Murder At Anantapuram : తన భార్య గురించి చెడుగా చెప్పాడని.. వియ్యంకుడి హత్య

తన భార్య గురించి చెడుగా చెప్పిన వియ్యంకుడిని ఒక వ్యక్తి హత్య చేసిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.

Murder At Anantapuram : తన భార్య గురించి చెడుగా చెప్పాడని.. వియ్యంకుడి హత్య

Atp Murder

Updated On : September 29, 2021 / 2:03 PM IST

Murder At Anantapuram : తన భార్య గురించి చెడుగా చెప్పిన వియ్యంకుడిని ఒక వ్యక్తి హత్య చేసిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. నగరంలోని ఒన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే రామ్మోహన్ అనే యువకుడు, రాణి నగర్ కు చెందిన ఖమర్ తాజ్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాల వారు అంగీకరించటంతో సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు.

రెండు కుటుంబాలకు రాకపోకలు బాగానే సాగుతున్నాయి. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం రామ్మోహన్ తల్లి కోవిడ్ బారిన పడి మరణించింది. ఇటీవల రామ్మోహన్ తమ్ముడు శివకృష్ణకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రామ్మోహన్ తండ్రి జగన్నాధ్(63), తమ్ముడితో కలిసి అత్తవారింటికి వెళ్లారు. ఖమర్ తాజ్ తమకు ఒక్కగానొక్క కూతురు కావటంతో ఆమె తల్లి తండ్రులు ఇబ్రహీం,నజీమాబేగంలు వియ్యాలవారిని సాదరంగా ఆహ్వానించి అన్ని మర్యాదలు చక్కగా చేయసాగారు.

Also Read : Gold Smuggling : మలాశయంలో గోల్డ్ పేస్ట్ దాచి స్మగ్లింగ్
ఈక్రమంలో సోమవారం సెప్టెంబర్ 27న జగన్నాధం, తన వియ్యంకుడు ఇబ్రహీంతో విడిగా కలిసి మాట్లాడాడు. ఆ క్రమంలో ఇబ్రహీం భార్య నజీమాబేగం ప్రవర్తన గురించి చెడుగా చెప్పాడు. దీంతో ఇబ్రహీం కోపోద్రిక్తుడయ్యాడు. అదే రోజు రాత్రి వియ్యంకులిద్దరూ ఒకే గదిలో పడుకున్నారు. మంగళవారం తెల్లవారుఝూమున లేచి చూడగా జగన్నాధం విగతజీవిగా కనిపించాడు.

ఇబ్రహీం జగన్నాధాన్ని కత్తితో విచక్షణా రహితంగా పొడిచి పారిపోయాడు. ఉదయం నిద్రలేచిన కుటుంబీకులు జగన్నాధం మృతదేహాన్ని చూసి హతాశులయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అనంతపురం ఒన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్ననిందితుడు ఇబ్రహీం కోసం గాలిస్తున్నారు.