Tirupati : భక్తులతో నిండిపోయిన బస్టాండు..అలిపిరి వద్ద ట్రాఫిక్ జాం

భక్తులతో తిరుమల ప్రాంతం కిక్కిరిసిపోయింది. తిరుపతిలోని రెండో సత్రం, అలిపిరి వద్ద టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో నిలిచారు. ఒక్కసారిగా తొక్కిసలాట...

Tirupati : భక్తులతో నిండిపోయిన బస్టాండు..అలిపిరి వద్ద ట్రాఫిక్ జాం

Ttd Bus Stand

Tirupati Bus Stand : తిరుపతి బస్టాండు వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో దర్శనానికి ఎలాంటి టోకెన్లు అవసరం లేదని టీటీడీ సంచలన ప్రకటన చేసింది. దీంతో తిరుమల కొండపైకి వెళ్లేందుకు బస్టాండుకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. దీంతో బస్టాండు మొత్తం కిక్కిరిసిపోయింది. బస్సులు ఎక్కేందుకు పోటీ పడుతున్నారు. సీట్లు దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బస్సుల సంఖ్యను పెంచేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. వాహనాలతో వెళ్లే వారు అలిపిరి కేంద్రం గుండా వెళుతున్నారు. దీంతో తనిఖీ కేంద్రం వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి ఉండలేక వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. టోకెన్లు తీసుకోవడానికి తాము పిల్లలతో మూడు రోజుల నుంచి ఇక్కడనే ఉన్నామని, 40 బస్సులు వేశామని చెబుతున్నారే కానీ.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఓ భక్తుడు 10tvతో తెలిపారు. తిరుమలలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని పలువురు భక్తులు పేర్కొంటూ.. టీటీడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.టీటీడీతో రవాణా శాఖ సమన్వయం చేసుకుని బస్సుల సంఖ్యను పెంచాల్సి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా తిరుమలలో లక్ష మంది భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

Read More : Tirupathi: తిరుపతిలో అనూహ్య రద్దీ.. అల్లాడిన భక్తులు, టీటీడీ ఘోర వైఫల్యం..10tv సాయం

తొక్కిసలాట.. స్పృహ తప్పిన భక్తులు : –
తిరుపతిలో ఎన్నడూ చూడని దృశ్యాలు కనిపించాయి. ఎక్కడ చూసినా భక్తులతో తిరుమల ప్రాంతం కిక్కిరిసిపోయింది. తిరుపతిలోని రెండో సత్రం, అలిపిరి వద్ద టోకెన్లు తీసుకోవడానికి భక్తులు వేచి ఉన్నారు. భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో నిలిచారు. ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు భక్తులు పడిపోవడం, ఎటూ వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తుల రద్దీ ఈమాదిరిగా ఉంటుందని టీటీడ అంచనా వేయలేకపోవడంతో పరిస్థితి అదుపుతప్పే విధంగా తయారైంది.

Read More : Tirumala : టీటీడీ సంచలన నిర్ణయం-టోకెన్ లేకుండానే శ్రీవారి దర్శనం

10tv సహాయం : –
సమాచారం అందుకున్న 10tv అక్కడకు చేరుకుని కౌంటర్ల దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో.. కళ్లకు కట్టినట్లు చూపెట్టింది. భక్తులు పడుతున్న ఇబ్బందులను బాహ్య ప్రపంచానికి తెలియచేసింది. క్యూ లైన్ లో ఇరుక్కున్న వారిని కాపాడే ప్రయత్నం చేసింది. నీళ్లో రామచంద్రా అంటున్న వారికి సహాయం చేసింది. దీంతో ఒక్కసారిగా టీటీడీ అలర్ట్ అయ్యింది. వెంటనే సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలాంటి టోకెన్లు లేకుండా.. నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని..భక్తులు ఆధార్ కార్డ్ చూపించి దర్శనానికి వెళ్లొచ్చని టీటీడీ ప్రకటించింది. ఈ విషయాన్ని మైక్ ద్వారా తెలియచేసింది. కానీ..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఈ విషయం అర్థం కాలేదు. దీంతో 10tv తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళ భాషల్లో మైక్ లో ప్రకటించింది. నేరుగా వెళ్లవచ్చని అక్కడున్న భక్తులకు తెలియచేయడంతో రద్దీ మెల్లిమెల్లితగా తగ్గిపోయింది. అనంతరం అక్కడ చెప్పులు, దుస్తులు, ఇనుప కంచెలు తెగిన దృశ్యాలు కనిపించాయి. టీటీడీ ఘోరంగా విఫలం చెందిందనే విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలో.. 2022, ఏప్రిల్ 13వ తేదీ బుధవారం నుంచి ఏప్రిల్ 17వ తేదీ ఆదివారం వరకు శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు టీటీడీ రద్దు చేసింది.