తప్పు చేసివుంటే విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటా: జోగి రమేశ్
చంద్రబాబు, లోకేశ్‌కి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, తాను తప్పు చేసివుంటే విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటానని జోగి రమేశ్ ప్రకటించారు.

Jogi Ramesh: అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో తమపై జరిగిన ఏసీబీ దాడులపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ స్పందించారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది తనపై జరుగుతున్న దాడి కాదని, బలహీనవర్గాలపై జరుగుతున్న దాడి అని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేశ్‌కి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, తాను తప్పు చేసివుంటే విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటానని ప్రకటించారు. అభం శుభం తెలియని కుమారుడిని అరెస్ట్ చేయడం న్యాయమేనా అని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి.. దయచేసి ఇలాంటి దుర్మార్గాలు చేయవద్దని హితవు పలికారు.
అగ్రిగోల్డ్ భూములు ఎటాచ్‌మెంట్‌లో ఉన్నాయని, వీటిని ఎవరైనా కొంటారా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు వ్యవహారంలో చట్టబద్దంగా వ్యవహరించామని, తాము తప్పుచేసివుంటే ప్రజల సాక్షిగా విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటామన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ వేధించలేదని తెలిపారు.
గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను అధికారులు తీసుకువచ్చారు. కుమారుడితో పాటు జోగి రమేశ్ ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. రాజీవ్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.