Papaya Cultivation : బొప్పాయి సాగులో రైతులు అనుసరించాల్సిన సస్యరక్షణ చర్యలు!

నులి పురుగుల నివారణకు నారు సంచులలో 1 గ్రా. కార్ఫోప్యూరాన్‌ 3 జి గుళికలను నారు సంచికి 1 గ్రా. చొప్పున విత్తనాల మొలకెత్తిన తరువాత వేయాలి. నులి పురుగులు సోకిన తోటల్లో మొక్కకు 250 గ్రా. వేప పిండి మరియు నులి పురుగులు బెడద వున్న ప్రాంతాలలో ఒక్కొక్క మొక్కకక 250 గ్రా. వేప పిండి మరియు కార్బోఫ్యూరాన్‌ ౩ జి గుళికలను 25-30 గ్రా. మరియు సుడోమోనాస్‌ ఫ్లోరిసెన్స్‌ను 4 గ్రా. చొప్పున ఒక్కొక్క చెట్టుకు వేయాలి.

Papaya Cultivation : బొప్పాయి సాగులో రైతులు అనుసరించాల్సిన సస్యరక్షణ చర్యలు!

Plant protection measures to be followed by farmers in papaya cultivation!

Papaya Cultivation : ఇటీవలి కాలంలో బొప్పాయి పంటను తెలుగు రాష్ట్రాల రైతులు అధికంగా సాగు చేపడుతున్నారు. బొప్పాయ ఉష్ణమండలపు పంట. వేసవిలో 38 డిగ్రీల సెల్సియస్ ఉండే ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. నీరు నిలవని సారవంతమైన ఎర్రగరపనేలలు, తేలికపాటి నేలలు, ఈ పంటసాగుకు అనుకూలంగా ఉంటాయి. బొప్పాయి సాగులో రైతులు చీడపీడల నివారణలో తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడి పొందవచ్చు. చీడపీడల నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు అవసరం.

కాండం మొదలు కుళ్ళు : నర్సరీలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. వేర్ల మొదలు మెత్తగా మారి కుళ్ళీపోతాయి, కాయలున్న చెట్లకు ఆశించిన నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు, నిల్వకుండా చూడాలి. బోర్జోమిశ్రమము 1 శాతం, ఆలియేట్‌ 2 గ్రా. లీటరు నీటికి కలిపి మొదలు తడపాలి. వారం రోజుల వ్యవధితో 2 – ౩ సార్లు తడపాలి లేదా టైకోడర్మా విరిడి 10 గ్రా. పొడిని ఒక లీటరు నీటిలో కలిపి బొప్పాయి మొక్కల మొదలు చుట్టూ నేల బాగా తడిచేటట్లుగా పోయాలి.

బూడిద తెగులు : ఆకులపైన, కాడలపైన మరియు క్రొత్త చిగుర్లపైన తెల్లటి బూడిద లాంటి శిలీంధ్రపు పెరుగుదల కనిపించినపుడు నీటిలో కరిగే గంధకము 3 గ్రా. లేదా కెరాథేన్‌ 1 మి.లీ. లేదా హెక్సాకొనజోల్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసిన సమర్థవంతముగా నివారించవచ్చును.

అల్జర్నేరియా ఆకుమచ్చ తెగులు : అక్టోబరు – నవంబరు నెలల్లో ఆకులపై గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోవును. దీని నివారణకు లీటరు నీటికి మాంకోజెబ్‌ 2.5 గ్రా. లేదా క్లోరోథాలోనిల్‌ 1 మి.లీ. కలిపి పక్షం రోజులు వ్యవధితో రెండు ధఫాలుగా పిచికారీ చేయాలి.

కాండం కుళ్ళు : కాండం మొదలు క్రుళ్ళిపోయి మొక్కలు వాలిపోతాయి. మొదలు నుండి జిగురు లాంటి ద్రవం కారుతుంది. దీని నివారణకు ఒక కిలో ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రము + 90 కిలోల పశువుల ఎరువు + 1 కిలోల వేప పిండి + 1 కిలో బెల్లం నీటిని 10 రోజులు మాగబెట్టి చెట్ల పాదుల్లో వేయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా వున్నపుడు లీటరు నీటిని 2 గ్రా. రిడోమిల్‌ యమ్‌ – జడ్‌ కలిపి చెట్ల మొదళ్ళలో మరియు కాండాన్ని తడుపుతూ మందును పోయాలి.

మొజాయిక్‌ : ఇది వైరస్‌ వలన కలుగుతుంది. ఆకులపైన పసుపు వర్ణం, ఆకుపచ్చ వర్ణం కలిగిన కణజాలం తయారయి మొజాయిక్‌ లక్షణాలు కనబడును. కాయ పరిమాణం తగ్గి నాణ్యత కోల్పోతుంది.

బొప్పాయి రింగ్‌ స్పాట్‌ వైరస్‌ : ఇది ఆశించినప్పుడు ఆకులు పరిమాణం తగ్గి సన్నటి తీగలాగ మారుతాయి. కాయలు మరియు కాండం మీద ఉంగరం లాంటి మచ్చలు కనబడుతాయి. ఈ వైరస్‌ తెగులు సోకిన కాయల నిల్లవ సామర్థ్యం తగ్గుతుంది. పాలం చుట్టూ రెండు వరుసలు మొక్కజొన్నను అడ్డు పంటగా పొలం చుట్టూ బొప్పాయి మొక్కలను నాటే నెల ముందు పెంచుకోవాలి. వీటి నివారణకు అంతర్వాహిక క్రిమిసంహారిక మందులైన డైమిథోయేట్‌ లేదా మిథైల్‌ డెమాలాన్‌ లేదా ఫిఫ్రానిల్‌ లీటరు నీటికి 2 మి.లీ. కలిపి నెలకు ఒకసారి చొప్పున 5 నెలల వరకు పిచికారీ చేయాలి.

ఆకుముడత :ఇది కూడా వైరస్‌ వలన ఆశిస్తుంది. ఈ వైరస్‌ ఆశించిన మొక్కల్లో ఆకులు ముడుచుకొని పోతాయి. తెగులు తీవ్రమైనప్పుడు ఆకులు వుండలుగా మారి వికృతరూపం దాల్చుతాయి. కాయలు సహజ ఆకారాన్ని కోల్పోయి వంకరటింకరగా తయారవుతాయి. దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. వైరస్‌ తెగుళ్ళను రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పెనుబంకలు వ్యాప్తి చేయును. అంతర్వాహిక కీలక నాశనులు ఉపయోగించి వైరస్‌ తెగుళ్ళ వ్యాప్తిని అరికట్టవచ్చును.

పండుఈగ : బొప్పాయిలో పండు ఈగ కాయలు పక్వానికి వచ్చిన తర్వాత కాయలను ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. తల్లి ఈగ గోధుమ రంగును కలిగి పారదర్శకమైన రెక్కలు కలిగి వుంటుంది. ఈ తల్లి ఈగ సూదిలాంటి మొనను కాయలు చర్మం క్రిందికి చొప్పించి గ్రుర్లను గుంపులు గుంపులుగా పెడుతుంది. ఈ గుర్లు 3-4 రోజులలో పొదిగి చిన్న లార్వాలాగా వృద్ధిచెందుతాయి. ఇవి కాయలోని గుజ్జును తినివేయడం వల్ల ఆశించిన భాగంలో కాయలు మెత్తబడి కుళ్ళిపోవడం జరుగుతుంది.

నివారణ : తోటలను శుభ్రంగా వుంచుకోవాలి. చెట్లక్రింద పడిపోయిన, చెట్లపైన మిగిలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. మిథైల్‌ యూజినాల్‌ ఎర బుట్టలను ఉపయోగించి ఆకర్షింపబడిన మగ పురుగులను నాశనం చేయాలి.

నులి పురుగులు : నులి పురుగుల నివారణకు నారు సంచులలో 1 గ్రా. కార్ఫోప్యూరాన్‌ 3 జి గుళికలను నారు సంచికి 1 గ్రా. చొప్పున విత్తనాల మొలకెత్తిన తరువాత వేయాలి. నులి పురుగులు సోకిన తోటల్లో మొక్కకు 250 గ్రా. వేప పిండి మరియు నులి పురుగులు బెడద వున్న ప్రాంతాలలో ఒక్కొక్క మొక్కకక 250 గ్రా. వేప పిండి మరియు కార్బోఫ్యూరాన్‌ ౩ జి గుళికలను 25-30 గ్రా. మరియు సుడోమోనాస్‌ ఫ్లోరిసెన్స్‌ను 4 గ్రా. చొప్పున ఒక్కొక్క చెట్టుకు వేయాలి.