CM KCR : పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సర్కార్.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది. గురువారం మధ్యాహ్నం 1.16 నిమిషాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సీసీసీని ప్రారంభించనున్నారు.

CM KCR :  పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

CM KCR :  కమాండ్స్ అన్నీ అక్కడి నుంచే వెళతాయ్.. కంట్రోలింగ్ అంతా అక్కడి నుంచే జరుగుతుంది. క్షణాల్లో రెస్పాండ్ అయ్యే సిస్టమ్ ఒక్కటే కాదు.. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే టెక్నాలజీ అక్కడుంది. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన.. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్.. మరికొన్ని గంటల్లో అందుబాటులోకి రానుంది. ఈ సీ క్యూబ్ సెంటర్‌‌ ప్రారంభమైతే.. అక్కడేం జరగబోతోంది? బంజారాహిల్స్ నుంచే.. తెలంగాణ మొత్తాన్ని మానిటర్ చేయొచ్చా?అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు

తెలంగాణ సర్కార్.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది. గురువారం మధ్యాహ్నం 1.16 నిమిషాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సీసీసీని ప్రారంభించనున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్.. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్.. తెలంగాణకు మూడో కన్నుగా పనిచేయబోతోంది. రాష్ట్రం నలుమూలలా అమర్చిన దాదాపు 10 లక్షల సీసీ కెమెరాల ఫుటేజీని.. ఇక్కడి నుంచే మానిటర్ చేయొచ్చు. మరో స్పెషాలిటీ ఏమిటంటే.. ఒకేసారి లక్ష సీసీ కెమెరాల ఫీడ్ చూడగలికే కెపాసిటీతో.. భారీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే.. సీసీ కెమెరాల్లోని ప్రత్యేక సాఫ్ట్‌వేర్ నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అలర్ట్ పంపుతుంది.

పోలీస్ శాఖ ఒక్కటే కాదు అన్ని ప్రభుత్వ శాఖలను ఇక్కడి నుంచి సమన్వయం చేసుకునే వీలుంది. తెలంగాణ స్టేట్ లెవెల్ మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్‌గా కూడా దీనిని చెప్పొచ్చు. హైదరాబాద్ సహా.. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా.. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు సహా.. ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడి నుంచే పర్యవేక్షించడంతో పాటు రియల్ టైంలోనే.. సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవచ్చు. అన్ని ప్రభుత్వ వ్యవస్థలను సమన్వయం చేసుకొంటూ.. విపత్తుల సమయంలో ప్రజలను సకాలంలో కాపాడటంతో పాటు నష్టాన్ని తగ్గించే వీలుంది.

ఈ కమాండ్ సెంటర్‌లో.. పోలీస్‌, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యశాఖ, ప్రకృతివిపత్తుల నిర్వహణశాఖ సహా.. ముఖ్యమైన అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కేంద్రాలు ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు.. అన్ని శాఖల సమన్వయంతో సమస్యను పరిష్కరిస్తారు. అదేవిధంగా.. రోజువారీ శాంతిభద్రతల నిర్వహణతో పాటు భారీ సభలు, ఉత్సవాల సమయంలో ఏర్పాటు చేసే బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ కూడా.. ఇక్కడి నుంచే చాలా ఈజీగా చేయొచ్చు. నిరంతర మానిటరింగ్‌తో.. రాష్ట్రంలో నేరాలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థే కమాండ్ కంట్రోల్ సెంటర్.

బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్ 12లో.. 585 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించారు. మొత్తం ప్రాజెక్ట్‌ను.. 6 లక్షల 42 వేల చదరపు అడుగుల్లో నిర్మించారు. ఇందులో 5 టవర్లు ఉన్నాయి. టవర్ ఏ‌లో.. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 19 అంతస్తులున్నాయి. టవర్-బీ, సీ, డీలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్నాయి. టవర్ ఏ పైభాగంలో.. 15 మంది కెపాసిటీ గల హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా.. హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.

టవర్ బి లో.. 15 అంతస్తులున్నాయి. ఇందులో.. టెక్నాలజీ ఫ్యూజింగ్ సెంటర్ ఉండనుంది. టవర్ సీ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆడిటోరియంతో పాటు రెండు అంతస్తులున్నాయి. టవర్ డీలో.. గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఇందులోనే.. మీడియా బ్రీఫింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు.  బిల్డింగ్ చుట్టూ35 శాతం గ్రీనరీ పెంచారు.  600 వాహానాలు పార్కింగ్ చేసుకునేలా  ఏర్పాటు చేశారు.  ఫ్లోర్ ఫ్లోర్ కు సోలార్ ప్లాంటు లు  ఉన్నాయి.

ఇక.. టవర్ ఈ లో.. కమాండ్ అండ్ కంట్రోల్ డేటా సెంటర్, సీసీ టీవీ మానిటరింగ్, వార్ రూమ్ ఉన్నాయి.  టవర్ Aలోని నాలుగో అంతస్తులోనే.. డీజీపీ ఆఫీస్, 18వ అంతస్తులో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. 14వ ఫ్లోర్‌లో గ్యాలరీ ఏర్పాటు చేశారు. 5, 6, 7వ అంతస్తుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు.

ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని.. ఏడో అంతస్తులో ప్రముఖుల చాంబర్లు ఏర్పాటు చేశారు. ఇందులోనే.. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక చాంబర్ ఉంటుంది. విపత్తుల వేళ.. సీఎం ఇక్కడి నుంచే అన్నీ పర్యవేక్షించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో లింక్ చేశారు. దీని వల్ల.. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా తెలుసుకునే వీలుంటుంది. అంతేకాదు.. అత్యాధునిక సైబర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ పోలీస్ కీర్తిని.. అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేలా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనిచేయబోతోంది. మరికొన్ని గంటల్లోనే.. సీఎం కేసీఆర్ దీనిని ప్రారంభించనుండటంతో.. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రపంచస్థాయి సాంకేతికతతో కొలువు దీరిన కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ట్వీట్‌ చేశారు. ‘ప్రపంచ స్థాయి తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు ప్రారంభించనున్నారు. అత్యంత అధునాతన ప్రభుత్వ సదుపాయం భారతదేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్మించి ఉండదు. దేశంలో ఈ తరహా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఇదొక్కటే అయ్యి ఉంటుంది’అని బుధవారం తన ట్వీట్‌లో మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మదిలోపుట్టిన మరో అద్భుత కట్టడం సీసీసీ అని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. ఈ కేంద్రం దేశానికే తలమానికంగా మారనున్నదని పేర్కొన్నారు. దేశంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం అధునాతన హంగులతో, నూతన టెక్నాలజీతో నిర్మించిన ఏకైక భవ నం సీసీసీ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు