Hindupur Lok Sabha Constituency: పరిటాల ఫ్యామిలీ ఫామ్‌లోకి వస్తుందా.. వైసీపీ పట్టు నిలుపుకోగలదా?

Hindupur Lok Sabha Constituency: అనంతపురం జిల్లా హిందూపురం.. ఓ ప్రాంతమో, పార్లమెంట్‌ నియోజకవర్గమో కాదు.. ఓ ఎమోషన్‌ ! ఎన్టీఆర్‌తో అనుబంధం కనిపిస్తుంది.. కత్తులు దూసుకునే నేలలో రాజకీయం కఠినంగా వినిపిస్తుంది.

Hindupur Lok Sabha Constituency: పరిటాల ఫ్యామిలీ ఫామ్‌లోకి వస్తుందా.. వైసీపీ పట్టు నిలుపుకోగలదా?

Hindupur Lok Sabha Constituency: అనంతపురం జిల్లా హిందూపురం.. ఓ ప్రాంతమో, పార్లమెంట్‌ నియోజకవర్గమో కాదు.. ఓ ఎమోషన్‌ ! ఎన్టీఆర్‌తో అనుబంధం కనిపిస్తుంది.. కత్తులు దూసుకునే నేలలో రాజకీయం కఠినంగా వినిపిస్తుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురం పార్లమెంట్‌, అసెంబ్లీ.. ఆ పార్టీకి కంచుకోటగా నిలిచాయ్‌. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో సైకిల్‌ జైత్రయాత్ర కొనసాగింది చాన్నాళ్లు ! గతఎన్నికల్లో సీన్ మారింది. బీసీలను తమ వైపు తిప్పుకోవడంలో వైసీపీ సక్సెస్ అయింది. హిందూపురం పార్లమెంట్‌తో పాటు.. నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. మూడున్నరేళ్లు గడిచాయ్‌. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నాయ్. హిందూపురంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి..? వైసీపీ పట్టు నిలుపుకోగలదా..? బీసీల అడ్డాలో టీడీపీ బౌన్స్‌బ్యాక్ అవుతుందా.. పరిటాల కుటుంబం మళ్లీ గెలుపు పంజా విసురుతుందా.. రగులుతున్న అనంత రాజకీయం చెప్తుందేంటి..

వార్‌ వన్ సైడ్‌ అన్నట్లే కనిపిస్తుంది హిందూపురం రాజకీయం ఎప్పుడూ ! టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో సైకిల్ పార్టీ అభ్యర్థులు తప్ప మరొకరు గెలిచిన దాఖలాలు లేవు. పార్లమెంట్ స్థానాన్ని కూడా ఎక్కువసార్లు టీడీపీనే సొంతం చేసుకుంది. అలాంటి చోట గత ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలి టాప్‌ స్పీడ్‌లో వీచింది. హిందూపురం పార్లమెంట్‌తో పాటు.. ఆరు అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని.. టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టింది. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీ జనాభా ఎక్కువ. బీసీ ఓటు బ్యాంక్‌ టీడీపీ వైపే ఉండేది. ఐతే బలమైన కురుబ సామాజికవర్గానికి చెందిన గోరంట్ల మాధవ్‌ను బరిలోకి దింపిన వైసీపీ.. బీసీ ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టింది. ఎంపీ సీటు గెలుచుకోవడమే కాకుండా.. పార్లమెంట్‌ పరిధిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తా చాటింది.


వివాదాలకు కేరాఫ్‌గా గోరంట్ల మాధవ్‌

వార్‌ వన్‌సైడ్ అన్నట్లు గత ఎన్నికల్లో ఓటర్లు అంతా వైసీపీ వైపే కనిపించారు. ఐతే మూడున్నరేళ్లలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. దీంతో ఈసారి పోటీ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్‌.. వివాదాలకు కేరాఫ్‌గా ఉన్నారు. ఎమ్మెల్యేలను పట్టించుకోరు అనే ఆరోపణ ఉంది ఆయన మీద. ఆ మధ్య ఓ వీడియో వ్యవహారం వైసీపీని మరింత ఇరుకునపడేసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. బీసీ ఓటు బ్యాంక్‌ చెదిరిపోకుండా.. కురుబ సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తిని బరిలో దించాలని ప్లాన్ చేస్తోంది. కల్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్‌ను హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అటు ఇదే సామాజికవర్గానికి చెందిన దీపిక కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె భర్తకు వైఎస్‌ జగన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయ్. అది దీపికకు కలిసొచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.


హిందూపురం టీడీపీ టికెట్ రేసులో అంబికా లక్ష్మీనారాయణ

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నిమ్మల కిష్టప్ప.. ఈసారి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పెనుకొండ అసెంబ్లీ టికెట్‌ కోసం కిష్టప్ప ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నా.. సైకిల్ పార్టీలో టికెట్ కోసం ట్రయాంగిల్‌ ఫైట్ కనిపిస్తోంది. కురుబ సామాజికవర్గానికి చెందిన పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారథితో పాటు.. కురుబ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్‌ సవిత కూడా టికెట్‌ మీద ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం.. అధిష్టానాన్నిఆలోచనలో పడేసింది. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన హిందూపురం టీడీపీ సీనియర్ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ కూడా టికెట్ ఆశిస్తున్నారు. దీంతో టీడీపీ పెద్దలు ఎవరిని ఫైనల్‌ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


వైసీపీని టెన్షన్‌ పెడుతున్న వర్గ విభేదాలు

హిందూపురం పార్లమెంట్ పరిధిలో రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. హిందూపురం అసెంబ్లీ స్థానంలో టీడీపీ నుంచి బాలకృష్ణ మరోసారి బరిలోకి దిగడం ఖాయం. నందమూరి కంచుకోటైన ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న వైసీపీని.. వర్గపోరు టెన్షన్‌ పెడుతోంది. నవీన్ నిశ్చల్‌ స్థానంలో ఇక్బాల్ అహమ్మద్‌ని ఇక్కడ సమన్వయకర్తగా నియమించింది వైసీపీ. అప్పటి నుంచి వర్గపోరు పీక్స్‌కు చేరింది. నవీన్ నిశ్చల్‌ వర్సెస్ ఇక్బాల్ వర్గం మధ్య రోజుకో వివాదం తెరమీదకు వస్తోంది. ఈ ఇద్దరితో పాటు.. చౌలూరు రామకృష్ణారెడ్డి సోదరి కూడా హిందూపురం రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో విభేదాలు పీక్స్‌కు చేరుతున్నాయ్. ఎన్టీఆర్‌ వారసుడిని ఢీకొట్టేందుకు సిద్ధం అవుతున్న వైసీపీ.. ఈ లుకలుకలపై దృష్టిసారించకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు.


శ్రీధర్ రెడ్డిపై కొత్తకోట సోమశేఖర్ రెడ్డి వర్గం ఆగ్రహం

పుట్టపర్తి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి ఉన్నారు. జిల్లా ఏర్పాటు తనకు రాజకీయంగా లాభం చేస్తుందనే ధీమాతో కనిపిస్తున్నారు. నియోజకవర్గ జనాలకు అందుబాటులో ఉండరని రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో తలదూరుస్తారనే ఆరోపణలు ఉన్నాయ్. వీటికితోడు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు శ్రీధర్‌రెడ్డికి మైనస్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీధర్‌రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని… మాజీ ఎమ్మెల్యే పాముదుర్తి రవీంద్రారెడ్డి తనయుడు ఇంద్రజిత్ రెడ్డి బహిరంగంగానే వాదన వినిపిస్తున్నారు. గతంలో పుట్టపర్తి సమన్వయకర్తగా వ్యవహరించిన కొత్తకోట సోమశేఖర్ రెడ్డి వర్గం కూడా శ్రీధర్ రెడ్డి మీద గుర్రుగా ఉంది. ఈ మూడువర్గాలు ఎవరికి వారు టికెట్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చర్చ జరుగుతోంది. టీడీపీలోనూ ఇలాంటి సీనే ఉంది. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని సొంత పార్టీలో కీచులాటలు ఇబ్బంది పెడుతున్నాయ్. పల్లెకు టికెట్ ఇవ్వొద్దని సీనియర్ నేతలు అధిష్టానానికి సూచిస్తున్నారు. మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఇంటి పోరును చక్కదిద్దుకుంటే సైకిల్‌ పరుగుల పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.


టీడీపీ నుంచి కందికుంట వెంకటప్రసాద్‌కు టికెట్‌ ఖాయం

కదిరిలో పీవీ సిద్దారెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. సొంత పార్టీ నుంచే ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయ్. వైసీపీ సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి.. ఎమ్మెల్యేపై వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్ధారెడ్డి మృదుస్వభావి అని ముద్ర ఉన్నా… ఆయన అనుచరులు చేస్తున్న ఆగడాలు మితిమీరి పోయాయని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే.. వైసీపీకి భంగపాటు తప్పేలా లేదు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేరు టికెట్ రేసులో వినిపిస్తోంది. బీసీవర్గానికి చెందిన నేత కావడం.. మంచి మాస్‌ ఫాలోయింగ్‌ ఉండడం ఆయనకు ప్లస్‌. వైసీపీలో విభేదాలు కూడా టీడీపీకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయ్.


గుడ్‌ మార్నింగ్ కేతిరెడ్డి ప్రోగ్రాంతో రాష్ట్రవ్యాప్త గుర్తింపు

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్‌తో రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భూకబ్జా ఆరోపణలు వినిపిస్తున్నా.. ఎప్పటికప్పుడు ఆయన కొట్టిపారేస్తూనే ఉన్నారు. నిత్యం జనాల్లోనే ఉండడం.. జనాలకు అందుబాటులో ఉండడం.. కేతిరెడ్డికి కలిసొచ్చే అంశం. టీడీపీ తరఫున పరిటాల శ్రీరామ్‌, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మధ్య పోటీ కనిపిస్తోంది. ఇద్దరు నేతలు ధర్మవరం టికెట్ తమదే అంటూ ధీమాగా ప్రకటనలు చేస్తున్నారు. ఇద్దరికీ కాకుండా వేరొకరికి ఇస్తే.. ఈ ఇద్దరు సహకరించని పరిస్థితి. దీంతో టీడీపీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీరామ్‌, సూర్యనారాయణ వర్గాలకు చంద్రబాబు ఎలా నచ్చజెప్తారన్నది హాట్‌టాపిక్ అవుతోంది.


పెనుకొండ.. టీడీపీ టికెట్‌ రేసులో పార్థసారధి, సవిత

పెనుకొండ అసెంబ్లీ.. టీడీపీకి కంచుకోట. ఇక్కడి నుంచి పరిటాల రవి రెండుసార్లు విజయం సాధించారు. పరిటాల సునీత ఒకసారి.. పార్థసారథి రెండుసార్లు టీడీపీ తరఫున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి శంకరనారాయణ గెలిచి.. టీడీపీ కంచుకోటకు బీటలువారేలా చేశారు. రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేసినా.. జనాలు అందుబాటులో ఉన్నా.. నియోజకవర్గానికి శంకరనారాయణ ఏమీ చేసింది లేదు అనే విమర్శ ఉంది. నియోజకవర్గంలో సోదరుల పెత్తనం.. ఆయనకు మైనస్‌గా మారనుంది. నియోజకవర్గంలో గ్రూప్‌ తగాదాలు కూడా వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయ్. టీడీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బీకే పార్థసారథితో పాటు.. పార్టీసీనియర్ నాయకురాలు సవిత పేరు కూడా టికెట్ రేసులో వినిపిస్తోంది. ఇలా పెనుకొండలో రెండు పార్టీలను గ్రూప్ తగాదాలు ఇబ్బందిపెడుతున్నాయ్. ఇంటి రచ్చను చెక్ పెట్టి.. కలసికట్టుగా నడిచిన పార్టీనే ఇక్కడ విజయం వరించే అవకాశం ఉంది.


తిప్పేస్వామిని ఇబ్బందిపెడుతున్న ఇంటిపోరు

మడకశిర ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం. వైసీపీ నుంచి తిప్పేస్వామి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంటిపోరు తిప్పేస్వామిని తిప్పలు పెడుతోంది. ఎమ్మెల్యే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని సొంత పార్టీ నేతలే బహిరంగంగా చెప్తుండడం.. పార్టీని అప్రతిష్ట పాలు చేస్తోంది. 2024లో మడకశిర నుంచి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ తరఫున ఈరన్నకే టికెట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అందించే సహాయ సహకారాలే.. టీడీపీ గెలుపోటములను డిసైడ్ చేస్తాయ్.

Also Read: పేరు మాత్రం సాఫ్ట్…రాజకీయం మాత్రం మస్త్ హాట్…అనకాపల్లిలో పోటాపోటీగా పొలిటికల్ వార్


రాప్తాడు.. పరిటాల కుటుంబ రాజకీయాలకు కేరాఫ్‌

హిందూపురం పార్లమెంట్‌ పరిధిలో కీలక నియోజకవర్గం రాప్తాడు. ఇక్కడి రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా సెగలు పుట్టిస్తుంటుంది. టీడీపీకి కంచుకోట అయిన రాప్తాడు అంటే.. పరిటాల కుటుంబ రాజకీయాలకు కేరాఫ్‌ ! అలాంటి రాప్తాడు నుంచి గత ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. జనాలకు ఎప్పుడూ అందుబాటులో ఉండడం ఆయనకు ప్లస్‌. ఐతే సోదరుల వ్యవహారం.. ప్రకాశ్‌ రెడ్డికి మైనస్‌గా మారింది. ఈసారి కూడా వైసీపీ నుంచి ప్రకాశ్‌ రెడ్డి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తుండగా.. పోగొట్టుకున్న చోటే పరువు దక్కించుకోవాలని పరిటాల సునీత పట్టుదలతో ఉన్నారు. పాదయాత్రల పేరుతో రాప్తాడు నియోజకవర్గం మొత్తం కలియతిరుగుతూ జనాలతో కలిసిపోతున్నారు. ఐతే రాప్తాడులో ఈసారి కూడా టీడీపీ, వైసీపీ మధ్య ఢీ అంటే ఢీ అనే ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: రసవత్తరంగా బందరు పాలిటిక్స్…మచిలీపట్నం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు !

వైసీపీలో అసంతృప్తులు, వర్గ విభేదాలు
టీడీపీతో కంపేర్ చేస్తే.. వైసీపీలో అసంతృప్తులు, వర్గవిభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. సీఎం ఆఫీస్‌ వరకు ఈ పంచాయితీలు చేరాయ్. దీంతో పరిస్థితులను చక్కబెట్టే బాధ్యత మంత్రి పెద్దిరెడ్డికి జగన్ అప్పగించగా.. ఆయన ముందే వైసీపీ నేతలు గొడవలు పడుతున్న పరిస్థితి. టీడీపీకి కంచుకోట అయిన హిందూపురంలో పట్టు సాధించడమే గొప్ప అంటే.. లుకలుకలతో వైసీపీ ఆ పట్టు కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. జగన్ రంగంలోకి దిగితే తప్ప.. పరిస్థితులు సెట్‌రైట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇక అటు టీడీపీ ఈ లుకలుకలను క్యాష్‌ చేసుకోవాలని.. హిందూపురం పార్లమెంట్‌ పరిధిలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. దీంతో హిందూపురం పార్లమెంట్‌ ఫైట్ మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.