BJP Operatain south : దక్షిణాదిపై కన్నేసిన కాషాయదళం, ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడులపై బీజేపీ నజర్

దేశమంతా విస్తరించిన బీజేపీకి దక్షిణాది మాత్రం అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. తొలి అడుగు కర్ణాటకకే పరిమితమై.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటాలని అనుకుంటున్న బీజేపీ ఆశలు నెరవేరడం లేదు. దక్షిణాదిపై పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్న కాషాయదళం ప్లాన్లు ఫలించేనా?

BJP Operatain south : దక్షిణాదిపై కన్నేసిన కాషాయదళం, ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడులపై బీజేపీ నజర్

bjps operation south..

BJP Operatain south : ఉత్తరరాన స్థిరపడ్డారు. పశ్చిమాన్ని పక్కా చేసుకున్నారు. ఈశాన్యాన్ని దక్కించుకున్నారు. ఇక మిగిలింది దక్షిణాది ఒక్కటే. యావత్‌ భారతం కాషాయ పార్టీ వ్యూహాలకు చిక్కితే.. దక్షిణాది మాత్రం అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అయినా దక్షిణాదిని దక్కించుకుని పాన్‌ఇండియా పార్టీగా నిలవాలని ఉబలాటపడుతోంది బీజేపీ. దక్షిణాదిలో ఉన్న నాలుగు కీలక రాష్ట్రాల్లో వేయాల్సిన నాలుగు అడుగుల్లో కమల దళం ఒకే అడుగు దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు ‘టార్గెట్‌ సౌత్‌ విజయ్‌’ పేరుతో సదరన్‌లో దౌడు తీయాలని గ్రౌండ్‌ రెడీ చేసింది బీజేపీ.

దేశమంతా విస్తరించిన బీజేపీకి దక్షిణాది మాత్రం అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. తొలి అడుగు కర్ణాటకకే పరిమితమై.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటాలని అనుకుంటున్న బీజేపీ ఆశలు నెరవేరడం లేదు. ఉత్తరాది పార్టీగా ముద్రపడి చాలా కాలం దక్షిణాదికి దూరంగా ఉండిపోయిన కమలం పార్టీకి 2008లో దశ తిరిగింది. దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన కర్ణాటకలో విజయం సాధించి తొలి అడుగువేసింది. ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచింది బీజేపీ. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీగా.. బీజేపీ లేని రాజకీయం లేనట్లుగా మార్చుకుంది. అదే సమయంలో దక్షిణాదిలో మిగిలిన నాలుగు రాష్ట్రాలు బీజేపీకి కొరకరాని కొయ్యగా మారాయి.

తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఉత్తర దక్షిణ బేధం లేకుండా కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతోంది. ప్రభుత్వ పరంగా లేని ఉత్తర.. దక్షిణ బేధాలు పార్టీ వరకు వచ్చేసరికి చాలా స్పష్టంగా కనిపించడం గుర్తించారు కాషాయ దళపతులు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా. వీరిద్దరి వ్యూహాలకు యావత్ భారతం సలాం కొడుతోంది. 2014 ఎన్నికల నుంచి మోదీ, అమిత్‌షా రాజకీయ చాణక్యంతో వరుసగా ఒక్కోరాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ కమలం పార్టీని దేశమంతా విస్తరించారు. వీరిద్దరి వ్యూహాలకు కాంగ్రెస్‌ కకావికలమైతే.. తలపండిన రాజకీయ నాయకులు కూడా తలవంచేయాల్సి వచ్చింది. కానీ, దక్షిణాదిలో ఆ సీన్‌ ఇప్పటివరకు కనిపించలేదు. మోదీ, అమిత్‌షాలకు ఎదిరిస్తున్న ప్రాంతీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే.. వారు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారే. దక్షిణాదిలో చక్రం తిప్పి వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి దక్షిణాదినీ తమ అడ్డాగా చేసుకోవాలని భావిస్తోంది బీజేపీ.

టార్గెట్‌ -2024.. ఆపరేషన్‌ దక్షిణ్‌ విజయ్‌.. పేరు ఏదైనా లక్ష్యం ఒక్కటే. అదే సదరన్‌లో సత్తా చాటడం. 129 సీట్లు ఉన్న దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం బీజేపీకి 29 సీట్లే ఉన్నాయి. ఇందులోను మెజార్టీ సీట్లు కర్ణాటకలోనే… 17 సీట్లు ఉన్న తెలంగాణలో బీజేపీ గెలిచింది కేవలం 4 సీట్లే.. మిగిలిన 25 స్థానాలు కర్ణాటకలోనే గెలిచించి బీజేపీ. 39 స్థానాలు ఉన్న తమిళనాడు, 25 సీట్ల ఉన్న ఏపీలో, 20 సీట్లు ఉన్న కేరళలో ఒక్కసీటు గెలుచుకోలేదు కమలం పార్టీ. తమిళనాడు, కేరళలో ఇప్పటివరకు బీజేపీ బోణీకొట్టలేదు. ఏపీలో టీడీపీతో పొత్తుతో గతంలో పార్లమెంట్‌ సభ్యులను గెలిపించుకుంది బీజేపీ. కానీ, తమిళనాడు, కేరళ మాత్రం బీజేపీకి అందని ద్రాక్షగా ఊరిస్తోంది.

దక్షిణాదిలో విజయం కోసం పరితపిస్తున్న బీజేపీ.. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ కళ నెరవేర్చుకోవాలని చూస్తోంది. మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికలకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తోంది. 2024లో దక్షిణాదిలో 80 స్థానాల్లో గెలిచేలా ప్లాన్‌ రెడీ చేసింది కమల దళం. తమ టార్గెట్‌ కోసం రెండేళ్ల నుంచి సౌత్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. సదరన్‌ స్టేట్స్‌లో విజయమే లక్ష్యంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తరుచూ పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడి ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. తమ వ్యూహాంలో భాగంగా తమిళనాడు, తెలంగాణల్లో బీజేపీ జాతీయ కార్గవర్గ సమావేశాలు నిర్వహించారు. గత ఏడాది తమిళనాడులో.. ఈ ఏడాది తెలంగాణలో పార్టీ సెంట్రల్‌ కమిటీ సమావేశాలు నిర్వహించడం ద్వారా దక్షిణాదిలో పార్టీని విస్తరించాలనే కాంక్షను చాటుతున్నారు కమల నాథులు.

దక్షిణాదికి చెందిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతంపై దృష్టిపెట్టిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా ఒక్కోరాష్ట్రంలో ఒక్కో ప్లాన్‌ అమలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో బలంగా ఉన్న పార్టీని వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చడం ద్వారా.. ఆ రాష్ట్రంలో తమ ఆధిపత్యం కొనసాగేలా ముందుకు వెళుతున్నారు కమలనాథులు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకుని.. అక్కడికి నాలుగు నెలల తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది బీజేపీ. ఇక ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఆ రాష్ట్రాల్లో పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు కాషాయపార్టీ నేతలు.