అస్సాం కేసులో కామాంధుడి కథ ముగిసింది.. చెరువులోకి దూకి చచ్చిపోయాడు!

అస్సాంలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో చెరువులోకి దూకి చనిపోయాడు.

అస్సాం కేసులో కామాంధుడి కథ ముగిసింది.. చెరువులోకి దూకి చచ్చిపోయాడు!

Assam Nagaon district incident accused dies in pond

Assam Nagaon district incident: అస్సాంలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడి కథ ముగిసింది. క్రైం సీన్ రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కోసం స్పాట్ తీసుకెళ్లగా నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగావ్ జిల్లా ధింగ్ గ్రామంలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడు తఫుజల్ ఇస్లాంను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ట్యూషన్ నుంచి తిరిగొస్తున్న బాలికపై ముగ్గురు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

కేసు దర్యాప్తులో భాగంగా తఫుజల్ ఇస్లాంను శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో క్రైం సీన్ రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కోసం స్పాట్ తీసుకెళ్లారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకుని సమీపంలోని చెరువులోకి దూకేశాడు. 2 గంటల తర్వాత స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సహాయంతో అతని మృతదేహాన్ని కనుగొన్నారు.

“ఇంటరాగేషన్ తర్వాత, క్రైమ్ సీన్ రీ-క్రియేషన్ కోసం అతడిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లాం. నిందితుడు కానిస్టేబుల్ పట్టు నుంచి విడిపించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సమీపంలోని చెరువులో పడిపోయి మరణించాడు. మా కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు. నిందితుడు ఎలా పారిపోయాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా మరో నిందితుడి ఇంటికి తఫుజల్ ఇస్లాంను తీసుకెళ్లాలనుకున్నామ”ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

ఎవరినీ వదిలిపెట్టం: సీఎం శర్మ
మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడిపై అస్సాంలో ఆందోళన వ్యక్తమయ్యాయి. జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. బాధితురాలు ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టబోమని, నేరానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామని ముఖ్యమంత్ర హిమంత బిస్వ శర్మ తెలిపారు. సంఘటనా స్థలానికి వెళ్లి, కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని డీజీపీని ఆయన ఆదేశించారు.

Also Read: ఒళ్లంతా కామం, సెల్‌ఫోన్ నిండా అశ్లీలం.. కోల్‌కతా డాక్టర్ కేసులో నిందితుడి గురించి విస్తుపోయే విషయాలు

కాగా, కోల్‌క‌తాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సమయంలో అసోంలో అఘాయిత్యం వెలుగులోకి రావడంతో అక్కడి ప్రజలు తీవ్రంగా స్పందించారు. ధింగ్ గ్రామంలో దుకాణాలు, మార్కెట్లు, విద్యాసంస్థలు మూసివేసి శుక్రవారం బంద్ పాటించారు. కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.