AP Rains : ఏపీలో విస్తారంగా వర్షాలు-నిండుతున్న జలాశయాలు

 ఆంద్రప్రదేశ్ లోని పలు జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

AP Rains : ఏపీలో విస్తారంగా వర్షాలు-నిండుతున్న జలాశయాలు

Prakasam Barrage

AP Rains :   ఆంద్రప్రదేశ్ లోని పలు జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని ఇది మరింత బలపడే అవకాశం ఉందని  అమరావతిలోని  వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆవర్తనం ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తా రాయలసీమలలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని… దక్షిణ ఛత్తీస్ ఘడ్, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అసాధారణ వర్షాలు కురిసే అవకాశంఉందని అధికారులు వెల్లడించారు. ఈనెల 12 లేదా 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలలో శుక్రవారం నుంచి కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. విజయనగరం జిల్లా మెరకముడిదాంలో అత్యధికంగా 22 సెం.మీ వర్ష పాతం నమోదయ్యింది. జిల్లాలోని గరివిడిలో 17 సెం.మీ, చీపురుపల్లిలో 13, తెర్లాంలో 12 సెం.మీ
వర్షపాతం రికార్డు అయ్యింది.

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 14 సెం.మీ వర్షపాతం నమోదవ్వగా….ఉమ్మడి గుంటూరు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు తిరుపతిలోనూ 3 సెం.మీకు పైగా వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 48 గేట్లు ఎత్తారు. సాయంత్రానికి 2 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వెళ్లినట్లు గేట్ల పర్యవేక్షణ ఈఈ చెప్పారు.  స్పిల్‌వే వద్ద నీటిమట్టం 28 మీటర్లకు పెరిగింది.

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు 1.20లక్షల క్యూసెక్కుల వరద వదులుతున్నారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బూరుగులంకరేవు వద్ద వశిష్ఠ గోదావరి అనుబంధ పాయలోని తాత్కాలిక దారి తెగిపోయింది. 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  విజయవాడలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ 25 గేట్లు అడుగుమేర ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

మన్యం జిల్లాలోని తోటపల్లి జలాశయం 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. జలాశయం గట్టు ఓ వైపు కోతకు గురైంది. ఇదే జిల్లాలోని వేగావతి నదికి వరద పోటెత్తడంతో సాలూరు పట్టణానికి 67ఏళ్లుగా క్రమం తప్పకుండా నీరందిస్తున్న తాగునీటి వ్యవస్థ దెబ్బతింది. బాగు చేసేందుకు 3 నుంచి 5రోజులు పడుతుందని అధికారులు తెలిపారు.

తుంగభద్ర జలాశయానికి శనివారం సాయంత్రానికి లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉంది. జలాశయానికి ఒకే రోజులో సుమారు 8 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం 72.951 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నిండటానికి ఇంకా 23 టీఎంసీలు అవసరం. ఇప్పటికీ ఎగువ నుంచి వరద భారీగా వస్తోంది. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేయనున్నట్లు తుంగభద్ర జలాశయ మండలి ఇంజినీర్లు తెలిపారు. నదీ తీర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

Also Read : Rains In Telangana : తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు