CM Jagan Target Mangalagiri : జగన్ టార్గెట్ మంగళగిరి.. వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్ మరో నియోజకవర్గం చూసుకోవాల్సిందేనా?

చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపై ఫుల్ గా కాన్సన్ ట్రేట్ చేసిన సీఎం జగన్ ఇప్పుడు లోకేశ్ ఎంచుకున్న మంగళరిని టార్గెట్ చేసుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. మంగళగిరి టీడీపీలో కీలక నేత గజ్జెల చిరంజీవిని వైసీపీలోకి లాగేశారు.

CM Jagan Target Mangalagiri : జగన్ టార్గెట్ మంగళగిరి.. వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్ మరో నియోజకవర్గం చూసుకోవాల్సిందేనా?

CM Jagan Target Mangalagiri : చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపై ఫుల్ గా కాన్సన్ ట్రేట్ చేసిన సీఎం జగన్ ఇప్పుడు లోకేశ్ ఎంచుకున్న మంగళరిని టార్గెట్ చేసుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. మంగళగిరి టీడీపీలో కీలక నేత గజ్జెల చిరంజీవిని వైసీపీలోకి లాగేశారు. జగన్ సమక్షంలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంతకీ టీడీపీకి కీలకంగా ఉన్న నియోజకవర్గాలను జగన్ టార్గెట్ చేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో లోకేశ్ మంగళగిరిని వదిలి వేరే నియోజకవర్గాన్ని చూసుకోవాల్సిందేనా?

వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైసీపీ దానికి తగ్గట్టుగానే పావులు కదుపుతోంది. 175కు 175 స్థానాలు సాధించే దిశగా ప్రత్యర్థులకు ఎక్కడికక్కడ చెక్ పెడుతోంది. ముందుగా టీడీపీ కంచుకోటనే టార్గెట్ చేసింది. అక్కడ ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం మొదలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం, చంద్రబాబు పర్యటన సమయంలో పోటాపోటీగా నిరసన ప్రదర్శనలకు దిగడం చూస్తుంటే కుప్పం నియోజకవర్గంలో జెండా పాతేందుకు వైసీపీ ఎంత కసిగా ప్రయత్నిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇప్పుడు కుప్పంతో పాటు మంగళగిరిపైనా సీఎం జగన్ ఫుల్ ఫోకస్ పెట్టారు. కుప్పంలో ఈసారి చంద్రబాబును ఓడించి రికార్డ్ సృష్టించాలని ప్లాన్ చేస్తున్న జగన్.. లోకేశ్ నియోజకవర్గం అయిన మంగళగిరిలో మరోసారి పాగా వేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. నిజానికి మంగళగిరిలో ఎగురుతోంది వైసీపీ జెండానే. అయినా వచ్చే ఎన్నికల్లో మంగళగిరి పేరు ఎత్తితే టీడీపీకి చెమటలు పట్టేలా చేసేందుకు పక్కా ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తున్నారు.

మంగళగిరిలో మెజార్టీ ఓటింగ్ ఉన్న చేనేత సామాజికవర్గంపై దృష్టి పెట్టారు సీఎం జగన్. ఇప్పటికే ఆ సామాజికవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నేత మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక అక్కడి నుంచే అదే సామాజికవర్గానికి చెందిన చిళ్లపల్లి మోహన్ రావుకు ఆప్కో చైర్మన్ పదవి ఇచ్చారు. ఇక తాజాగా అదే సామాజికవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకు మరో కీలక పదవి అప్పగిస్తారనే టాక్ నడుస్తోంది.

గంజి చిరంజీవి వైసీపీలో చేరడం టీడీపీ పెద్ద షాకే ఇచ్చింది. గంజి చిరంజీవి తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి సీఎంతో భేటీ అయ్యి మంగళగిరి సీటుపై హామీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మంగళగిరి నుంచి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే మళ్లీ అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఆయన అక్కడ నుంచి గెలిచారు.

మంగళగిరిలో మరోసారి లోకేశ్ ను ఓడించేందుకు గంజి చిరంజీవి సరైన అభ్యర్థి అని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. అందులో భాగంగానే ఆయనను ఇప్పుడు పార్టీలోకి చేర్చుకున్నట్లు సమాచారం. అయితే 2014లో టీడీపీ నుంచి మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన గంజి చిరంజీవి 2019 ఎన్నికల్లో ఆ స్థానాన్ని నారా లోకేశ్ కోసం త్యాగం చేశారు. స్థానికంగా బీసీ వర్గాల్లో మంచి పట్టున్న లీడర్ గంజి చిరంజీవి. ఈసారి గంజి చిరంజీవినే లోకేశ్ పై అస్త్రంగా ప్రయోగిస్తారని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా ఇటు కుప్పంలోనూ అటు మంగళగిరిలోనూ టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి.