Chilli Prices : తగ్గిన ఎగుమతులు…పతనం దిశగా మిర్చి ధరలు

గతంలో చైనాకు 100 కంటైనర్లు మిర్చి వెళ్తుండేది. ప్రస్తుతం అందులో సగభాగం కూడా ఎగుమతి కాని పరిస్ధితి నెలకొంది. బంగ్లాదేశ్‌కు 20 నుంచి 25 కంటైనర్లు వెళ్తుంటాయి. ప్రస్తుతం అయిదు కంటైనర్లకు మించి వెళ్ళటంలేదు. 

Chilli Prices : తగ్గిన ఎగుమతులు…పతనం దిశగా మిర్చి ధరలు

Chilli

Chilli Prices : ఎగుమతులు తగ్గటంతో మిర్చి ధరలు రోజురోజుకు పతనమౌతున్నాయి. దీంతో మిర్చి రైతుల పరిస్ధితి అయోమయంగా మారింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో మిర్చి పంటను అధికంగా సాగు చేస్తుంటారు. అసియాలోనే అతిపెద్ద దైనా మిర్చి మార్కెట్ యార్డు ఏపిలోని గుంటూరులో నెలకొని ఉంది. ఇక్కడి నుండి దేశ, విదేశాలకు మిర్చి ఎగుమతవుతుంది. చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ తోపాటు ఇతర దేశాలకు మిర్చి ఎగుమతి చేస్తారు. కరోనా ప్రభావంతో మిర్చి ఎగుమతులు గత ఏడాది కాలంగా మందగించాయి.

ఈ ఏడాది ప్రస్తుతం మిర్చి పంట చేతికి వస్తుంది. చాలా మంది గత ఏడాది పండిన పంటను కోల్డ్ స్టోరేజిలలో అధిక ధర వస్తుందన్న నమ్మకంతో నిల్వవుంచారు. అయితే ప్రస్తుతం ఎగుమతులు అంతంత మాత్రంగా ఉండటంతో ధరలు పతనం దిశగా పయనిస్తున్నారు. చైనాలో కరోనా తిరిగి వ్యాప్తి చెందుతుంటం, శ్రీలంక, బంగ్లా దేశ్ లో అర్ధిక పరిస్ధితుల దెబ్బతినటంతో వెరసి మిర్చి ఎగుమతులకు గడ్డు పరిస్ధితులు ఏర్పడ్డాయి.

అయా దేశాలకు మిర్చి ఎగుమతి చేసేందుకు వ్యాపారులు అంతగా ఆసక్తి చూపించటం లేదు. ఒకవేళ మిర్చిని అదేశాలకు విక్రయించినా తమ చేతికి డబ్బు వస్తుందన్న గ్యారెంటీ లేకపోవటంతో స్ధానిక ఎక్స్ పోర్టర్లు చాలా మంది వెనకంజ వేస్తున్నారు. దీంతో ఎక్కడి సరుకు అక్కడి నిలిచిపోతుంది. ఈ ప్రభావం మిర్చి ధరలపై పడుతుంది. ఎగుమతులు లేకపోవటంతో కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. మార్కెట్లో మిర్చి ధరలు పతనమవుతుండటం రైతాంగాన్ని ఆందోళనలో పడేస్తోంది.

మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మిర్చి పంటను అధికంగా పండిస్తారు. ప్రస్తుతం అక్కడ కూడా మిర్చి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మిర్చికంటే మధ్యప్రదేశ్ లో మిర్చి తక్కువ ధరకు వస్తుండటంతో వ్యాపారులు అక్కడి మిర్చిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైబ్రీడ్ రకాల మిర్చి 4వేల రూపాయలకే మధ్యప్రదేశ్ లో లభిస్తుండటంతో ట్రేడర్లు మధ్యప్రదేశ్ లో మిర్చికొనుగోళ్ళు జరిపేందుకు ఆసక్తి చూపుతున్నారు.

గతంలో చైనాకు 100 కంటైనర్లు మిర్చి వెళ్తుండేది. ప్రస్తుతం అందులో సగభాగం కూడా ఎగుమతి కాని పరిస్ధితి నెలకొంది. బంగ్లాదేశ్‌కు 20 నుంచి 25 కంటైనర్లు వెళ్తుంటాయి. ప్రస్తుతం అయిదు కంటైనర్లకు మించి వెళ్ళటంలేదు.  శ్రీలంకకు గతంలో 15 కంటైనర్ల మిర్చి ఎగుమతి అవుతుండేది. అక్కడ ఆర్థిక సంక్షోభం కారణంగా పూర్తిగా ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ కారణాల దృష్ట్యా ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. ఇదిలా వుంటే ప్రస్తుతం మార్కెట్లో నాణ్యత కలిగిన సరుకు లభించకపోవటం కూడా ధర తగ్గటానికి ముఖ్యకారణమని వ్యాపారులు చెబుతున్నారు.

ప్రస్తుతం గుంటూరు మార్కెట్ యార్డులో కామన్‌ వెరైటీలైన 334, నెంబర్‌ 5, 273, 341, 4884, సూపర్‌ 10 రకాల మిర్చి సగటు ధర రూ.7,000 నుంచి రూ.13,000 ఉండగా, తేజ రకానికి రూ.7,000 నుంచి 15,000, బాడిగ రకానికి రూ.7,000 నుంచి రూ.16,000, తాలు మిర్చికి రూ.4,000 నుంచి రూ.8,300 ధర లభిస్తుంది. గత నెల రోజుల క్రితం తో పోలిస్తే సుమారుగా 1000రూపాయల వరకు ధర పడిపోయింది. రానున్న రోజుల్లో మరింతగా ధరలు పతనమయ్యే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది.