AP MLC Election Results 2023 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌స్వీప్.. పశ్చిమ రాయలసీమలోనూ విజయం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. మూడు ఎమ్మెల్సీలను టీడీపీ కైవసం చేసుకుంది. పశ్చిమ రాయలసీమ(కడప-అనంతపురం-కర్నూలు) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోనూ టీడీపీ గెలిచింది. అక్కడ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించారు.

AP MLC Election Results 2023 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. మూడు ఎమ్మెల్సీలను టీడీపీ కైవసం చేసుకుంది. పశ్చిమ రాయలసీమ(కడప-అనంతపురం-కర్నూలు) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోనూ టీడీపీ గెలిచింది. అక్కడ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో 7వేలకు(7,543 ఓట్లు) పైగా మెజార్టీతో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. శనివారం సాయంత్రం వరకు వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి స్వల్ప ఆధిక్యంలో కొనసాగారు. కానీ, రెండో ప్రాధాన్యత ఓట్లతో టీడీపీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి విక్టరీ కొట్టారు.
టీడీపీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించినట్లు అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ప్రకటించారు. టీడీపీ అభ్యర్థికి లక్షా 9వేల 781 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి లక్షా 2వేల 238 ఓట్లు పోలయ్యాయి. రెండో ప్రాధాన్యత ఓట్లతో రాంగోపాల్ రెడ్డి విజయం సాధించారు.
కాగా, రీకౌంటింగ్ కు వైసీపీ విజ్ఞప్తి చేయగా.. ఆర్వో తిరస్కరించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం జేఎన్టీయూ దగ్గర వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి రీకౌంటింగ్ కు డిమాండ్ చేశారు. వైసీపీ, ఇండిపెండెంట్ ఓట్లు టీడీపీ ఖాతాలో వేశారని ఆరోపించారు.
కాగా, ఇప్పటికే తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను టీడీపీ కైవసం చేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. సీఎం జగన్ ఇలాకా పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు.
Also Read..Pithapuram Assembly constituency: పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నారా?
ఏపీలో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ గెలవడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలు, నాయకులకు సెల్యూట్ చేశారు. ఇది ప్రజా విజయంగా అభివర్ణించారు చంద్రబాబు. ఇది మార్పుకు సంకేతం అని, మంచికి మార్గం, రాష్ట్రానికి శుభసూచకం అని చంద్రబాబు చెప్పారు.