ఏపీలో మరోసారి మోగనున్న బడిగంట..ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు రద్దు

ఏపీలో మరోసారి మోగనున్న బడిగంట..ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు రద్దు

classes start for Intermediate first year, Triple IT students today in AP : ఏపీలో మరోసారి బడిగంట మోగనుంది. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం, ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ఇవాళ్టి నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు నిన్నటి వరకు అవకాశం ఇచ్చిన ఇంటర్‌ బోర్డు.. పని దినాలను 106 రోజులకు కుదిస్తూ అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

సిలబస్‌ పూర్తి చేయడం, పరీక్షలు నిర్వహించేందుకుగాను రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31 వరకూ తరగతులు జరుగుతాయని, రెండో శనివారాలు కూడా కాలేజీలు కొనసాగుతాయని పేర్కొంది. 30 శాతం సిలబస్‌ను తగ్గించింది. పరీక్షలో మేలో జరుగుతాయని స్పష్టం చేసింది. 2021-22 విద్యా సంవత్సరంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్‌ 3 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్‌ బోర్డు తెలిపింది.

ట్రిపుల్‌ ఐటి విద్యార్థులకు కూడా ఇవాళ్టి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అడ్మిషన్‌ తీసుకునే విద్యార్థులు ఇవాళ ఉదయంలోపు కళాశాలలో రిపోర్టు చేయాలని మండలి తెలిపింది. ఆరో తరగతి విద్యార్థులకు కూడా సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకూ ఒక పూట తరగతులు జరుగుతున్న పదో తరగతి విద్యార్ధులకు ఇవాళ్టి నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి.