ఏపీలో అరెస్టుల కాలం : త్వరలో గంటా శ్రీనివాస్‌ అరెస్ట్‌! ఏం జరుగబోతోంది

  • Edited By: madhu , June 25, 2020 / 03:45 AM IST
ఏపీలో అరెస్టుల కాలం : త్వరలో గంటా శ్రీనివాస్‌ అరెస్ట్‌! ఏం జరుగబోతోంది

ఏపీలో మరో అరెస్ట్‌కు రంగం సిద్ధమైందా? ఇప్పటికే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో నేతను టార్గెట్‌ చేసిందా? గత ప్రభుత్వంలో కీలకశాఖకు మంత్రిగా ఉన్న నేతను అరెస్ట్‌ చేయనుందా? టీడీపీలోని కీలక నేతలకు.. వైసీపీ నాయకులు చేసిన హెచ్చరిక ఏంటి..?

ఏపీలో ఇప్పుడు అరెస్ట్‌ల కాలం నడుస్తోంది. గత ప్రభుత్వంలో ఉండి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై వైసీపీ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. దీంతో ఒక్కొక్కరి అక్రమాల చిట్టా విప్పుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది.

అంతేకాదు.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసింది. జేసీతోపాటు ఆయన కుమారుడు అస్మిత్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించింది. ఇక మాజీమంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. మాజీమంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పపైనా కేసులు నమోదయ్యాయి. ఇలా వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను టార్గెట్‌ చేసింది.

టీడీపీ నేతలను వరుసగా అరెస్ట్‌ చేస్తోన్న ఏపీ ప్రభుత్వం.. మరో అరెస్ట్‌కూ రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈసారి మాజీమంత్రి గంటా శ్రీనివాస్‌ను టార్గెట్‌ చేసినట్టు సమాచారం. సోషల్‌ మీడియా ఉదంతంలో ఆయన పాత్ర ఉందన్న ఆధారాలు ప్రభుత్వానికి లభిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో నెక్ట్స్‌ అరెస్ట్‌ గంటాదేనన్న ప్రచారం జరుగుతోంది.

విశాఖలో నలంద కిశోర్‌ అరెస్ట్‌ టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. సోషల్‌ మీడియాలో మహిళలను కించపరుస్తూ… ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తున్నారని నలంద కిశోర్‌ను సీఐడీ అరెస్ట్‌ చేసింది. నలంద కిశోర్‌.. గంటా శ్రీనివాసరావుకు అనుంగు అనుచరుడు. అంతేకాదు.. మంచి మిత్రుడు కూడా.  

దీంతో నలంద కిశోర్‌ అరెస్ట్‌ను గంటా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. కేవలం తనను రాజకీయంగా వేధించడానికే తన మిత్రులపై కేసులు పెడుతున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిని వదిలేసి…. వాటిని ఫార్వార్డ్‌ చేసిన వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

కేవలం తనను పొలిటికల్‌గా టార్గెట్‌ చేసుకుని… మిత్రుడైన కిశోర్‌పై అక్రమంగా కేసు పెట్టారని.. దీనిని తాను రాజకీయంగా ఎదుర్కొంటానని ఘంటా స్పష్టం చేశారు.

గంటా వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాస్‌, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ కేసు ఇక్కడితో ఆగదని… గంటా ఇంట్లో వ్యక్తుల పేర్లు, ఆయన ఇతర అనుచరులు కూడా ఇందులో ఉన్నారని తెలిపారు. చట్టం తప్పు చేసిన ఎవరినీ వదలదని హెచ్చరించారు. మహిళలపై నీచమైన రాతలు రాయడమేంటని ప్రశ్నించారు. సీఐడీ అధికారుల దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయికాబట్టే… నలంద కిశోర్‌ను అరెస్ట్‌ చేశారని… ఈ కేసు వెనుక ఎవరున్నా శిక్ష తప్పదన్నారు.

ప్రభుత్వంలోని పెద్దలు మరికొన్ని అరెస్ట్‌లు జరుగుతాయని స్పష్టం చెబుతుండడంతో… గంటా అరెస్ట్‌ కూడా కచ్చితం అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాకు చెందిన మాజీమంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయకేసు పెట్టడంతో కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందారు.

విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై కరోనా నిబంధనలు ఉల్లంఘించారనే కేసులు పెట్టారు. దీంతో నెక్ట్స్‌ గంటా శ్రీనివాసరావే అన్న ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈ కేసులో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో.

Read: బాకీ తీర్చమన్నందుకు, అప్పు ఇచ్చిన వ్యక్తి దారుణ హత్య