Raptadu Assembly Constituency: వేడి పుట్టిస్తున్న రాప్తాడు రాజకీయాలు.. పరిటాల అడ్డా అని రుజువు చేస్తారా?

గత ఎన్నికల్లో తనయుడి కోసం సీటు త్యాగం చేసిన పరిటాల సునీత.. రాప్తాడు గడ్డ.. పరిటాల అడ్డా అని మరోసారి రుజువు చేస్తారా?

Raptadu Assembly Constituency: వేడి పుట్టిస్తున్న రాప్తాడు రాజకీయాలు.. పరిటాల అడ్డా అని రుజువు చేస్తారా?

Raptadu Assembly Constituency – ground report : రాయలసీమ.. రాయలసీమలో.. రాప్తాడు. అనంతపురం జిల్లాలోనే.. హాట్ సీటు. అంతకుమించి పొలిటిక్ హీట్ కొనసాగే సెగ్మెంట్. ఇక్కడ.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పేలుతున్న మాటల తూటాలు.. జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ వేడి పుట్టిస్తుంటాయ్. ఓటమెరుగని పరిటాల ఫ్యామిలి (Paritala Family)కీ.. దాని రుచి చూపించింది వైసీపీ. అంతేకాదు.. రాబోయే ఎన్నికల్లోనూ మళ్లీ గెలవబోయేది తామే అంటున్నారు అధికార పార్టీ నేతలు. దీనికి.. టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్ వేస్తోంది. ఒక్క చాన్స్ ఇచ్చినందుకే.. నియోజకవర్గాన్ని మొత్తం నాశనం చేశావు. ఈసారి గెలిచే చాన్సే లేదని.. రాప్తాడు పరిటాల అడ్డా అని.. మాజీ మంత్రి సునీత చెబుతున్నారు. మరి.. ఈ రెండు పార్టీల మధ్య.. రాబోయే ఎన్నికల్లో పోరు ఎలా ఉండబోతోంది? గెలుపుపై ఎవరి ధీమా.. ఎలా ఉంది?

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో కొన్ని హాట్ సీట్లు ఉంటాయ్. అందులో.. అనంతపురం జిల్లా (Anantapur District)లోని రాప్తాడు కూడా ఒకటి. ఎన్నికలతో సంబంధం లేకుండా.. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే సాగుతుంటాయ్. 2009లో ఏర్పడిన రాప్తాడు నియోజకవర్గం పరిధిలో మొత్తం ఆరు మండలాలున్నాయ్. అవి.. ఆత్మకూరు, అనంతపురం రూరల్, రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు. జిల్లాల విభజన తర్వాత నియోజకవర్గం పరిస్థితి విచిత్రంగా మారింది. రాప్తాడు సెగ్మెంట్ (Raptadu Segment).. ఇప్పుడు రెండు జిల్లాల పరిధిలో ఉంటోంది. ఇక్కడ.. ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు ఉంటారు. రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి సత్యసాయి జిల్లా పరిధిలో ఉండగా.. అనంతపురం రూరల్, రాప్తాడు, ఆత్మకూరు.. అనంతపురం జిల్లా పరిధిలోకి వస్తాయి. రాప్తాడు నియోజకవర్గం పరిధిలో మొత్తం 2 లక్షల 45 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ.. కురుబ సామాజికవర్గ ఓటర్లు అత్యధికంగా ఉంటారు. వాళ్లు ఎవరి వైపు మొగ్గు చూపితే.. వాళ్లదే విజయం అనే టాక్ ఉంది.

Thopudurthi Prakash Reddy

తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి (Photo: Facebook)

ఇప్పటివరకు.. రాప్తాడు నియోజకవర్గానికి 3 సార్లు ఎన్నికలు జరగ్గా.. రెండు సార్లు తెలుగుదేశమే గెలిచింది. పరిటాల సునీత (Paritala Sunitha).. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి కూడా చేపట్టారు. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ ప్రభంజనంలో.. రాప్తాడు కూడా ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడిపోయింది. అభివృద్ధే లక్ష్యమంటూ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. పరిటాల కుటుంబంపై దశాబ్దాలుగా పోరాటం చేసి.. గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఓటమెరుగని పరిటాల కుటుంబం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిటాల శ్రీరామ్‌పై.. ఏకంగా 26 వేల మెజారిటీతో గెలిచి సంచలనం సృష్టించారు ప్రకాశ్ రెడ్డి.

గతంలో రెండు సార్లు ఓటమిపాలవడం, జగన్ వేవ్, పరిటాల కుటుంబ సభ్యుల తీరు.. ఆయనకు కలిసొచ్చాయ్. అయితే.. రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా.. ఆయన సోదరుల తీరు వల్లే వైసీపీ నేతలే చాలా మంది దూరమవుతున్నారు. పార్టీలోనూ.. అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. గతంలో.. ప్రకాశ్ రెడ్డి గెలుపు కోసం సహకరించిన రెడ్డి సామాజికవర్గం నేతలే.. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారారు. వాళ్లంతా.. టీడీపీలోకి వెళ్లలేక.. ప్రకాశ్ రెడ్డితో ఉండలేక.. సతమతమవుతున్నారు.

ఇక.. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధితో పోలిస్తే.. వైసీపీ సర్కార్ వచ్చాక.. రాప్తాడులో చెప్పుకోదగ్గ డెవలప్‌మెంట్ ఏమీ జరగలేదనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా.. టీడీపీ హయాంలో వచ్చిన జాకీ కంపెనీ.. ఎమ్మెల్యే సోదరుల బెదిరింపులతోనే వెనక్కి వెళ్లిపోయిందనే ఆరోపణలున్నాయ్. ఇవి.. పెద్ద మైనస్‌గా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే.. జాకీతో పాటు మరో గార్మెంట్స్ పరిశ్రమను తీసుకొస్తున్నామని.. దానికి సంబంధించిన పేపర్ వర్క్ జరుగుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే సోదరుల తీరే.. ఆయనకు నష్టం చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే.. స్థానికంగా పరిస్థితులు ఎలా ఉన్నా.. రాబోయే ఎన్నికల్లో గెలవబోయేది మాత్రం తామేనని చెబుతున్నారు వైసీపీ నాయకులు. ఇందుకు.. జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి.. తమను గెలిపిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు.

Paritala Sunitha, Paritala Sreeram

పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ (Photo: Twitter)

రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం బలంగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. పరిటాల ఫ్యామిలీనే.. టీడీపీకి బలం. అదే.. లోకల్‌గా బ్రాండ్ కూడా. కానీ.. ఎన్నికల్లో గెలవాలంటే అదొక్కటే సరిపోదు. జనంలో తిరగాలి. వారి సమస్యలను పట్టించుకోవాలి. లోకేశ్ పాదయాత్రతో టీడీపీలో వచ్చిన జోష్‌ని, సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతని తెలుగుదేశం క్యాష్ చేసుకోలేకపోతోందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికీ.. రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తారా? ఆమె కుమారుడు శ్రీరామ్ బరిలోకి దిగుతారా? అన్న దానిపై క్లారిటీ లేదు. తెలుగుదేశం అధిష్టానమైతే.. సునీతనే ఇంచార్జ్‌గా కొనసాగిస్తోంది. వైసీపీ వ్యూహాన్ని బట్టి.. టీడీపీ నిర్ణయం ఉండే అవకాశముంది.

Also Read: గన్నవరంలో వంశీ బలమెంత.. పట్టాభి దూకుడు టీడీపీకి మైనస్‌గా మారనుందా?

BK Parthasarathi

బీకే పార్థసారథి (Photo: Facebook)

ఒకే ఇంట్లో ఇద్దరికి టికెట్ ఇస్తుందా?
ఎమ్మెల్యే సోదరులపై ఉన్న వ్యతిరేకత కారణంగా.. వైసీపీ ఇక్కడ బలంగా ఉన్న కురుబలకు టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారముంది. అదే జరిగితే.. టీడీపీ కూడా వ్యూహాన్ని మార్చే అవకాశముందంటున్నారు. అప్పుడు.. మాజీ ఎమ్మెల్యే పార్థసారథిని గానీ మరొకరిని గానీ బరిలో దించే చాన్స్ ఉంది. వైసీపీ నుంచి కురుబల్లో.. రాప్తాడుపై ఎవరూ ఫోకస్ పెట్టలేదు. కానీ.. జడ్పీ ఛైర్‌పర్సన్ గిరిజమ్మ రాప్తాడు వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కానీ.. ఇవన్నీ ప్రచారాలేననే వాదన వినిపిస్తోంది. ఇక.. పరిటాల శ్రీరామ్ మాత్రం ధర్మవరంపై ఫోకస్ పెట్టారు. పరిటాల సునీతకు.. రాప్తాడులో తిరుగులేదు. అయితే.. టీడీపీ అధిష్టానం ఒకే ఇంట్లో ఇద్దరికి టికెట్ ఇస్తుందా? ఒక్కరికే ఇస్తే.. ఎవరిని.. ఎక్కడ పోటీ చేయిస్తారన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఇదిలా ఉంటే.. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు.. ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. మాజీ మంత్రి పరిటాల సునీత చెబుతున్నారు.

Also Read: బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారా.. ఒంగోలు సెగ్మెంట్‌లో ఈసారి టఫ్ ఫైట్ తప్పదా!

పరిటాల ఫ్యామిలీకి చెక్ పెడతారా?
దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. మరోసారి పరిటాల ఫ్యామిలీకి చెక్ పెట్టాలని.. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే తోపుదుర్తిని.. రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపించేందుకు పరిటాల సునీత పావులు కదుపుతున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య ఇప్పటికే జరుగుతున్న మాటల యుద్ధం.. ఎన్నికల రణరంగాన్ని తలపిస్తోంది. సహజంగా.. ఎన్నికల సమయంలో పేలే మాటల తూటాలు.. ఇప్పుడే పేలుతున్నాయ్. ఈ పరిస్థితుల్లో.. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే తోపుదుర్తికి.. పరిటాల ఫ్యామిలీ చెక్ పెడుతుందా? లేక.. ఆయనే మరోసారి గెలిచి.. రాప్తాడులో తానే తోపునని నిరూపించుకుంటారా? అన్నది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో తనయుడి కోసం సీటు త్యాగం చేసిన పరిటాల సునీత.. రాప్తాడు గడ్డ.. పరిటాల అడ్డా అని మరోసారి రుజువు చేస్తారా? అన్నది తెలియాలంటే.. ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే. ఈసారి.. రాప్తాడులో ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపించబోతుందన్నది కూడా ఆసక్తిగా మారింది.