Diarrhoea : కృష్ణాజిల్లాలో అతిసార వ్యాధి ?… 40 మందికి అస్వస్ధత

Diarrhoea : కృష్ణాజిల్లాలో అతిసార వ్యాధి ?… 40 మందికి అస్వస్ధత

Diarrhoea

Diarrhoea :  కృష్ణాజిల్లాలో అతిసార వ్యాధి ప్రబలింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలోని గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలోని తూర్పు బజారులో 40 మందికి   వాంతులు,విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  వారిలో 26 మందిని సమీపంలోని పిన్నమనేని హాస్పటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరి కొంత మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇళ్లకు తిరిగి వచ్చారు.

గడిచిన మూడు రోజుల్లో గ్రామంలో అస్వస్ధతకు గురై 4గురు మరణించారని గ్రామస్తులుతెలిపారు.  గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి పంచాయతీ అధికారులు వైద్య సేవలు అందిస్తున్నారు. గుడివాడ ఆర్డీఓ గ్రామంలో పర్యటించి పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.  గ్రామంలో ఇటీవల మరణించినవారు ఎలా మరణించాలరనే దానిపై కుటుంబ సభ్యులనడిగి వివరాలు తెలుసుకుంటున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి గీతాభాయ్ తెలిపారు.

గ్రామంలో ఆరు వైద్య బృందాలు రెడీగా ఉన్నాయని ఆమె తెలిపారు. గ్రామంలోని వాటర్ ట్యాంక్ లో నీరు త్రాగడం వలన వచ్చిందా… లేక రెండు రోజుల క్రితం గ్రామంలో జరిగిన ఫంక్షన్ లో   కలుషిత ఆహారం వల్ల అతిసారం  ప్రబలిందో తెలుసుకుంటున్నామని ఆమె వివరించారు. మంచినీటి   శ్యాంపిల్స్ ను పరీక్షకు పంపించామని… గ్రామస్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు. గ్రామస్తులు మంచినీటిని వేడిచేసి తాగాలని విజ్ఞప్తి చేశారు.

Also Read : Poisonous Snakes : మంచిర్యాలలో విష సర్పాల కలకలం..వర్షాలు, వరదలకు కొట్టుకొచ్చిన పాములు