AP Exams: పక్కా ప్రణాళికతోనే ఉన్నాం.. సుప్రీంకు చెప్పిన ఏపీ సర్కార్

ఏపీలోని విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టెన్త్, ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టులో వాడీవేడి విచారణలు జరిగాయి. పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం పలు ప్రశ్నలు సంధించి విచారణను రేపటికి వాయిదా వేసింది. పరీక్షలు నిర్వహించాలనే తపనతో పాటు పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం వద్దనున్న విధి విధానాలేంటి..

AP Exams: పక్కా ప్రణాళికతోనే ఉన్నాం.. సుప్రీంకు చెప్పిన ఏపీ సర్కార్

Ap Exams (1)

AP Exams: ఏపీలోని విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టెన్త్, ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టులో వాడీవేడి విచారణలు జరిగాయి. పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం పలు ప్రశ్నలు సంధించి విచారణను రేపటికి వాయిదా వేసింది. పరీక్షలు నిర్వహించాలనే తపనతో పాటు పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం వద్దనున్న విధి విధానాలేంటి.. పరీక్షల నిర్వహణకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు మీదగ్గరున్న అస్త్రాలేంటి?.. మూల్యాంకనం చేయడం ఎలా.. అసలు ఎందుకు పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నారని ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీం వరస ప్రశ్నలు సంధించింది.

పరీక్షల నిర్వహణకు భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తామని.. యాభై వేల సిబ్బంది, స్కూల్స్, ప్రభుత్వ ఆఫీసులను పరీక్షా కేంద్రాలుగా వాడుకొని పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అయితే.. పరీక్షల నిర్వహణకు సంబంధించి పక్కా సమాచారం ఇవ్వాలని ఆదేశించినా ఎక్కడా కనిపించలేదని పేర్కొంది. పరీక్షల నిర్వహణ కారణంగా ఒక్కరు చనిపోయినా.. ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. మన నిర్ణయాలు భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది.

పరీక్షలు నిర్వహించే గదుల వివరాలు అఫిడవిట్‌లో ఎక్కడా లేవని, ఇలాంటి సమయంలో గదిలో 15 నుంచి 20 మంది కూర్చోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. రెండో దశ పరిస్థితి ఎలా ఉందో కళ్లారా చూశాం కదా.. అని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి ప్రశ్నించింది. వేలకొద్దీ పరీక్ష గదులను ఎక్కడ నుండి తెస్తారని.. పరీక్ష తర్వాత వాటిని మూల్యాంకనం ఎలా చేస్తారో మీ అఫిడవిట్​లో కనిపించలేదని పేర్కొంది. పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెపుతున్నా.. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని సుప్రీం వ్యాఖ్యానించింది.

కొంత సమయం ఇస్తే.. చర్చించి ప్రభుత్వం నిర్ణయం వెల్లడిస్తామని ఏపీ న్యాయవాది కోర్టుకు తెలిపగా.. ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని, ఈ వ్యవహారం విద్యార్థులపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. పరీక్షలు జరుగుతున్న సమయంలోనే మూడో వేవ్ వస్తే ఏం చేయాలో ఆలోచించకుండా ఎలా అఫిడవిట్ దాఖలు చేశారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈరోజు సాయంత్రానికి మీ నిర్ణయం చెప్పాలంటూనే విచారణ రేపే చేపట్టనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో పరీక్షల నిర్వహణ.. సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.