AP Endowment Commissioner : వినాయక మండపాల ఏర్పాటుకు డబ్బులు వసూలు..! క్లారిటీ ఇచ్చిన దేవాదాయ శాఖ

ఏపీలో వినాయక మండపాల ఏర్పాటుకు రుసుం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. హిందువుల పండుగలపై వివక్ష చూపిస్తున్నారని, నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డాయి.

AP Endowment Commissioner : వినాయక మండపాల ఏర్పాటుకు డబ్బులు వసూలు..! క్లారిటీ ఇచ్చిన దేవాదాయ శాఖ

AP Endowment Commissioner : ఏపీలో వినాయక మండపాల ఏర్పాటుకు రుసుం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. హిందువుల పండుగలపై వివక్ష చూపిస్తున్నారని, నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డాయి. దీంతో ఏపీ దేవాదాయ శాఖ రంగంలోకి దిగింది. దీనిపై క్లారిటీ ఇచ్చింది.

వినాయక మండపాల ఏర్పాటుకు రుసుం వసూలు చేస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ తేల్చి చెప్పారు. వినాయక మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుం వసూలు చేయడం లేదని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన కోరారు.

కాగా, వినాయక మండపాల ఏర్పాటులో చట్టపరమైన అనుమతుల కోసం రెవెన్యూ, పోలీస్ శాఖను సంప్రదించాలని దేవాదాయశాఖ కమిషనర్ చెప్పారు. చందాలు, రుసుము తీసుకున్నా.. ప్రేరేపించినా చట్టపరమైన చర్యలు తప్పవని దేవాదాయశాఖ కమిషనర్ హెచ్చరించారు. వినాయక మండపాలకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న అబద్దపు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు.

”వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు రుసుం వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజంలేదు. వినాయకచవితి మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి రుసుం వసూలు చేయడంలేదు. గణేశ్ మండపాలు ఏర్పాటు చేయదలిచిన వారు స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులను సంప్రందించాలి. చట్టపరంగా అవసరమైన అనుమతులు తీసుకోవాలి. అంతకుమించి ఎలాంటి రుసుం గానీ, చందాలు గానీ తీసుకున్నా, అందుకు ప్రేరేపించినా… వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా వినాయక మండపాలకు రుసుం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందితే, సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయి” అని దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ చెప్పారు.

రుసుం వసూలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని వివరించారు. ఇటువంటి అసత్య, నిరాధార ప్రచారాలను ప్రజలు, భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. వినాయకచవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.