కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. ఏపీలో 28,29 తేదీల్లో ‘డ్రై రన్’

కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. ఏపీలో 28,29 తేదీల్లో ‘డ్రై రన్’

Dry run for COVID-19 vaccine Andhra Pradesh : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ ‘డ్రై రన్’ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్రాలను ఎంచుకుంది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఈ నెల (డిసెంబర్ 2020) 28, 29 తేదీల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌ను నిర్వహించనుంది. వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించే నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి కాగా.. పంజాబ్, అసోం, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ మాక్ డ్రిల్ నిర్వహించనుంది కేంద్రం. టీకా లేకుండా నిర్వహించే ఈ ‘డ్రై రన్‌’ అసలైన వ్యాక్సినేషన్‌ లానే ఉంటుంది. ఒక్కో రాష్ట్రం నుంచి ఒకటి రెండు జిల్లాలను ఎంపిక చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రై రన్ నిర్వహించేందుకు క్రిష్ణా జిల్లాను గుర్తించింది.

‘వ్యాక్సిన్‌ సరఫరా, కేటాయింపులు, పరీక్షలు, సిబ్బంది మోహరింపు, ‘డ్రై రన్‌’ చేపట్టే చోట ఏర్పాట్లు, మాక్‌ డ్రిల్‌ సమయంలో భౌతిక దూరం వంటి ముందు జాగ్రత్తలను పాటించడం, నివేదికల తయారీ, సంబంధిత అధికారుల సమీక్ష సమావేశం వివరాలను ‘Co-WIN‌’ సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ‘యంత్రాంగం సమీకరణ, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరీక్షించడం, క్షేత్రస్థాయిలో ‘కో విన్‌’ వినియోగం, ప్రణాళిక, అమలు, ఎదురయ్యే సవాళ్లు, వాస్తవ కార్యాచరణకు చేపట్టాల్సిన చర్యలను ఈ కార్యక్రమంలో గుర్తిస్తాం’ అని ఆరోగ్య శాఖ తెలిపింది.

రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటు చేసిన మెకానిజంలో ప్రణాళికల్లో ఏమైనా అనుకోని అవాంతరాలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో పరీక్షించడమే లక్ష్యంగా ఈ డ్రై రన్ నిర్వహించనుంది. కరోనా వ్యాక్సి్న్ డ్రైవ్ కోసం ఎంపిక చేసిన ప్రత్యేకమైన గ్రూపుల్లో నుంచి ముందుగానే గుర్తించినవారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను సన్నద్ధం చేయనుంది. వీటికి సంబంధించి మొత్తం సమాచారాన్ని Co-WIN అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌లో నమోదు చేయనున్నారు. జిల్లా ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం/కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్, పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, ప్రైవేట్‌ ఆస్పత్రులు వంటి ఐదు విభాగాల్లో వ్యాక్సినేషన్‌ సన్నద్ధతను అంచనా వేయనుంది.

క్రిష్ణా జిల్లాలో డ్రై రన్ :
– జిల్లా ఆస్పత్రి/మెడికల్ కాలేజీ : GGH విజయవాడ
– CHC/PHC ఉప్పలూరు PHC
– ప్రైవేటు హెల్త్ సెక్రటరీ : పూర్ణ హార్ట్ ఇన్సిస్ట్యూట్
– అర్బన్ ఔట్ రీచ్ : పెనమలూరు పీహెచ్‌సీ
– రూరల్ ఔట్ రీచ్ : ప్రకాశ్ నగర్ eUPHC

– 26వ తేదీన డ్రై రన్ టీం సభ్యులకు శిక్షణ ప్రణాళిక
– 27వ తేదీన సెషన్ సైట్లలో ఇన్సెప్షన్ (డ్రై రన్)
– 28వ తేదీన డ్రై రన్ ప్రారంభం.. వీడియో కవరేజ్, రిపోర్టు ప్రిపరేషన్
– జిల్లా టాస్క్ ఫోర్స్ (DTF) కమిటీ, STF (స్టేట్ టాస్క్ ఫోర్స్ ) కమిటీకి సమర్పణ
– స్టేట్ టాస్క్ ఫోర్స్ రివ్యూ.. తదుపరి మార్గదర్శకాలకు సూచనలు
– MoHFWకు డ్రై రన్ ఫీడ్ బ్యాక్ అందజేత

డ్రై రన్ ప్రక్రియ :
వ్యాక్సినేటర్ (ANM) కోసం Co-WIN టెస్టు లింకును ( www.Uat.co-vin.in) & (www.app.uat.co-vin.in) అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత డ్రై రన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రతి ఐదు సెషన్ల సైట్లకు 25 మంది వ్యాక్సిన్ వేయించుకునేవారు ఉంటారు. ముందుగా హెల్త్ కేర్ వర్కర్లను డ్రై రన్ కోసం ఎంపిక చేశారు. ఈ టెస్టులో జనరేట్ అయ్యే SMS కేవలం డ్రై రన్ టెస్టింగ్ కోసం మాత్రమేనని సూచనలు ఉంటాయి.