ఇదేం గొడవరాబాబూ..చిచ్చు పెట్టిన ’పంచె‘..13మందికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం

ఇదేం గొడవరాబాబూ..చిచ్చు పెట్టిన ’పంచె‘..13మందికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం

AP Kadapa: Chekka Bhajana Performer man  Dhoti On Woman : గొడవలు, ఘర్షణలు అయి కొట్టుకునేదాకా వెళ్లారు అంటే అది ఆస్తి తగాదాలో లేదా సరిహద్దు గొడవలో లేక రాజకీయ గొడవలో అయి ఉంటాయి. కానీ ఓ ‘పంచె’ ఏకంగా 13మందికి గాయాలయ్యేలా చేసింది. వీరిలో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది అంటే ఆ ‘పంచె’ గొడవ ఎంత చేసిందో అర్థం చేసుకోవచ్చు..

ఈ ‘పంచె’ గొడవేంటో చూద్దాం..కడప నగరంలోని మరియాపురంలో డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్థానికులు రాయలసీమ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన ‘చెక్క భజన’ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓ వ్యక్తి భజనలతో పాటలు పాడుతూ..డ్యాన్స్ వేస్తూ..రెచ్చిపోయాడు. ఆనందోత్సాహాలతో ఊగిపోయాడు. మద్యం తాగాడో ఏమోగానీ ఆ ఆనందంతో సదరు భజన కళాకారుడు చెక్కలతో భజన చేస్తూ..చేస్తూ..తను కట్టుకున్న ‘పంచె’ విప్పి గుంపులోకి విసిరేశాడు.

అలా ఎగిరి వెళ్లిన ఆ పంచె కాస్త ఓ మహిళపై పడింది. దీంతో సదరు మహిళలకు ఒళ్లు మండింది. ఏవడో పంచె విప్పి నా మొహాన వేస్తాడా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ సదరు పంచె విప్పి పారేసిన వ్యక్తిపై గొడవకు దిగింది.

ఇద్దరి మధ్యా గొడవ పెద్దదైంది. ఈక్రమంలో బాధిత మహిళ వైపు మరో మహిళ మాట్లాడుతూ..పంచె విసిరేసిన వ్యక్తిని నిలదీసింది. దీంతో సదరు వ్యక్తి రెచ్చిపోయాడు. ఏంటీ ఆమెగారికి నువ్వు వత్తాసు పలకటానికి వచ్చావా? అంటూ ఆమె చెంపచెళ్లుమనిపించాడు.

దీంతో గొడవ మరింత పెద్దదైంది. పోలీసు స్టేషన్ దాకా వెళ్లింది. జరిగింది. ఈ విషయమై శనివారం ఉదయం కడప పోలీస్‌స్టేషన్‌లో బాధిత మహిళ ఫిర్యాదు చేయగా..ఇరువైపుల వారికి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించి పంపించారు.

కానీ ఆ గొడవ అంతటితో ఆగలేదు. ఎవరిళ్లకు వారు వెళ్లగానే..ఇరువైపులా వారు మళ్లీ గొడవకు దిగారు. ఈసారి కత్తులు, గొడ్డళ్లు, కట్టెలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఒకవైపు ఏడుగురు, మరోవైపు ఆరుగురు గాయపడ్డారు. అలా మొత్తం 13మందికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని రిమ్స్‌ హాస్పిటల్ కు తరలించి చికిత్స నందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుందని డాక్టర్లు తెలిపారు.

ఒక వర్గం తరపున గొడవలో పాల్గొన్న మనోజ్‌ అనే 27 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే శ్రీకాంత్, పృధ్వీరాజ్, రమణ, పెంచలయ్య, శ్రీరాముడు, రెడ్డెయ్యలు కూడా గాయపడ్డారు.

దీనిపై సీఐ ఎం.నాగభూషణం మాట్లాడుతూ..గొడవకు దిగినవారిలో శ్రీకాంత్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12 మంది.. ఇంకా కొంత మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసామని తెలిపారు.

అలాగే ఈ గొడవలో అగస్టీన్ అనే 30 ఏళ్ల వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడగా..బాలసౌరి, ఆనంద్, ప్రశాంత్, ప్రసాద్, శ్రీనివాసులు కూడా గాయపడ్డారు. వీరితరపున బాలసౌరి ఇచ్చిన ఫిర్యాదుతో మరో వర్గానికి చెందిన 11 మందితో పాటు మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదుచేశామని తెలిపారు. దీంతో ఘటనాస్థలం వద్ద మరోసారి ఎటువంటి గొడవలు పునరావృతం కాకుండా పోలీసులు పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు.