AP Cabinet Decisions: అమరావతిలో మరో ల్యాండ్ పూలింగ్, 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ కోసం భూసమీకరణ చేయనున్నారు.
AP Cabinet Decisions: ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో రెండో దశ లాండ్ పూలింగ్ (భూసమీకరణ) కు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. 7 గ్రామాల్లో 16,666 ఎకరాల భూసమీకరణ చేయనున్నారు. ఇక, 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి క్యాబినెట్ ఓకే చెప్పింది.
రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ కోసం భూసమీకరణ చేయనున్నారు. పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సాదాబైనామాల రిజిస్ట్రేషన్ కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. స్టాంప్ డ్యూటీ లేకుండా రెగ్యులరైజేషన్ చేయనుంది. పోలవరం పరిధిలో 542 కోట్ల రూపాయల పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఓకే చెప్పింది. దేశంలోనే గొప్ప నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని మంత్రి పార్థసారథి తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేసేలా పలు ముఖ్యమైన నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది. రెండో దశ భూ సమీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (CRDA) పరిధిలోని ఏడు గ్రామాల్లో 16వేల 666 ఎకరాల భూమిని సమీకరించనున్నారు.
అమరావతి రైతులతో ప్రభుత్వం ఇటీవల జరిపిన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో చాలామంది రాజధాని ప్రాంత విస్తరణలో భాగమయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రెండో దశలో చేర్చబడిన గ్రామాలు వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రోయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి ఉన్నాయి. గ్రామ సమావేశాలు నిర్వహించి, ల్యాండ్ పూలింగ్ ప్లాన్ కోసం రైతుల నుండి సమ్మతి పొందారు.
అమరావతిలో ఇప్పటికే దాదాపు 33వేల ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ఇది రాజధాని అభివృద్ధికి పునాదిగా నిలిచింది. ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ కు కేబినెట్ ఆమోదం తెలపడంతో.. CRDA ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారికంగా భూమిని సేకరించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుంది.
Also Read: చంద్రబాబు, లోకేశ్ వార్నింగ్‌లు వర్కౌట్ అవుతున్నట్లేనా? వారికి నోటీసులెందుకు?
