Pawan Kalyan: తొక్కిపట్టి నార తీస్తా.. వైసీపీ నేతలూ.. యుద్ధానికి సిద్ధం కండి..!

తన సహనాన్ని అలుసుగా తీసుకుంటే.. అది వైసీపీకే నష్టమన్న పవన్.. యుద్ధానికి సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు.

Pawan Kalyan: తొక్కిపట్టి నార తీస్తా.. వైసీపీ నేతలూ.. యుద్ధానికి సిద్ధం కండి..!

Pawan

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీపై.. జనసేనాని పవన్ కల్యాణ్ యుద్దం ప్రకటించారు. తాను ఇకపై తగ్గేదే లేదని.. అవసరమైతే తొక్కి నార తీస్తానని అంటూ.. అధికార పార్టీ నేతలు, వారి రాజకీయాలపై విరుచుకుపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పవన్.. పార్టీ నేతలతో కలిసి శ్రమదానం చేశారు. తర్వాత.. బాలాజీపేటలో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో ఆవేశంగా మాట్లాడారు. తాను 2005 నుంచి రాజకీయాలను చూస్తూ వస్తున్నానని.. ఆవేదనతోనే ఇప్పుడు జనాల్లోకి వచ్చానని చెప్పారు.

జన సైనికులు.. ముఖ్యంగా.. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నాయకులు.. కోపాన్ని చట్టున చల్లార్చుకోవద్దని.. తన గర్భంలో లావాను దాచుకున్న అగ్నిపర్వతంలా జనసైనికులు కోపాన్ని గుండెల్లో పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఎవరినీ మాట అనకుండా రాజకీయాలు చేసుకుంటున్న తనను.. అనవసరంగా బయటికి లాగి.. బూతులు తిట్టి.. తనపై మానసిక అత్యాచారం చేస్తున్నారని పవన్ చెప్పారు. ఎవ్వరినీ తాను వదిలిపెట్టేది లేదని.. తేల్చి చెప్పారు. అయితే.. ప్రజల కోసమే తాను ఇంతటి బాధను అనుభవిస్తున్నానని.. సహనంగా ఉంటున్నానని అన్నారు. తగ్గి ఉంటున్నట్టు చెప్పారు.

తన సహనాన్ని అలుసుగా తీసుకుంటే.. అది వైసీపీకే నష్టమన్న పవన్.. యుద్ధానికి సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వాళ్లు.. వైసీపీ నేతల రాజకీయాలను ప్రశ్నించలేకపోతున్నారన్నారు. ఆ కారణంగానే తాను రోడ్లపైకి రావాల్సి వచ్చిందని.. ఇకపై ప్రశ్నిస్తూనే ఉంటానని.. యుద్ధం చేస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు.

మరోవైపు.. రాజ్యాధికారం దిశగా కాపు, తెలగ, ఒంటరి బలిజ వర్గాలకు చెందినవాళ్లు బయటికి రావాలని.. ఇన్నాళ్లూ అధికారాన్ని చలాయించిన వర్గాలకు బుద్ధి చెప్పేలా.. ఐక్యంగా కదలాల్సిన సమయం వచ్చిందన్న వాస్తవాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు. ఆయా వర్గాల ప్రజలు, నేతలు ఒక్కటైతేనే.. అధికారాన్ని అందుకోవడం సాధ్యమంటూ చెప్పుకొచ్చారు.

తనను పవర్ స్టార్ పవర్ స్టార్ అని సంబోధిస్తూ..నినాదాలు చేస్తున్న అభిమానులను పవన్ వారించారు. పవర్ ఇవ్వనప్పుడు తాను పవర్ స్టార్ ఎలా అవుతానని ప్రశ్నించారు. ఆ పవర్ దక్కే వరకూ తనను జనసేనానిగా పిలవాలని.. అదే తనకు ఇష్టమని పవన్ పదే పదే చెప్పారు. తనకు అన్ని కులాలు, మతాలపై గౌరవం ఉందని.. కమ్మ వాళ్లంటే వ్యతిరేకత లేదని.. అందుకే టీడీపీకి గతంలో మద్దతు ఇచ్చానని అన్నారు. తాను రెడ్లతో కలిసి పెరిగానని.. తన నిర్మాతలు కమ్మవారని.. దళితులు తన సోదరసోదరీమణులని.. ప్రతి వర్గాలవారూ తనకు సమానమే అని పవన్ చెప్పుకొచ్చారు. అందరి మద్దతుతో వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపు ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

తాను తన దారిలో నడుస్తూ ఉంటే.. అనవసరంగా బయటికి తెచ్చారన్న పవన్.. అవసరమైతే అందరినీ తొక్కిపట్టి నారతీస్తానంటూ హెచ్చరించారు. వైసీపీ నేతలారా.. యుద్ధానికి సిద్ధం కండి.. అంటూ మరోసారి సవాల్ చేశారు. జై హింద్ అంటూ.. ప్రసంగాన్ని ముగించారు.

బాలాజీపేటలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్