Sai Teja: ‘నేనున్నంత వరకూ ఆర్మీలోనే ఉండు సాయితేజ’ – బిపిన్ రావత్

సైనికుడిగా దేశానికి సేవలించడంలో ఓ తృప్తి ఉంది. ఏం పని చేసినా, ఎన్ని కోట్లు వెనకేసినా ఆ తృప్తికి సాటిరాదు. అందుకే చాలా మంది ప్రాణాలను పణంగా పెట్టి దేశంకోసం అడుగేస్తున్నారు.

Sai Teja: ‘నేనున్నంత వరకూ ఆర్మీలోనే ఉండు సాయితేజ’ – బిపిన్ రావత్

Bipin Rawat

Sai Teja: సైనికుడిగా దేశానికి సేవలించడంలో ఓ తృప్తి ఉంది. ఏం పని చేసినా, ఎన్ని కోట్లు వెనకేసినా ఆ తృప్తికి సాటిరాదు. అందుకే చాలా మంది ప్రాణాలను పణంగా పెట్టి దేశంకోసం అడుగేస్తున్నారు. చిత్తూరు జిల్లా వాసి సాయితేజ కూడా అలాగే దేశ భద్రత కోసం జాయిన్ అయ్యాడు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి.. దేశం తలెత్తుకునే స్థాయికి ఎదిగి.. వీర పోరాటంలో అమరుడయ్యాడు. విధి నిర్వహణలో వీర మరణం పొందాడు. సొంతూరితో పాటు యావత్‌ దేశాన్ని కన్నీటిసంద్రంలో ముంచెత్తాడు.

డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2012లో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌లో ఎంపికయ్యాడు సాయితేజ. ఆ తర్వాత పారా కమాండో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాడు. 11వ పారా లాన్స్‌ నాయక్‌ హోదాను దక్కించుకుని సీడీఎస్‌ ఏర్పాటయ్యాక జనరల్‌ బిపిన్‌ రావత్‌కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యాడు. తొమ్మిదేళ్లలోనే అత్యున్నత శిఖరాలు అందుకున్నాడు.

సాయితేజ స్ఫూర్తితో అతని సోదరుడు కూడా ఆర్మీలో చేరాడు. అందొచ్చిన కొడుకుల్ని దేశానికి అప్పగించింది ఆ కుటుంబం. ఆర్మీలో దేశం గర్వపడేలా ఎదుగుతున్న సాయితేజను అనుకోని ప్రమాదం చిదిమేయడం అందరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. సొంతగ్రామం రేగడపల్లెలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సాయితేజ కుటుంబమంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

మహేశ్‌, సాయితేజ సోదరుడు

తన సొంతూరి నుంచి తనలాంటి వారిని మరింత మందిని తయారు చేయాలని సాయితేజ ఆశపడ్డాడు. ఎప్పుడూ తన కోసం కలలు కనలేదు. దేశం కోసమే కలలుగన్నాడు. మరింత మందిని సైనికులుగా తీర్చిదిద్దేందుకు ఆర్మీ ట్రైనింగ్‌ సెంటర్‌ పెట్టాలనుకున్నాడు. అంతేకాదు తన పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాడు. సైనిక్‌ స్కూల్లో చేర్పించాలని అనుకున్నాడు. అంతలోనే అనుకోని ఘోరం జరిగిపోయింది. భార్యకు కాల్ చేసిన కాసేపటికే విషాద వార్త చెవిన పడింది. ఇవన్నీ తలుచుకుని సాయితేజ భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

శ్యామల, సాయితేజ భార్య
పారా కమాండోలకు మెరుగ్గా శిక్షణ ఇస్తుండటంతో బిపిన్‌ రావత్‌.. ఏడాది కిందట సాయితేజను తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా నియమించుకున్నారు. రావత్‌ను ఆయన కంటికి రెప్పలా చూసుకునేవారు. ఒకానొక సందర్భంలో తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా.. ఆర్మీ నుంచి వైదొలుగుతానని సాయితేజ చెప్పాడు. నేను ఉన్నంతవరకూ నువ్వూ ఉండు సాయీ అని రావత్‌ చెప్పారట. రావత్‌కు సాయితేజపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. సాయితేజ లాంటి యువకులు దేశ రక్షణకు అవసరమని రావత్‌ భావించారు. తాను ఉన్నంత వరకు ఉండమంటే.. చావులోనూ తనతోనే ఉన్నాడు సాయితేజ.

సాయితేజ బంధువు
సాయితేజ లాంటి ఎందరో యువకులు దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరుతున్నారు. అనుకోని పరిస్థితుల్లో అదే దేశం కోసం ప్రాణాలర్పిస్తున్నారు. అలాంటి వీరులందరికీ వేలవేల వందనాలు.