చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే: సీఎం జగన్

తుప్పుపట్టిన సైకిల్‌ను ఢిల్లీకి పంపి రిపేర్ చేయించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సైకిల్‌కు టైర్లు, ట్యూబులు, చక్రాలు, పెడల్ లేవని.. బెల్ ఒక్కటే మిగిలిందని..

చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే: సీఎం జగన్

CM Jagan in Korukonda: ఏపీలో ఎన్నికల పోలింగ్ కు కొద్దిరోజుల సమయమే ఉండడంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భగా మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ పెద్దలతో కలిసి ఇంటి వద్దకే పెన్షన్ రాకుండా అడ్డుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఢిల్లీ వాళ్లతో కుట్రలు చేసి సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో క్లాస్ వార్ నడుస్తోందని పునరుద్ఘాటించారు.

మోసాలు, అబద్దాలతో గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తుప్పుపట్టిన సైకిల్‌ను ఢిల్లీకి పంపి రిపేర్ చేయించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టో హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ తో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. దత్తపుత్రుడు సైకిల్ వెనకాలే కూర్చుంటాడని ఎద్దేవా చేశారు.

తుప్పుపట్టిన సైకిల్‌కు బెల్ ఒక్కటే మిగిలింది
”2019 ఎన్నికల్లోనే ప్రజలంతా కలిసి చంద్రబాబు సైకిల్‌ను ముక్కలు ముక్కలుగా విరగొట్టి పక్కన పడేశారు. ఆ తుప్పుపట్టిన సైకిల్‌ను రిపేర్ చేయించేందుకు చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. ఎర్రచొక్కాల దగ్గరకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దత్తపుత్రుడిని పిలిచి రిపేర్ చేయమంటే.. గ్లాసులో టీ తాగుతూ క్యారేజీ మీద మాత్రమే కూర్చుంటానని అన్నాడు. దీంతో వదినమ్మను బాబు ఢిల్లీకి పంపించారు. అక్కడి నుంచి వచ్చిన మెకానిక్‌లు తుప్పుపట్టిన సైకిల్‌ను చూశారు. ఆ సైకిల్‌కు టైర్లు, ట్యూబులు, చక్రాలు, పెడల్, సీటు లేదు. మధ్యలో ఫ్రేమ్ కూడా లేకపోవడంతో ఎలా బాగుచేస్తామని చంద్రబాబును మెకానిక్‌లు ప్రశ్నించారు. పిచ్చి చూపులు చూస్తూ బెల్ కొట్టడం మొదలుపెట్టారు. ఆ బెల్ పేరే అబద్దాల మ్యానిఫెస్టో” అంటూ సీఎం జగన్ విమర్శించారు.

Also Read: అందుకే.. జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు- మంత్రి గుడివాడ అమర్నాథ్

మళ్లీ అధికారంలోకి వస్తా.. బటన్ నొక్కుతా
పథకాలు ఆపగలరు.. తమ విజయాన్ని ఆపలేరని అన్నారు. జూన్ 4 తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన వారంలోనే బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. పేదవాడు, పెత్తందారుకి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని.. ప్రజలందరూ తమకు అండగా నిలబడాలని కోరారు. ఛీటింగ్ కేసుల్లో ఉన్న జనసేన అభ్యర్థికి ఓటు వేయొద్దని, తమ పార్టీ అభ్యర్థులను గొప్ప మెజారిటీతో గెలిపించాలని వేడుకున్నారు.