Jada Sravan Kumar: కోనసీమ అల్లర్ల కేసుల ఉపసంహరణ.. అంబేద్కర్ ను అవమానించడమే

అల్లర్ల వెనుక జనసేన నాయకులు ఉన్నారు అని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని జనసేన కూడా ఖండించాలి.

Jada Sravan Kumar: కోనసీమ అల్లర్ల కేసుల ఉపసంహరణ.. అంబేద్కర్ ను అవమానించడమే

Jada Sravan Kumar: కోనసీమ అల్లర్ల సందర్భంగా నిందితులపై పెట్టిన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అంబేద్కర్ ను అవమానించడమేనని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం చట్టాలను గౌరవించదా, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ప్రకటన చేస్తే ఇంక కోర్టులు ఎందుకు అని ప్రశ్నించారు.

కాగా, కోనసీమ జిల్లా పేరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయడంతో గతేడాది మే నెలలో అమలాపురంలో అల్లర్లు చెలరేగి హింసాత్మక ఘటనలు జరడంతో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితులుగా ఉన్న వారిపై కేసులు ఎత్తివేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జడ శ్రవణ్ కుమార్ స్పందించారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..
‘అల్లర్ల వెనుక జనసేన నాయకులు ఉన్నారు అని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని జనసేన కూడా ఖండించాలి. లేకపోతే జనసేన పార్టీ జెండాను పాతిపెడతాం. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే పవన్ కళ్యాణ్ ఖండించాలి. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లు కూడా ఖండించాలి. దేశానికి సేవ చేసిన అంబేడ్కర్ విగ్రహాలే ఎందుకు కూలగొడతారు? రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎందుకు కూలగొట్టడం లేదు? ఏప్రిల్ 14న ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే సభను దళితులు అందరూ బహిష్కరించాలి.

Also Read: కులాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు కుట్రలు.. తీరుమార్చుకోకపోతే ప్రజలే బుద్ధిచెబుతారు

కేసులు పెట్టడం, విత్ డ్రా చేయడం కుదరదు. కోర్టులు అనేవి ఫుట్ బాల్ కాదు ఆడుకోవడానికి అని సుప్రీంకోర్టు అనేక మార్లు చెప్పింది. జూపూడి ప్రభాకర్, మేరుగ నాగార్జున, పినిపే విశ్వరూప్ లు సీఎంను కలిసి ఈ విషయం కరెక్ట్ కాదని చెప్పాలి. జనసేన, టీడీపీలు ఈ విషయంలో జై భీమ్ చేసే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి. కేస్ లు విత్ డ్రా అంశంపై కోర్టులకు వెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడాల్సిందే. సీఎం ప్రకటన జీఓ రూపం దాల్చిందంటే మేము సీఎం ఇల్లు ముట్టడికి వెనుకాడం. కేసులు విత్ డ్రా అయితే రాష్ట్రం రావణ కాష్టం అవుతుంద’ని హెచ్చరించారు.

అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసులో ముగ్గురి అరెస్ట్
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం పాఠశాలలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు బాలురుతో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను గంటల వ్యవధిలో పట్టుకున్నామని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ తెలిపారు. ముద్దాయిలు స్కూల్లో విగ్రహం పెట్టేటప్పుడు కూడా గట్టిగా విభేదించారని వెల్లడించారు. గత సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్, అంబేద్కర్ ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలో అంబేద్కర్ బొమ్మ చింపి వేశారని చెప్పారు. ముద్దాయిలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.