రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు

యుక్రెయిన్ దాడి చేసిందని రష్యా అంటుంటే.. అది నిజమేనని యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. శత్రువుల భూభాగంలోకి చొచ్చుకెళ్లి, వీలైనంత ఎక్కువ నష్టం చేయడమే లక్ష్యమంటోంది యుక్రెయిన్.

రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు

Russian Ukraine War: యుద్ధం అంటేనే ఎవరి చేతుల్లో ఉండదు. మొదలు మాత్రమే ఉండి.. ముగింపు అన్నదే లేకుండా కొనసాగుతుంది. రష్యా, యుక్రెయిన్ మధ్య కూడా ఇదే సీన్ ఉంది. రెండున్నరేళ్లుగా కాల్పుల మోత మోగుతూనే ఉంది. దాడి, ప్రతిదాడితో ఉద్రికతలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అటు పుతిన్, ఇటు జెలెన్‌స్కీ ఎవరూ తగ్గకపోవడంతో.. రష్యా, యుక్రెయిన్ వార్ మరింత టెన్షన్ పుట్టిస్తోంది. కుర్క్స్ ప్రాంతంలో రష్యా వర్సెస్ యుక్రెయిన్ అన్నట్లుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి యుక్రెయిన్ బలగాలు రష్యాలో 30 కిలోమీటర్ల దూరం దాకా చొచ్చుకెళ్లాయి. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసిన తర్వాత రష్యాలో యుక్రెయిన్ సైన్యం ఇంత లోపలికి చొచ్చుకెళ్లడం ఇదే ఫస్ట్ టైమ్.

యుక్రెయిన్ దాడి చేసిందని రష్యా అంటుంటే.. అది నిజమేనని యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. శత్రువుల భూభాగంలోకి చొచ్చుకెళ్లి, వీలైనంత ఎక్కువ నష్టం చేయడమే లక్ష్యమంటోంది యుక్రెయిన్. రష్యన్లు తమ సరిహద్దుల్ని రక్షించుకోలేని పరిస్థితి సృష్టించి వారిని అస్థిరపరచడమే టార్గెట్‌గా దాడులు చేస్తామంటోంది. మరోవైపు తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ఆయుధాలు, వాహనాలతో వచ్చిన యుక్రెయిన్ బలగాలను అడ్డుకున్నామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కుర్స్క్ ప్రాంతం నుంచి 76 వేల మందిని సేఫ్ జోన్లకు తరలించినట్లు చెబుతోంది. యుక్రెయిన్ దాడి చేసిన ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

రష్యన్ సేనల స్వాధీనంలో ఉన్న జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై దాడి జరిగింది. ఈ అటాక్‌పై రష్యా, యుక్రెయిన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అణువిద్యుత్ కేంద్రంపై దాడి రష్యా పనే అంటోంది యుక్రెయిన్. తమను బ్లాక్ మెయిల్ చేసేందుకే అటాక్ చేశారని అంటున్నారు జెలెన్‌స్కీ. రష్యా మాత్రం యుక్రెయిన్ జరిపిన దాడుల్లోనే అణువిద్యుత్ కేంద్రంలో మంటలు వచ్చాయంటోంది. జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 2022 నుంచి రష్యన్ దళాల ఆధీనంలో ఉంది.

రష్యా, యుక్రెయిన్ వార్ వారం రోజులు క్రితం వరకు కాస్త చల్లబడినట్లుగానే కనిపించింది. దాడులు చేసుకుంటున్నా.. ఈ స్థాయిలో ఉద్రిక్తతలు ఉన్నట్లయితే బయటికి రాలేదు. మిడిల్ ఈస్ట్ వార్ సిచ్యువేషన్స్‌తో..రష్యా, యుక్రెయిన్ మధ్య మళ్లీ దాడులు పెరిగాయి. మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా ఆయుధాలు, యుద్ధనౌకలు సమకూర్చింది. ఇరాన్‌కు మద్దతుగా రష్యా ఆర్మ్స్, మిస్సైల్స్ పంపించింది. దీంతో సీన్ మారింది. అమెరికా టార్గెట్‌గా ఇరాన్, రష్యా కొత్త ప్లాన్ వేశాయి. ఇరాన్ తమ దగ్గర ఉన్న ఫాత్-360 అడ్వాన్స్‌డ్ క్షిపణులను రష్యాకు సప్లై చేస్తుంది. యుక్రెయిన్ మీద అటాక్‌తో అమెరికా అటెన్షన్‌ను.. డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది రష్యా. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అటాక్స్ జరిగే పరిస్థితుల్లో అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఇరాన్ కాస్త వెనక్కి తగ్గింది. రష్యాతో కలసి.. అమెరికా టార్గెట్‌గా వ్యూహాలకు పదునుపెట్టింది.

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ పరిస్థితులు చల్లబడ్డాయి. ఇజ్రాయెల్ టార్గెట్‌గా ఇరాన్ దాడులు చేసేందుకు రెడీ అయింది. అంతలోనే ఇజ్రాయెల్ కోసం అమెరికా రంగంలోకి దిగడంతో స్ట్రాటజీ మార్చింది ఇరాన్. హమాస్, హిజ్‌బొల్లా గ్రూప్స్ మాత్రం ఇజ్రాయెల్‌పై అటాక్స్ చేస్తూనే ఉన్నాయి. ఇరాన్ మాత్రం.. రష్యాతో కలిసి అమెరికాను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుంది. తమ దగ్గరున్న అడ్వాన్స్‌డ్ మిస్సైల్స్ రష్యాకు పంపించి.. యుక్రెయిన్‌పై అటాక్ చేయిస్తోంది. అమెరికా కాన్సంట్రేషన్ మొత్తం యుక్రెయిన్ మీదకు టర్న్ అయ్యాక.. ఏ టైమ్‌లోనైనా ఇజ్రాయెల్ మీద దాడి చేసి.. హమాస్ లీడర్లకు హత్యకు ప్రతీకారం తీసుకోవాలని భావిస్తోంది ఇరాన్.