు.

Also Read: చంద్రబాబు.. నీకు చేతనైంది చేసుకో.. జోగి రాజీవ్ అరెస్టుపై పేర్ని నాని ఫైర్