ఎంఆర్‌ కళాశాల ప్రయివేటీకరణ: మళ్లీ బాబాయ్‌పై సంచైత ఫైర్

  • Published By: sreehari ,Published On : October 6, 2020 / 06:09 PM IST
ఎంఆర్‌ కళాశాల ప్రయివేటీకరణ: మళ్లీ బాబాయ్‌పై సంచైత ఫైర్

Sanchaita Gajapathi Raju & Mansas Trust: ఏళ్ల చరిత్ర ఉన్న విజయనగరం మహరాజుల మాన్సాస్ ట్రస్ట్ ప్రతిష్ట, మసకబారుతోందా? ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలను భ్రష్టు పట్టించడంలో అప్పుడు బాబాయ్, ఇప్పుడు అమ్మాయ్. ఇద్దరూ ఒకటేనా! ఆర్థిక ఇబ్బందుల సాకుగా, నాటి రాజుల దాతృత్వాన్ని మంటలో కలిపేస్తున్నారా? ఆనాడు బాబాయ్ అశోక్ చేసిందేంటి? ఈనాడు అమ్మాయి సంచైత చేస్తున్నదేంటి?

విజయనగరం రాజవంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్టుకు, కొత్త ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజు బాధ్యతలు చేపట్టాక, అన్నీ వివాదాస్పద నిర్ణయాలే.

మాన్సాస్ ట్రస్టుకు, విజయనగరం ప్రాంత ప్రజలకు విడదీయరాని బంధం. ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలతో పాటు వేల కోట్ల విలువున్న ఆస్తులు, భూములతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో అనుబంధం. సంచైత గజపతిరాజు ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ట్రస్టు వ్యవహారమంతా వివాదాల సుడిగుండంలో పడిపోయింది. ప్రస్తుతం మహారాజా అటానమస్ కాలేజీని ప్రైవేటీకరించేందుకు మాన్సాస్ ట్రస్ట్ యాజమాన్యం ప్రభుత్వానికి లేఖ రాయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.



మాన్సాస్ విద్యాసంస్థలది 160 ఏళ్ల చరిత్ర. ఒక్కమాటలో చెప్పాలంటే ఉత్తరాంధ్రుల చదువుల తల్లి మాన్సాస్ విద్యాసంస్థలు. ఐతే ఎంఆర్ కాలేజీని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్త.. రాజవంశీయుల కుటుంబంలో సెగలు రేపింది. ప్రైవేటీకరణపై అశోక్ గజపతిరాజు, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచైత గజపతిరాజు మధ్య వివాదం ముదిరింది. మాటల యుద్ధం జరుగుతోంది.

ఇప్పటికే ఎంఆర్ మహిళా కాలేజీని కో ఎడ్యుకేషన్‌గా మార్చేశారు. తాజాగా ఎంఆర్ కాలేజీ ప్రైవేటీకరణ. భవిష్యత్తులో మాన్సాస్ విద్యాసంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తారనే ప్రచారం కూడా ఉంది. దీంతో పీవీజీ రాజు ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని ఉత్తరాంధ్రుల నుంచి విమర్శలు వస్తున్నాయి.



మాన్సాస్ విద్యాసంస్థలపై వివాదానికి.. మాన్సాస్ ట్రస్ట్ యాజమాన్యం ప్రభుత్వానికి రాసిన లేఖ కారణమైంది. ఇటీవల ఎంఆర్ కాలేజీలోనీ అన్ఎయిడెడ్ లెక్చరర్లు తమకు వేతనాలు చెల్లించాలంటూ ఆందోళన చేశారు. ఇదే అవకాశంగా మాన్సాస్ ఛైర్మన్ సంచైత గజపతిరాజు, ఏకంగా కాలేజీనే ప్రైవేటుపరం చేసేందుకు గత నెల ప్రభుత్వానికి లేఖ రాశారు.

లెక్చరర్లకు, సిబ్బందికి జీతాలు చెల్లించుకోలేకపోతున్నామని, ఫీజులు పెంచితే వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అందులో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీని ప్రైవేటీకరిస్తే తప్ప నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితి లేదని విన్నవించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కాలేజీలోని మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల వివరాలు, విద్యార్థుల సంఖ్య, ఫీజులు, నిర్వహణ ఖర్చుల వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక పంపాలంటూ ఉత్తర్వులు పంపింది.



అశోక్‌ గజపతిరాజు ప్రతిపాదన, సంచయిత గజపతిరాజు అమలు!
ఎంఆర్ కాలేజీనీ ప్రైవేటీకరించాలంటూ మాన్సాస్ ట్రస్ట్ యాజమాన్యం ప్రభుత్వానికి లేఖ రాయడం పట్ల ట్రస్ట్ మాజీ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు స్పందించారు. మాన్సాస్ ట్రస్ట్ కుటుంబ, ప్రైవేట్ ఆస్తి కాదని ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. మాన్సాస్ ట్రస్ట్‌కు అనేక చోట్ల భూములున్నాయని 125 కోట్ల మేర ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు.

అయినప్పటికీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం దారుణమని విమర్శించారు. ట్రస్ట్‌ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదన్నారు.

అశోక్ గజపతిరాజుకు ట్విట్టర్ వేదికగా సంచైత కౌంటర్ వేశారు. ఆయనపై ఆరోపణలు గుప్పించారు. ఎంఆర్ కాలేజీపై అశోక్ గజపతిరాజు చేస్తున్నది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఎంఆర్ కాలేజీ స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రైవేట్ కాలేజ్, ఎయిడెడ్ హోదాను 2017లో ఆయనే సరెండర్ చేశారని తెలిపారు. ఆ విధానంతోనే ఇప్పుడు తాము ముందుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు.



మాన్సాస్ ఛైర్మన్‌గా అశోక్ గజపతిరాజు తప్పుడు వివరాలు ఇవ్వడం వల్లే అప్పుడు మాన్సాస్ కాలేజీలకు ఆరున్నర కోట్ల నష్టం వచ్చిందని సంచైత ఆరోపించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అశోక్ గజతిరాజు ఈ డబ్బు ఇచ్చారేమో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. 2018 – 20 విద్యా సంవత్సరాల్లో 170 మంది విద్యార్ధులకు ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటుకాకుండా పోయాయని తప్పుబట్టారు. అశోక్ గజపతిరాజు విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్నారంటూ ట్విటర్ వేదికగా సంచైత ఘాటుగా స్పందించారు.