Chandrababu Arrest : చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై వీడని ఉత్కంఠ.. విచారణ వాయిదా, తీర్పుపై సర్వత్రా ఆసక్తి
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకి ప్రాణహాని ఉందని, భద్రతాపరమైన అంశాలు ఉన్నాయని, రకరకాల నేరాలు చేసిన వ్యక్తులు ఉండే ప్రదేశం అని.. Chandrababu House Arrest

Chandrababu House Arrest
Chandrababu House Arrest : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. దీనిపై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు రేపటికి (సెప్టెంబర్ 12) వాయిదా వేసింది. వరుస పిటీషన్లు వేస్తే ఎలా? విధులు ఎలా నిర్వహిస్తాం? అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.
హౌస్ రిమాండ్ పిటిషన్ పై కోర్టులో సుదీర్ఘ వాదనలు నడిచాయి. రేపు మరోసారి ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఇవాళ(సెప్టెంబర్ 11) మధ్యాహ్నం నుంచి కూడా హౌస్ రిమాండ్ పిటిషన్ పై ఇరువైపుల వాదనలు విన్నారు. కాసేపట్లో తీర్పు వస్తుందని అంతా ఉత్కంఠగా ఎదరుచూశారు. ఇంతలో విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. గంటల పాటు వాదోపవాదాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు హౌస్ రిమాండ్ పిటిషన్ పై ఎటువంటి తీర్పు వస్తుందోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు.
చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా వాదించారు. సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. హౌస్ రిమాండ్ పిటిషన్ పై ఇరువైపుల నుంచి వాదోపవాదాలను న్యాయమూర్తి విన్నారు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను సీఐడీ వ్యతిరేకిస్తోంది. చంద్రబాబుకి హౌస్ రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదంటోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పూర్తి భద్రత ఉందని, చంద్రబాబుకి అక్కడ అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని, చంద్రబాబుకి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా, ఆరోగ్యపరమైన అంశాలు, భద్రతాపరమైన అంశాలు అన్నీ కూడా చూసుకుంటున్నారని, అక్కడ పూర్తి స్థాయి సంరక్షణ ఉందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకి ప్రాణహాని ఉందని, భద్రతాపరమైన అంశాలు ఉన్నాయని, రకరకాల నేరాలు చేసిన వ్యక్తులు ఉండే ప్రదేశం అని, అక్కడ చంద్రబాబు ప్రాణాలకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, చంద్రబాబు జెడ్ కేటగిరీలో ఉండే వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి హౌస్ రిమాండ్ కు ఉంచాలని వాదించారు. దీంతో పాటు చంద్రబాబు వయసు, ఆరోగ్యం దృష్ట్యా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం సురక్షితం కాదనే అభిప్రాయాన్ని సిద్ధార్ధ లూథ్రా వ్యక్తం చేశారు.
చంద్రబాబుకి హౌస్ రిమాండ్ కి ఇవ్వడానికి గల కారణాలు, వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టులో గతంలో దీనిపై వచ్చిన తీర్పులను కూడా ఈ సందర్భంగా సిద్ధార్ధ లూద్రా కోర్టుకి ఉదహరించారు. అయితే, అవేవీ కూడా చంద్రబాబుకి వర్తించవు అని, చంద్రబాబుకి హౌస్ రిమాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదని సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారణను రేపటికి వాయిదా వేశారు. రేపు మరోసారి ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత చంద్రబాబు హౌస్ రిమాండ్ కు సంబంధించి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.