Rains In Telugu States : తెలుగు రాష్ట్రాలని వదలని వానలు

వానలు ఆగట్లేదు.. వరదలు తప్పట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు.. వారం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఆగిందనుకునేలోపే.. చినుకులొచ్చేస్తున్నాయ్. రెండు రోజులు పడకపోతే.. మూడో రోజు ముంచెత్తుతోంది.

Rains In Telugu States : తెలుగు రాష్ట్రాలని వదలని వానలు

Rains In Telugu States : వానలు ఆగట్లేదు.. వరదలు తప్పట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు.. వారం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఆగిందనుకునేలోపే.. చినుకులొచ్చేస్తున్నాయ్. రెండు రోజులు పడకపోతే.. మూడో రోజు ముంచెత్తుతోంది. రాబోయే మరికొన్ని గంటల్లోనూ.. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే.. కొన్ని జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయ్.

తెలంగాణలో.. రాబోయే కొన్ని గంటల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు  జారీ చేసింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మేరకు.. నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ఈ జిల్లాల్లో.. కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

భారీ వర్షాలకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులన్నీ.. అలుగు పోస్తున్నాయి. సుజాతనగర్ మండలంలోని ఎదుళ్ల వాగు.. ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోనే.. అతి పెద్ద సింగభూపాలెం చెరువు అలుగు పారుతోంది. జూలూరుపాడు, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలన్నీ జలకళను సంతరించుకున్నాయి. కొన్ని చోట్ల వరద పోటెత్తి.. పంటలు దెబ్బతిన్నాయి.

ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. బూర్గంపాడు బ్రిడ్జి కింద మట్టి కదిలింది. ఏపీ -తెలంగాణ సరిహద్దును కలుపుతూ.. భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్లే కిన్నెరసాని బ్రిడ్జి రోడ్డు కుంగిపోవడంతో.. వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కురిసిన భారీ వర్షానికి.. సింగరేణి ఓపెన్ కాస్ట్‌లోకి వర్షం నీరు చేరింది. దీంతో.. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి.. లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు అంతరాయం ఏర్పడినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వర్షం తగ్గిన తర్వాతే బొగ్గు ఉత్పత్తి పనులు ప్రారంభిస్తారని చెప్పారు సింగరేణి అధికారులు.

భారీ వర్షంతో.. చండ్రుగొండ ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లోకి వరద నీరు చేరింది. దీనికి తోడు డ్రైనేజీ సమస్యతో.. హాస్టల్‌ గదుల్లోకి నీరు చేరి బెడ్లు, ర్యాక్‌లను ముంచెత్తింది. విద్యార్థుల దుస్తులు, పుస్తకాలు తడిసిపోయాయి. హాస్టల్‌ గదుల్లోకి చేరిన వర్షపు నీటిని.. మోటార్ల ద్వారా బయటకు పంపే ప్రయత్నం చేశారు.

అటు.. నాగర్‌కర్నూలు జిల్లాలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షంతో.. అచ్చంపేట నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీరు చేరడంతో.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరద నీరు పంటపొలాను ముంచెత్తింది.

భారీ వర్షానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీటితో.. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో.. అక్కడి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుస వర్షాలతో.. కడప జిల్లాలోని పాపాగ్ని నదికి వరద పోటెత్తింది. నీటి ఉద్ధృతికి నదిలో తాత్కాలికంగా వేసిన మట్టిరోడ్డు కొట్టుకుపోయింది. దీంతో.. ఏటికి అవతల ఉన్న మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలిరెడ్డిపల్లె, తువ్వపల్లి, ఎగువ తువ్వపల్లి గ్రామాల ప్రజలు, స్కూల్ విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Also Read : CM KCR : పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్