జగన్ కోసం సర్దుకుపోదాం.. చీరాల వైసీపీ నాయకుడు ఎవరనేది ఆయనే తేలుస్తారు

  • Published By: naveen ,Published On : November 6, 2020 / 03:55 PM IST
జగన్ కోసం సర్దుకుపోదాం.. చీరాల వైసీపీ నాయకుడు ఎవరనేది ఆయనే తేలుస్తారు

karanam venkatesh: ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి. ఒకే పార్టీలో ఉన్నా కత్తులు దూసుకుంటున్నారు. వర్గ పోరు దాడులు, ఘర్షణలకు దారి తీస్తోంది. దీంతో చీరాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఈ పరిణామాలపై ఆమంచి కృష్ణమోహన్ స్పందించారు. స్థానిక పరిణామాలను ఎప్పటికీ సీరియస్ గా తీసుకోను అని ఆయన అన్నారు. కరణం కుటుంబం వేరే ప్రాంతం నుంచి వచ్చి రాజకీయ మనుగడ సాగిస్తున్నప్పుడు జాగ్రత్తగా మెలగాలి అన్నారాయన. చీరాలలో వైసీపీ నాయకుడు ఎవరు అనేది సీఎం జగన్ నిర్ణయిస్తారని ఆమంచి అన్నారు.

ఈ పరిణామాలపై కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేశ్ సైతం స్పందించారు. చీరాలలో కొందరు చాలా ఇబ్బంది పెడుతున్నారని కరణం వెంకటేశ్ అన్నారు. గతంలో ఎలా అరాచకాలు జరిగాయో అందరం చూశామన్నారు. కొందరి అరాచకాలను అడ్డుకునేందుకే అందరం ఒక వేదికపైకి వచ్చామన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా అందరం సమన్వయం పాటించాలని కోరారు. సీఎం జగన్ కోసం సర్దుకుపోదామని వెంకటేశ్ పిలుపునిచ్చారు. చీరాల పరిస్థితులపై అధిష్టానానికి వీడియో సహా అన్నీ వివరించానని కరణం వెంకటేశ్ చెప్పారు. చీరాల ప్రజలకు స్వేచ్చను కల్పిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామన్నారు.

చీరాలలో ఆమంచి వర్సెస్ కరణంగా పరిస్థితి మారింది. జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమంచి, కరణం వర్గాలు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంతో చీరాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.