7PM టాప్ న్యూస్

7PM టాప్ న్యూస్

Speed News

20 Minutes 20 News :

Kuppam

1. గుణపాఠం నేర్చుకున్నానన్న చంద్రబాబు
కుప్పం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. గుడుపల్లిలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. కుప్పం విషయంలో కొంత పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. భవిష్యత్తులో మళ్లీ పొరపాటు జరగనివ్వనున్నారు.. తాను కుప్పం కంటే పులివెందులకే నీళ్లు ఇచ్చానన్నారు చంద్రబాబు..కుప్పం పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠమన్నారు…. వైసీపీ నేతలు కర్నాటక నుంచి మనుషులను పిలిపించి ఓట్లు వేయించారని ఆరోపించారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కుప్పం, రామకుప్పం, శాంతిపురం,గుడుపల్లె మండలాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ నేతలు, ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు, కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు.

తనను కుప్పం రాకుండా అడ్డుకున్నారని… అయినా సరే మళ్లీ మళ్లీ వస్తానన్నారు చంద్రబాబు. కుప్పం ప్రజలకు పూర్తిస్థాయిలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఓటు కోసం ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని… ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోవడం ఖాయమన్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రతి పని గుర్తు పెట్టుకుని… వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చారు చంద్రబాబు. ఇక టీడీపీ అధినేత పర్యటనలో ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. సాలచింతన గ్రామానికి చెందిన సోము అనే యువకుడు చంద్రబాబు కాన్వాయ్‌ ముందుకు వచ్చి పెట్రోల్‌ పోసుకునేందుకు యత్నించాడు. తనతో చంద్రబాబు మాట్లాడకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో కాన్వాయ్‌ ఆపి చంద్రబాబు సోముతో కాసేపు మాట్లాడారు.

Amaravati

2. అమరావతిని అభివృద్ధి చేస్తాం – బొత్స

శాసన రాజధానిగా అమరావతిని కూడా గుర్తించామని అందుకే ఇక్కడ అభివృద్ధికి 3 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు మంత్రి బొత్స. అమరావతి పరిధిలోకి వచ్చే 29 గ్రామాలు రాష్ట్రంలో అంతర్భాగంగానే ఉన్నాయన్న బొత్స.. అందుకే అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమరావతిలో ఫ్లాట్స్‌ ఇచ్చిన వారికి మౌలిక వసతులు కల్పించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

అమరావతిని ఐదేళ్లలో చంద్రబాబు ఎందుకు అభివృద్ధి చేయలేదంటూ ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. సీడ్ యాక్సెస్ రోడ్డును నిర్మిస్తుంటే ఎవరైనా అడ్డుపడ్డారా అని ప్రశ్నించారు. తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం కట్టిన చంద్రబాబు సరిగ్గా రోడ్డు కూడా వేయలేదన్నారు. ఉన్న కొద్దిపాటి రోడ్డుకు 300 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పెట్టారని విమర్శించారు.

స్పీడ్ యాక్సెస్‌ రోడ్ కూడా చంద్రబాబు గ్రాఫిక్స్‌లో ఓ భాగమన్నారు బొత్స. తమ ప్రభుత్వం అమరావతి స్పీడ్ యాక్సిస్‌ రోడ్‌ను కాజా వరకు పొడిగించి జాతీయ రహదారితో అనుసంధానం చేస్తోందన్నారు. స్పీడ్ ఆక్సిస్ రోడ్ జాతీయ రహదారికి కలపడానికి 6 కిలోమీటర్లు కొత్త రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉందన్న బొత్స దీనికి సంబంధించి భూసేకరణ పూర్తి చేసి పనులు చేపడతామన్నారు.

Jobs

3. మా లెక్క.. పక్కా – కేటీఆర్‌

ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల విమర్శలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాల ప్రచారంపై ఆయన బహిరంగలేఖ విడుదల చేశారు. ఆరేళ్లలో లక్షా 32 వేల 899 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆయన తెలిపారు. ఏ ఏ శాఖల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అర్థసత్యాలు, అసత్యాలతో ప్రజలను మభ్య పెడుతున్నాయన్నారు. ముఖ్యంగా యువతను గందరగోళానికి గురిచేయడానికి ప్రతిపక్షాలు కొత్త నాటకాన్ని మొదలుపెట్టాయన్నారు కేటీఆర్.

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ ద్వారా 30వేల 594 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 31వేల 972 ఉద్యోగాలు భర్తీ అయ్యాయన్నారు. ఎడ్యుకేషనర్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 3వేల 623, సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్ ద్వారా 12వేల 5వందల ఉద్యోగాలు ఇచ్చామన్నారు కేటీఆర్. విద్యుత్‌ శాఖలో 22వేల 637మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమ బద్దీకరించినట్లు తెలిపారు. ఎవరికైనా అనుమానాలుంటే ఆయా శాఖల్లో ఎంక్వైరీ చేసుకోవచ్చని సూచించారు కేటీఆర్.

త్వరలో మరో 50వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉద్యోగాల భర్తీ వేగంగా మొదలుపెడతామన్నారు. జానారెడ్డి లాంటి సీనియర్‌ నేతలు కూడా ఉద్యోగాలపై అసత్యాలు మాట్లాడటం బాధకరమన్నారు. పదేళ్లలో తాము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో చెబుతానన్న జానారెడ్డి… అందులో తెలంగాణ వారికి ఎన్ని ఇచ్చారో చెప్పాలన్నారు కేటీఆర్.

T.Congress

4. జానాకు కోపం వచ్చింది

సోషల్‌ మీడియా వేదికగా కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు సొంత పార్టీ నేతలపైనే దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పార్టీ బలోపేతానికి విఘాతం కలిగిస్తాయన్నారు. దుష్ప్రచారం చేస్తున్న వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని పీసీసీ నాయకత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేకపోతే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు జానారెడ్డి.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ విస్మరించిందంటూ టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై జానారెడ్డి మండిపడ్డారు. పీవీని ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. కాంగ్రెస్‌ను అనుసరించాల్సిన బాధ్యత ఆ కుటుంబంపై ఉందన్నారు. పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చినంత మాత్రానా… ఆ కుటుంబాన్ని కాంగ్రెస్‌ గుర్తించలేదనడం సరికాదన్నారు జానారెడ్డి.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు జానారెడ్డి. తెలంగాణలో వివిధ హోదాల్లో క్యాడర్‌ కేడర్‌ స్ట్రెంత్‌ పెంచింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్‌ హాయంలోనే ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు జానారెడ్డి. తెలంగాణ వచ్చాక నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని విమర్శించారు.

ap jagan

5. మాట నిలుపుకున్న జగన్‌

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహాలం ప్రారంభమైంది.. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది అధికార వైసీపీ. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ తమ అభ్యర్థులను ఎంపికి చేసింది వైసీపీ. కోవిడ్‌తో మరణించిన ఇద్దరు నేతల కుమారులకు జగన్ ఎమ్మెల్సీ టికెట్లను కేటాయించారు. చిత్తూరు ఎంపీగా గెలిచిన ఇటీవల మరణించిన దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. కరోనాతో మరణించిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి స్థానంలో ఆయన కుమారుడు చల్లా భగీరథరెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు.

పదవీ కాలం ముగుస్తోన్న అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు మరోసారి అవకాశం కల్పించారు… శ్రీకాకుళం జిల్లా టెక్కలి పార్టీ ఇంచార్జ్‌గా పని చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్‌ను మరో స్థానానికి ఎంపిక చేశారు. ఆయన గతంలో శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో పోటీ చేశారు.

కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత సి.రామచంద్రయ్య… విజయవాడ కార్పొరేటర్ కరీమున్నీసాకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఈనెల 29తో మహ్మద్ ఇక్బాల్, తిప్పేస్వామి, సంధ్యారాణి, వీర వెంకన్న చౌదరి పదవీ కాలం ముగియనుంది. చల్లా రామకృష్ణ రెడ్డి మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లడంతో ఆ స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. మార్చి 15న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలను వెలువరించనున్నారు.

Puducherry

6. మోదీ.. మిషన్ ఎలక్షన్‌

బ్రిటీష్‌ వాళ్ల మాదిరి విభజించు-పాలించు అన్న చందంగా పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ పాలన సాగిందని ఎద్దేవా చేశారు. ముందు పుదుచ్చేరి బహిరంగ సభలో పాల్గొన్న మోదీ-కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. రాహుల్‌ వ్యాఖ్యలు తనని షాక్‌కి గురిచేశాయన్నారు. ఎన్డీయే ప్రభుత్వం 2019లోనే మత్స్య శాఖను ఏర్పాటు చేసిన విషయం కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌కు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పశుపాలన, డైరీ శాఖలతో పాటు మత్స్య శాఖను ఏర్పాటు చేసినట్లు బీజేపీ చెబుతోంది. మత్స్యశాఖను ఏర్పాటు చేస్తామన్న హామీని బీజేపీ అమలు చేయలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేరళ పర్యటనలో రాహుల్‌ మరోసారి మత్స్యశాఖ గురించి ప్రస్తావించారు. పుదుచ్చేరి భవిష్యత్తు బాగుంటుందని భరోసా ఇచ్చారు.

తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమిళనాడులో వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. కోయంబత్తూరులో రూ.12,400 కోట్లతో చేపట్టే ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేశారు మోదీ. నైవేలిలో రూ.8వేల కోట్లతో 1000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన లిగ్నైట్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో పాటు 709 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించారు. అధికార అన్నాడీఎంకేతో కలిసి బరిలోకి దిగుతున్న బీజేపీ తమిళనాడులో పట్టుకోసం విశ్వ ప్రయత్నం చేస్తోంది.

Fish

7. రాహుల్‌ చేపల మంత్రం

కేరళలో మత్స్యకారులకు చేరువయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ. నిన్నంతా మత్స్యకారులతోనే గడిపిన ఆయన.. 2021, ఫిబ్రవరి 25వ తేదీ గురువారం కొల్లాం జిల్లా తంగస్సేరీ బీచ్‌కు వెళ్లి జాలర్లతో మాట్లాడారు. మత్సకారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని మరోసారి డిమాండ్‌ చేశారు రాహుల్‌. తనకెప్పుడు మత్సకారుల్లా జీవితం గడపాలని ఉంటుందని.. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరిందన్నారు రాహుల్‌.

తమ జీవితాన్ని రిస్క్‌లో పెట్టి మత్సకారులు సముద్రంలోకి వెళ్తారని, ఎంతో ఆశతో వలను సముద్రంలో విసురుతారని, అయితే చాలా సార్లు వలలకు చేపలు చిక్కవన్నారు. ఎన్నో కష్టాల మధ్య మత్సకారులు జీవితాన్ని సాగిస్తున్నారని రాహుల్‌ అన్నారు.

వాడి బీచ్ నుంచి మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి వెళ్లిన రాహుల్‌… చేపలు పట్టారు. చేపల వల విసిరిన తర్వాత మత్స్యకారులతో పాటు సముద్రంలోకి దూకి అందరినీ ఆశ్చర్యపరిచారు రాహుల్. హఠాత్తుగా పడవలో నుంచి సముద్రంలో దూకి జాలర్లతో కలిసి ఈతకొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మరోవైపు మత్స్యకారులతో రాహుల్ దాదాపు రెండున్నర గంటలు గడిపారు. మత్స్యకారులు వండిన చేపల కూరను బోటులోనే వారితో కలిసి ఆరగించారు. కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన ఆయన.. వీరి సమస్యలను తమ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తానని హామీ ఇచ్చారు. రైతుల్లానే మత్స్యకారులు కూడా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

Tamilnadu

8. పళని స్వామి ఎన్నికల వరాలు

ఎన్నికలు దగ్గర పడడంతో.. కొత్త కొత్త స్కీమ్‌లను అమల్లోకి తెస్తున్నారు తమిళనాడు సీఎం పళనిస్వామి. జనాన్ని ఆకట్టుకునే నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. ఓ వైపు దేశవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతుంటే.. తమిళనాడులో మాత్రం 9, 10, 11 క్లాసులకు చెందిన విద్యార్థులను పరీక్షలతో సంబంధం లేకుండానే పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు పళనిస్వామి.

సీఎం నిర్ణయంతో ఈ ఏడాది పరీక్షలు రాయకుండా విద్యార్థులు తదుపరి క్లాస్ కి ప్రమోట్ అవుతున్నారు. ఈ ఏడాది పరీక్షలు రద్దు చేయాలంటూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి వేల సంఖ్యలో వినతులు వచ్చాయని.. అందువల్లే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు పళని. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 59 ఏళ్లుగా ఉంది.

తాజా నిర్ణయంతో 2021 మే 31 లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులందరూ మరో ఏడాది పాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రభుత్వ కార్పొరేషన్లు, స్థానిక సంస్థల ఉద్యోగులకు ఈ పదవి విరమణ వయస్సు పెంపు వర్తించనుంది. గతేడాది 58 ఏళ్లుగా ఉన్న పదవి విరమణను 59కి పెంచింది పళని సర్కారు. తాజాగా మరో ఏడాది పెంచింది.

E Bike

9. ఈ – బైక్‌ ఎక్కిన మమతా బెనర్జీ

రోజురోజుకి పెరుగుతున్న పెట్రోలు ధరలను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వినూత్న నిరసన చేపట్టారు. తన కాన్వాయ్ లో కాకుండా ఎలక్ట్రిక్ బైక్ పై సచివాలయానికి వెళ్లారు. మమతా బెనర్జీ అనూహ్యంగా చేసిన ఈ జర్నీ.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ ఎలక్ట్రిక్ బైక్ నడుపుతుండగా మమతా బండి వెనక సీటుపై కూర్చున్నారు. తలకు హెల్మెట్ కూడా ధరించారు. హజ్రామోర్ లోని తన ఇంటి నుంచి నాబన్నా లోని సెక్రటేరియేట్ వరకు బైక్ పైనే కలకత్తా రోడ్లపై ప్రయాణించారు మమత. ఐదు కిలోమీటర్ల పాటు కొనసాగిన ఈ ప్రయాణంలో ప్రజలకు నమస్కారం చేస్తూ ముందుకు సాగారు మమత. ఈ మొత్తం ప్రయాణాన్ని ఫేస్ బుక్ లైవ్ లో పెట్టడంతో నిమిషాల్లోనే వైరల్ గా మారింది మమత బైక్ రైడ్.

సెక్రటేరియేట్ చేరుకున్న తర్వాత మమత మాట్లాడారు. మోదీ దేశాన్ని అమ్మేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత కేంద్ర సర్కార్ యాంటీ నేషన్, యాంటీ పీపుల్, యాంటీ విమెన్, యాంటీ ఫార్మర్, యాంటీ యూత్ గా మారిందన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు మమత.

రాబోయే ఏప్రిల్ లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండంతో బీజేపీ, టీఎంసీ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా 2021, ఫిబ్రవరి 25వ తేదీ గురువారం రోజు రథయాత్ర ప్రారంభించారు. సరిగ్గా అదే సమయానికి దానికి ప్రతిగా మమత బైక్ రైడ్ చేపట్టి ఎన్నికల వేడిని మరింతగా రగిలించారు.

Bundh

10. పెట్రోల్ ధరలపై రేపు భారత్‌బంద్‌

పెట్రోల్‌, డీజీల్‌ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ 2021, ఫిబ్రవరి 26వ తేదీ శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు వామపక్షాలు, లారీ యజమానుల సంఘం మద్దతు పలికింది. ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ కార్పొరేషన్‌ ప్రకటించిన బంద్‌కు 40 వేల వాణిజ్య సంఘాలు మద్దతు ప్రకటించాయి. దేశవ్యాప్తగా పెట్రోల్‌, డీజిల్ ధరలు ఒకేవిధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జీఎస్టీ విధానం సమీక్షించాలని ఆలిండియా ట్రాన్స్ పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరుతోంది.

కొత్త ఈ-వే బిల్లుల విధానాన్ని రద్దు చేయాలని, మరికొన్ని నిబంధనలు కూడా రద్దు చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. అన్నిరకాల వస్తు సేవలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చిన మోదీ ప్రభుత్వం పెట్రోల్‌ డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా కేంద్ర ఖజానాను నింపుకుంటోందని సీపీఐ విమర్శించింది. అంతర్జాతీయంగా పెట్రోల్ 32 రూపాయలకు లభిస్తుంటే కేంద్రం దానికి అదనంగా 36 రూపాయల పన్ను విధించి ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని మండిపడింది. పెంచిన పెట్రోల్, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించేందుకు ప్రజలు కూడా ఆందోళనకు రావాలని సీపీఐ విజ్ఞప్తి చేసింది.

అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని, ఏటా టోల్ రేట్ల పెంపుదలను నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం కూడా తగ్గించాలని లారీ యజమానులు కోరుతున్నారు.

Media

11. ఆన్‌లైన్‌కు సెన్సార్‌షిప్‌

సోషల్ మీడియాలో పోస్టులపై నిఘా వ్యవస్థను కఠినం చేస్తూ కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో పోస్టులను ఫిల్టర్ చేసేలా ఆయా ఫ్లాట్ ఫాంస్‌కు ఆదేశాలు జారీ చేస్తూ.. సరికొత్త మార్గ దర్శకాలను జారీ చేసింది. అసభ్య, అభ్యంతరకర సమాచారం నియంత్రించేలా చర్యలు చేపట్టింది. డిజిటల్‌ మీడియాను సురక్షితంగా మార్చేలా యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వారిపై ఫేక్‌ న్యూస్‌పై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించింది. సోషల్ మీడియాతో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల‌కు కొత్త నియ‌మావ‌ళిని కేంద్రం రిలీజ్ చేసింది.

సోషల్ మీడియా నిబంధనలను కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్రసాద్, ఓటీటీ మార్గదర్శకాలను ప్రకాశ్ జవదేకర్‌ వెల్లడించారు. ఒకరిని కించ పరిచేలా వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ లేదా మెసేజ్‌ పోస్టు చేసిన తొలి వ్యక్తి స‌మాచారాన్ని కోర్టు లేదా ప్రభుత్వ ఆదేశం ప్రకారం సోష‌ల్ మీడియా సంస్థలు బ‌హిర్గతం చేయాల‌ని ఆదేశించింది. దేశ సార్వభౌమ‌త్వం, స‌మ‌గ్రత‌, భ‌ద్రత‌, శాంతిభ‌ద్రత‌లు, విదేశీ వ్యవ‌హారాలు, అత్యాచారం, అస‌భ్య కంటెంట్‌ను ప్రచారం చేసేవారి విష‌యంలో కఠినంగా వ్యవహరిస్తామంది.
ప్రతీ సోషల్‌ మీడియా కంపెనీ.. త్రీ టైర్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. భారతీయ చట్టాలను అమలు చేసేందుకు.. దర్యాప్తు బృందాలకు సహకరించేందుకు కార్యాలయాలను స్థానికంగా ఏర్పాటు చేయడంతో పాటు అధికారులు దేశంలోనే నివాసం ఉండాలని పేర్కొంది. దీంతో పాటు సోషల్ మీడయా అప్లికేషన్లు తమ యూజర్లను వాలంటరీ వెరిఫికేషన్ చేయాలి. యూజర్ పోస్ట్ చేసిన కంటెంట్ ని డిసేబుల్ చేసేప్పుడు అందుకు తగ్గ కారణాలు వివరించాలి. అదే విధంగా యూజర్ చెప్పే వివరణను పరిగణలోకి తీసుకోవాలని రూల్ ని జత చేశారు.

Modi

12. ఉధృతంగా విశాఖ ఉక్కు ఉద్యమం

విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం సలసల కాగుతోంది. ఓ వైపు ప్రైవేటీ కరణ చేయాల్సిందేనని ప్రధాని మోదీ స్పష్టం చేస్తే.. ప్రాణాలు ఫణంగా పెట్టయినా అడ్డుకుంటామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని స్పందించగానే.. కార్మిక సంఘాలు అలర్ట్ అయ్యాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటి ఆధ్వర్యంలో సమావేశమై కార్మికులు ఐక్య ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. 2021, ఫిబ్రవరి 26వ తేదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2గంటల పాటు రాస్తారోకో చేయాలని పిలుపునిచ్చారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రహదారులపై నిరసన తెలపాలని నిర్ణయించారు. 14 రోజులుగా రిలే నిరాహార దీక్షలు, నిరసనలు, ఆందోళనలు చేస్తున్నా తమ మనోభావాలు పట్టించుకోకుండా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుండడాన్ని తప్పుపట్టారు. కేంద్రం రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తుండడం దారుణమన్నారు. బీజేపీ ఏం చేసినా చెల్లుతుందనుకుంటే కుదరదని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. వివిధ మంత్రిత్వశాఖల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయడం దారుణమన్న కార్మికులు.. దీనిపై బీజేపీ నేతలు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అటు కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతోంది. ఈ విషయంపై ప్రధాని మరింత క్లారిటీ ఇచ్చారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాల్సిందేనన్నారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా.. మిగతావన్నీ ప్రైవేట్‌ బాట పట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. వారసత్వంగా వస్తున్నాయని చెప్పి.. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమన్నారు. వ్యాపారం అనేది అసలు ప్రభుత్వ వ్యవహారమే కాదని తెగేసి చెప్పారు. నష్టాల్లో ఉన్న సంస్థలు ప్రజాధనంతో నడుస్తున్నాయని.. అలాంటి వాటిని ప్రైవేటీకరించడమే ఉత్తమమన్నారు మోదీ.

high court

13. టీఎస్‌ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు

2021, ఫిబ్రవరి 26వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి రోజూ కరోనా బులిటెన్ విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దాదాపు ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం రోజువారి కరోనా బులిటెన్లు విడుదల చేసింది. అయితే ఇటీవల కరోనా కేసులు తగ్గినందున రోజువారి బులిటెన్లు విడుదలను నిలిపేసింది. కేవలం వారానికి ఒకసారే కరోనా హెల్త్‌ బులిటెన్‌ ఇస్తామని ప్రటించింది. దీనిపై హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. ప్రతీరోజూ బులెటిన్ ఇవ్వాల్సిందేనంటూ ఆదేశించింది.

విచారణ సందర్భంగా కరోనా పరీక్షల నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. జనవరి 25 నుంచి ఈ నెల 12 వరకు జరిపిన పరీక్షల వివరాలను ప్రభుత్వం తెలిపింది. ఆర్‌టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీ జెన్ పరీక్షలు నిర్వహించినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే.. రాష్ట్రంలో వీలైనంత త్వరలో సీరం సర్వే చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

జూన్‌ 3 నుంచి డిసెంబర్‌ వరకు 3 సీరం సర్వేలు జరిగాయని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అయితే.. మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయని… ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది కోర్టు. రెండో దశలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం పొంచి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణ వచ్చే నెల 18కి వాయిదా వేసింది.

ACB

14. దుర్గగుడి అవినీతిపై చర్యలు

వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన విజయవాడ దుర్గ గుడి ఈవో సురేష్‌ పై చర్యలకు రంగం సిద్ధమయ్యింది. ఏసీబీ సోదాల్లో పలు అక్రమాలు బయట పడటంతో ఇప్పటికే 16 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. అవినీతిని నియంత్రించడంలో ఈవో నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణలపై ఆరా తీస్తోంది ప్రభుత్వం.

దుర్గగుడిలో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారని దేవాదాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ పి. అర్జున్‌రావు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 16 మందిని సస్పెండ్‌ చేశామన్నారు. దుర్గగుడిలో అవినీతిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

దుర్గగుడిలో స్క్రాప్‌ అమ్మకాల్లో గోల్‌మాల్ జరిగిదంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. స్టోర్స్‌, అకౌంట్స్‌, ప్రొవిజన్స్‌ విభాగాల్లో అవినీతి జరిగినట్టుగా ఏసీబీ అధికారులు నిగ్గు తేల్చారు. దీనికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. దీంతో 16 మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. మరోవైపు దుర్గగుడి వ్యవహారం ఏపీలో రాజకీయంగా దుమారం రేపింది. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలోనే దుర్గగుడిలో అవినీతి జరుగుతోందని టీడీపీ నేతలు వరుసగా విమర్శలు చేశారు.

Detonator

15. బాంబుల తయారీ గుట్టు వీడింది

తెలంగాణలో గుట్టుచప్పుడు కాకుండా తయారవుతున్న డిటోనేటర్ల తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. నాలుగు రోజుల క్రితం కరీంనగర్‌లో అక్రమంగా తరలిస్తున్న డిటోనేటర్లను పోలీసులు పట్టుకున్నారు. దీనిపై విచారణ చేయగా హైదరాబాద్‌లోని పాతబస్తీలో బాంబులు తయారు చేస్తున్నట్టుగా తేలింది. దీనిపై మరింత లోతైన దర్యప్తు జరపగా పాతబస్తీలో ఏకంగా అక్రమ డిటోనేటర్ల తయారీ కేంద్రమే ఉన్నట్టు తేలింది.

హైదరాబాద్ సౌత్‌ జోన్ టాస్క్ ఫోర్స్, కరీంనగర్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఫలక్‌నుమాలోని వట్టేపల్లిలో డిటోనేటర్‌ల అక్రమ తయారీ కేంద్రం ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ తనిఖీల్లో దాదాపు వెయ్యి కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలన్నీ హైదరాబాద్ నుంచి కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

2018లో షబ్బీర్‌ అనే వ్యక్తి లైసెన్స్‌ తీసుకొని గన్ పౌడర్‌ తయారీ ప్రారంభించాడు. ఆ తర్వాత అమోనియం నైట్రేట్‌, సోడియం సల్ఫేట్‌లను గన్‌ పౌడర్‌కు కలపడం ద్వారా అక్రమంగా డిటోనేటర్లను కూడా తయారు చేయడం మొదలెట్టారు. ఇలా తయారైన డిటోనేటర్లు కరీంనగర్‌లో పోలీసులకు పట్టుబడ్డాయి. జామ్‌బాగ్‌లోని ఓ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ ద్వారా డిటోనేటర్లు రవాణ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.. తప్పుడు పత్రాలు సృష్టించి.. పాలిష్‌ పౌడర్‌గా చూపించి గన్‌పౌడర్‌ను రవాణా చేస్తున్నట్టు పోలీసులు కనుగోన్నారు.

Vishnuvardhan Reddy

16. అక్కసుతోనే అంతం చేశాడు

తనకు దక్కదన్న అక్కసుతోనే.. అనూషను విష్ణువర్దన్‌రెడ్డి హత్య చేశాడని తేల్చారు నర్సరావు పేట పోలీసులు. దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపి.. వీలైనంత త్వరగా విష్ణువర్దన్‌రెడ్డికి శిక్ష పడేలా చూస్తామన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు డీఎస్పీ రవిచంద్ర. మరోవైపు.. అనూష అంత్యక్రియలు స్వగ్రామంలో ముగిశాయి. అనూషను హత్య చేసిన విష్ణువర్ధన్‌రెడ్డిని అత్యంత కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు ఆమె తల్లిదండ్రులు.

కొంతకాలంగా అనూషను ప్రేమించమంటూ వెంటపడుతున్నాడు విష్ణువర్దన్‌రెడ్డి. 2021, ఫిబ్రవరి 24వ తేదీ బుధవారం ఉదయం బస్సు దిగి కాలేజ్‌కు వెళ్తున్న ఆమెను బలవంతంగా నరసరావుపేట శివార్లలోని కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని కాల్వలోకి తోసేశాడు. ఆ తర్వాత పోలీసుల ఎదుట విష్ణువర్థన్‌రెడ్డి లొంగిపోయాడు.

అనూష హత్యతో నరసరావుపేట అట్టుడికింది. అనూషను చంపిన వ్యక్తిని తమకు అప్పగించాలని వేలాది మంది విద్యార్ధులు స్థానిక రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. తమ కూతురిని ఎంతో జాగ్రత్తగా పెంచుకున్నామని.. ఇళ్లు, కాలేజ్‌కి తప్ప అనూష ఎక్కడికి వెళ్లెది కాదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అటు.. అనూష కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించింది ప్రభుత్వం.

India

17. భారత్‌కి నీరవ్‌ మోదీ

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీని భారత్‌కు రప్పించేందుకు మార్గం సుగమమైంది. నీరవ్‌మోదీని భారత్‌కు పంపేందుకు బ్రిటన్‌ కోర్టు అంగీకరించింది. నీరవ్‌ మోదీని భారత్‌కు తరలించే అంశంపై దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

తన సోదరుడితో కలసి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేశారనడానికి సరైన సాక్ష్యాధారాలున్నాయని వ్యాఖ్యానించింది. భారత్‌కు తరలిస్తే తనకు సరైన న్యాయం జరగదన్న నీరవ్‌మోదీ వాదనలను కోర్టు తప్పుపట్టింది. భారత్‌కు రాకుండా తప్పించుకోవడానికి నీరవ్‌ మోదీ రకరకాల వాదనలు వినిపించారు. తన మానసిక స్థితి సరిగా లేదని, భారత్‌లో తగినన్ని వైద్య సౌకర్యాలు లేవని న్యాయమూర్తిని ఒప్పించడానికి ప్రయత్నించారు. అయితే దీన్ని కూడా బ్రిటన్ జడ్జ్‌ తోసిపుచ్చారు. అలాగే తనకు సరైన వసతులు కల్పించరని చేసిన వాదనలు కూడా నిలబడలేదు. ముంబయి ఆర్దర్‌ రోడ్‌ జైల్‌లో ఇప్పుడు బ్రిటన్‌ జైల్లో ఉన్నదానికంటే పెద్ద రూమే ఇస్తారని మంచి ఆహారం కూడా దొరుకుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు దాదాపు 14వేల కోట్లు టోపీ పెట్టిన నీరవ్‌… విదేశాలకు పారిపోయాడు. చివరకు 2019మార్చి 19న లండన్‌లో అరెస్టయ్యాడు. అప్పట్నుంచి వాండ్స్‌వర్త్‌ జైల్లో ఉన్నాడు.

Firing

18. సరిహద్దుల్లో కాల్పుల విరమణ

ఎప్పుడూ కాల్పుల మోతతో దద్దరిల్లిపోయే.. భారత్‌- పాక్ సరిహద్దుల్లో ఒక్కసారిగా బుల్లెట్ల శబ్ధం ఆగిపోయింది. ఎప్పుడూ లేనంత ప్రశాంతత నెలకొంది. భారత్‌-పాక్‌ మధ్య కుదిరిన తాజా ఒప్పందంతో 2021, ఫిబ్రవరి 25వ తేదీ గురువారం అర్థరాత్రి నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇంతకాలం చైనా సరిహద్దు వివాదంపై దృష్టి పెట్టి.. దాన్ని ఓ కొలిక్కి తెచ్చిన కేంద్రం.. ఇప్పుడు పాక్‌ సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పే దిశగా అడుగులు వేస్తోంది.

ఏడాది కాలంగా కశ్మీర్‌లోని భారత్- క్ సరిహద్దులో తరచుగా కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత్, పాక్ దళాల మధ్య జరుగుతున్న కాల్పుల కారణంగా స్థానిక కశ్మీర్ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తూటాలు తగిలి స్థానికులు గాయాలపాలవుతున్నారు. దీంతో కాల్పుల విషయంలో పునరాలోచనలో పడ్డారు ఇరు దేశాలకు చెందిన ఆర్మీ అధికారులు. సరిహద్దు వెంట ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పే లక్ష్యంతో ఇరు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడం వెనుక జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కృషి ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు నెలలుగా కాల్పుల విరమణ కోసం ఆయన పాకిస్తాన్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత ఆర్మీ అధికారులు చర్చలు జరిపి ఒప్పందం ఖరారు చేసుకున్నారు. అయితే.. సరిహద్దుల నుంచి బలగాల ఉపసంహరణ మాత్రం ఉండదని ఆర్మీ చెబుతోంది. ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవడానికి గస్తీ కొనసాగనుంది.

Strain

19. న్యూయార్క్‌లో న్యూ స్ట్రెయిన్‌

కరోనాతో విలవిలలాడుతున్న అమెరికాపై మరో పిడుగు పడింది. వ్యాక్సిన్ సమర్థతను తగ్గించే కొత్త కరోనా స్ట్రెయిన్ న్యూయార్క్‌లో వెలుగు చూసింది. కరోనాపై జరుపుతున్న పరిశోధనల్లో బీ 1 పాయింట్‌ 526 వేరియంట్ ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. మొదటి సారిగా గత నవంబర్ లో ఈ కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లను కనుగొన్నారు సైంటిస్టులు. ఫిబ్రవరికి వచ్చే సరికి స్ట్రెయిన్ కి సంబంధించి మరో నాలుగు సీక్వెన్స్ లు బయటపడ్డాయి.

కొలంబియా యూనివర్సిటీ, కాల్ టెక్ రీసెర్చ్ గ్రూప్ కి చెందిన సైంటిస్టులు కరోనా న్యూ స్ట్రెయిన్స్ పై పరిశోధన చేస్తున్నారు. తాజాగా బయటపడిన కొత్త రకం వేరియంట్ న్యూయార్క్ ఈశాన్య ప్రాంతంలో ఎక్కువగా ఉనికిలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ బారిన పడిన వారు ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నారంటున్నారు పరిశోధకులు.

కోవిడ్‌ కొత్త మ్యూటేషన్లపైనా వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తాయంటూ ఇంతవరకూ వైద్యులు.. వ్యాక్సిన్ కంపెనీలు చెబుతూ వచ్చాయి. అయితే.. ఇప్పుడు న్యూయార్క్‌లో బయటపడ్డ కొత్త స్ట్రెయిన్ మాత్రం.. ఈ వాదనను చెక్‌ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకున్న తరుణంలో.. ఏకంగా వ్యాక్సిన్ సమర్థతని తగ్గించే కొత్త కరోనా స్ట్రెయిన్ రావడం ప్రమాదకరమని అమెరికా వైద్యులు అంటున్నారు. త్వరలోనే ఈ కొత్త స్ట్రెయిన్ ఇతర ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎర్లీ స్టేజ్ లోనే న్యూ స్ట్రెయిన్ ని గుర్తించడం వల్ల దాన్ని నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న వాదనా వినిపిస్తోంది.

Motera stadium

20. మోతేరాలో మోతెక్కించిన భారత్

మోతేరా టెస్ట్‌లో టీమిండియా విజయం దిశగా దూసుకెళుతోంది. మొతేరా స్టేడియంలో మ్యాచ్‌ రెండోరోజే ముగియనుంది. ఇంగ్లండ్‌ విధించిన 49పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. డిన్నర్‌ బ్రేక్‌ సమయానికి వికెట్‌ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. అంతకుముందు స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్‌ను 81 పరుగులకే ఆలౌటైంది. భారత్‌ ముందు 49 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను ఆలౌట్‌ చేసిన ఉత్సాహంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు అక్షర్‌ పటేల్‌ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ తొలిబంతికే క్రాలీని బౌల్డ్‌ చేశాడు. మూడో బంతికి బెయిర్‌స్ట్రో కూడా బౌల్డ్‌ అయ్యాడు. సిబ్లి కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేదు. కాసేపు స్టోక్స్‌, రూట్‌ ప్రతిఘటించినప్పటికీ లాభం లేకపోయింది. స్టోక్స్‌ను అశ్విన్‌, రూట్‌ను అక్షర్ అవుట్‌ చేశారు.

అక్షర్‌కు ఐదు వికెట్లు దక్కాయి. అశ్విన్‌ 4వికెట్లు తీసాడు. వాషింగ్టన్‌ సుందర్‌ చివరి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్చర్‌ వికెట్‌తో అశ్విన్‌ 4వందల క్లబ్‌లో చేరాడు. ఇంగ్లండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అసలు ఫాస్ట్ బౌలర్లనే రంగంలోకి దించలేదు కోహ్లీ…అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. 99 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. కొద్దిసేపటికే రహానే, రోహిత్‌ వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పంత్‌ సహా ఎవరూ క్రీజ్‌లో నిలవలేదు. చివరి ఏడు వికెట్లు కేవలం 47పరుగులకే పడిపోయాయి. కీలకమైన 33పరుగుల ఆధిక్యం దక్కింది.