AP High Court : రుయా ఆస్పత్రిలో మరణాలపై ఏపీ హైకోర్టు విచారణ

తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణాలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఆక్సిజన్ అందక 43 మంది చనిపోయారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

AP High Court : రుయా ఆస్పత్రిలో మరణాలపై ఏపీ హైకోర్టు విచారణ

Tirupati

Tirupati Ruia Hospital : తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణాలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఆక్సిజన్ అందక చనిపోయింది 23 మంది కాదని, 43 మంది చనిపోయారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో మిగతా మృతుల పేర్లను కూడా జిల్లా కలెక్టర్ కు ఇవ్వాలని, వారికి కూడా ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పరిహారం ఇవ్వని పక్షంలో మళ్లీ పిటిషన్ వేయొచ్చని హైకోర్టు చెప్పింది. ఇక ఆక్సిజన్ ను అందించే ఏజెన్సీనే కాకుండా రుయా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపైనా విచారించాలని హైకోర్టు తెలిపింది.

మే 10న తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో లోపం వల్ల ఒకేసారి పెద్ద సంఖ్యలో కరోనా బాధితులు మృతి చెందారు. 20 మందికి పైగా మరణించారని అప్పట్లో ప్రతిపక్షాలు, పలు సంస్థలు ఆరోపించాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్య తప్పని చెప్పింది. 11 మంది మరణించారని, సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్ రాకపోవడంతో నిల్వలు తగ్గి తగినంత ప్రెజర్‌తో ఆక్సిజన్ సరఫరా కాకపోవడమే ఘటనకు కారణమని తేల్చింది.

ఇది జరిగిన 15 రోజుల తర్వాత ప్రభుత్వం 23 మంది మృతుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు నిధులు విడుదల చేసింది. దీంతో అప్పట్లో 11 మంది అంటూ అధికారిక ప్రకటన చేసి, తర్వాత 23 కుటుంబాలకు పరిహారం అందించేందుకు ముందుకు రావడం వెనుక కారణాలను పలువురు విపక్ష నేతలు ప్రశ్నించారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టిందని ఆరోపించారు.